మణిపూర్‌లో.. అమెరికాకు ఏం పని?

US offers to Help India To Deal With Manipur Violence

Update: 2023-07-19 23:15 GMT

భారత్ లోని మణిపూర్లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న దాడిలో ఇంకా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆస్తులు ధ్వంసం అయ్యాయి. పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇప్పటికి ఆరని కుంపటిగా మణిపూర్ మండుతూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలలో వాటిని సరిదిద్దక ఇంకా జరుగుతున్న నష్టాన్ని చూసి కూడా కేంద్ర పెద్దలు ఆ రాష్ట్రంలో ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టడం లేదనేది అర్థం కాని విషయం. ఇందుకు రాజకీయ కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి పాలన ప్రవేశ పెడితే మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కేంద్రం తాత్సారం చేస్తుంది. ఎందుకంటే మణిపూర్‌లో ఉండేది బీజేపీ ప్రభుత్వమే! ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే బీజేపీకే చెడ్డపేరు వస్తోందని కేంద్రం వెనకంజ వేస్తోంది. ఇదిలా ఉండగా మణిపూర్‌లో పరిస్థితి చక్కదిద్దుతానంటూ అమెరికా ముందుకొచ్చింది. ఏం ఆశించి అమెరికా ముందుకు వచ్చిందో అర్థం కాని ప్రశ్న.

మేమే.. పరిష్కరించుకుంటాం!

ప్రపంచంలో ఇప్పటికే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. యుద్ధంలో రెండు దేశాలు భారీగా నష్టపోయాయి. అనేక ప్రాంతాలు ఉనికి లేకుండా పోయాయి. యుద్ధ నివారణకు అమెరికా నడుం బిగించాల్సింది పోయి యుద్ధాన్ని ఇంకా ఎగదోస్తోంది. ఇప్పుడేమో తగుదునమ్మా అంటూ భారత్ లో తల దూర్చడం, భారత్ అంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం అవివేకం. ముందు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నిలుపు చేసి శాంతి దూతగా అమెరికా పేరు తెచ్చుకుంటే ప్రపంచం మొత్తం సంతోషిస్తుంది. ప్రపంచంలో శాంతిని నెలకొల్పి దేశాల మధ్య సఖ్యత ఏర్పాటు చేయడంలో అమెరికా కృషి చేయాలి. అప్పుడే అందరూ అమెరికాను ప్రశంసిస్తారు. అంతే కానీ ఒక దేశ వ్యవహారాలలో తల దూర్చి ఆ దేశంపై పెత్తనం చేయడం అమెరికాకు తగదు. ఇప్పటికే వెనుజుల దేశంపై పలు ఆంక్షలు విధించిన అమెరికా అపప్రథను మూటగట్టుకుంది. వెనుజులాలో నిత్యావసరాలు, మందులు, ఆహారం అందకుండా ఆ దేశాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. ఇటువంటి కఠోర నిర్ణయాలు, విధానాలు అమలు చేసే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని వెనుజులా పేర్కొంది. ఈ విషయంపై ఇటీవల 212 వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వెనుజులా అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగెజ్ సైతం అసహనం వ్యక్తం చేశాడు.

ఇవన్నీ పక్కకు పెట్టిన అమెరికా, దక్షిణ ఆసియాలో భాగమైన భారత్‌లోని ఒక ఈశాన్య రాష్టం మణిపూర్‌లో జోక్యం చేసుకుంటానని అమెరికా చెప్పడం హాస్యాస్పదం. ఏ సమస్యనైనా స్వంతంగా పరిష్కరించుకునే శక్తి, యుక్తి భారత్‌కు ఉంది. అందుకే, మా దేశ వ్యవహారాలలో అమెరికా జోక్యం సహించం అని భారత్ దీటుగా చెప్పింది. అమెరికా వాదన చూసేవారికి, వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. మీకు చేతనైతే విశ్వంలో శాంతిని పూయించు చాలు. ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలిలో 6వ దేశం ఏది ఉండాలో నిర్ణయించాలి. లేక సమితిని 10 శాశ్వత సభ్యదేశాలుగా చేసి తన పెద్దతనం నిరూపించుకోవాలి. అంతే కాని మణిపూర్‌లో జోక్యం చేసుకోవడం, అక్కడ పరిస్థితి చక్కదిద్దుతా అనడం అనవసరం. ఇది సరైనది కాదు. మణిపూర్‌లో త్వరలోనే సాధారణ వాతావరణం నెలకొంటుందని, పరిస్థితి కుదుట పడుతుందని ఆశిద్దాం.

కనుమ ఎల్లారెడ్డి,

పౌరశాస్త్ర అధ్యాపకులు,

93915 23027

Tags:    

Similar News