ఆట ఆడుతున్నప్పుడు ఉండే ఆవేశకావేశాలు విజయం వరించిన తర్వాత విజయోత్సవంగా మారుతాయి. గెలిచిన తర్వాత ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అంతదాకా సాగిన యుద్ధకాండ, బీభత్సరసం తొలగిపోయి ప్రశాంత వాతావరణంలో పరిపాలనకు పూనుకోవాల్సి ఉంటుంది. గెలుపుకు బాట వేసిన పోరాటాలు, ఉద్యమాలు, స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షలు, రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమ ఇప్పుడు మలుపు తిప్పిన చరిత్ర. వాటిని రికార్డు చేయడం అవసరం. ఆశయాల సాధనకు రేవంత్ రెడ్డితో పాటు ఎందరో అలుపెరుగని పోరాటాలు చేశారు. ఆరు గ్యారంటీలు ప్రజలను బాగా ఆకర్షించాయి. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నాయకత్వంలో రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో అనేక విషయాలు పొందుపరచబడ్డాయి. ప్రజలను కొత్తగా ఆలోచింపజేశాయి. మార్పు రావాలి. కాంగ్రెస్ రావాలి. సాలు దొర, సెలవు దొర వంటి నినాదాలు అద్భుతంగా ఆకర్షించాయి.
రాష్ట్ర విజయం అందరిది..
రైతుబంధు బాధితులైన రైతు కూలీలు, కౌలుదార్లు, ధరణి బాధితులైన లక్షలాది పేద రైతులు మౌనంగా నిరీక్షించి సరైన నాయకత్వం రాగానే తమ అభిప్రాయాలను వెల్లడి చేశారు. నిరంతర ఆవేదనతో, ఉద్రేకంతో రగిలిపోయిన నిరుద్యోగులు, నిప్పురవ్వలై గ్రామగ్రామాన ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. తమకు కావాల్సిన ప్రభుత్వం ఏమిటో అర్థం చేసుకున్నారు. ఓట్లు వేయించారు. ఒక నిరుద్యోగి, పేదరాలు బర్రెలక్క శిరీష ఎన్నికల్లో నిలబడి కోట్లాది హృదయాలను గెలుచుకొని ప్రపంచవ్యాప్తంగా యువతరంలో స్ఫూర్తి నింపింది. దాంతో నిరాశ నిస్పృహలతో ప్రచారం చేద్దామనుకున్న నిరుద్యోగులకు, యువతకు ఊహించలేని ఉత్సాహం, ఆత్మ విశ్వాసం పెరిగింది. ఇది ప్రతి నియోజకవర్గంలో ఓట్ల రూపంలో ప్రతిఫలించింది. హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూతా రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు తెచ్చుకోవడంప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం. వాళ్ళు గెలవడానికి, ఓట్లు తక్కువ పోలవ్వడానికి రియల్ ఎస్టేట్, సాఫ్ట్‌వేర్ రంగానికి మధ్య ఏదో సంబంధం ఉండి ఉంటుంది
ఈ గెలుపు కాంగ్రెస్ గెలుపు మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కేవలం టీఆర్ఎస్ వల్లో, కేసీఆర్ వల్లో సాకారం కాలేదు. అది కోట్లాది ప్రజల త్యాగాలతో, ఉద్యమాలతో సాకారమైంది. అంతిమంగా సోనియాగాంధీ, స్పీకర్ మీరా కుమార్, ప్రతిపక్ష బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కలిసి కట్టుగా పూనుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కానీ ప్రజల త్యాగాలను గెలుపును కేసీఆర్ తనదే అని ప్రచారం చేసుకున్నారు. ఆ గెలుపు అందరిదీ. ఈ మాట అన్నందుకు ఈటల రాజేందర్‌పై పగపట్టారు. ఒక సెక్షన్ ప్రజలకు దూరమయ్యారు. ఇక అక్కడి నుండి కేసీఆర్ వేసిన ప్రతీ అడుగులు తప్పటడుగులే.
ఇది ప్రజల రెండో విజయం
అలాగే కాంగ్రెస్ విజయం కూడా తెలంగాణ ప్రజల రెండవ విజయం. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని వర్గాలు కలిసి ఉద్యమించాయో దాదాపు అన్ని విభిన్న వర్గాలు 'గెలిపించిన చేత్తోనే ఓడించడానికి' కృషి చేశాయి.
ప్రజలు ఓపిక పట్టారు. లోలోపల బాధపడ్డారు. పదేళ్ళు గెలిచి భోగభాగ్యాలు అనుభవించిన వారికి సహజంగానే అహంకారం, గర్వం, నిర్లక్ష్యం తలకెక్కుతుంది. అందుకే అమెరికాలో నాలుగేళ్లకోసారి రెండుసార్లు మించి అధ్యక్షుడు కాకూడదని 200 ఏళ్ల క్రితమే రాజ్యాంగంలో పొందు పరుచుకున్నారు. అంతేగాక బీసీల కుల గణన చేస్తామని ఇచ్చిన హామీ ఓట్లను చాలామేరకు మలుపు తిప్పింది. ప్రజాస్వామిక వాదుల, తెలంగాణ ఉద్యమకారుల నిరంతర కృషి కాంగ్రెస్‌కు తోడై నిలిచింది.
మారనందునే ఓడించారు
కేసీఆర్ అధికారంలోకి రావడంతోనే అందరికన్నా ఎక్కువగా పోలీసు నియామకాలు చేశారు. ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించారు. ఇవి వారు భవిష్యత్తులో పోలీసుల మీద ఆధారపడి పరిపాలన చేయాలనుకున్నారని స్పష్టం చేశాయి. ఎన్నుకున్న ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి మనకెందుకని ప్రజలు అనుకున్నారు. అసలు సచివాలయానికి రాకుండా, ప్రజలకు ప్రజా ప్రతినిధులకు దొరకకుండా ఇంటికాడ నుంచి, ఫామ్ హౌజ్ నుండి పరిపాలించడం అన్నిటికన్నా పెద్ద లోపం. ఇందుకే కేసీఆర్‌కి పరిపాలన రాదనుకున్నారు ప్రజలు.
ఇప్పుడు ఓడినవారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వాళ్ళు ప్రజల కోసం కృషి చేశారు కనుకే ఇంత కాలం ప్రజలు గెలిపించారు. ఎంత కృషి చేశారో స్వయంగా నేనే వందకు పైగా వ్యాసాలు, ఐదు పుస్తకాలు ప్రచురించాను. ఏమి చేయలేదో, ఎక్కడ పొరపాట్లు చేశారో కూడా యాభైకి పైగా వ్యాసాలు రాశాను. కేసీఆర్‌కు స్వయంగా పలు సూచనలు చేశాను. చెప్పడం నా ధర్మం. స్వీకరించడం, స్వీకరించకపోవడం వారి ఇష్టం. వారి ఇష్టప్రకారమే నడిచారు. అందుకే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి ఓడించారు.
- బి.ఎస్. రాములు
బీసీ కమిషన్ తొలి ఛైర్మన్, తెలంగాణ
83319 66987