ఉన్నది ఉన్నట్టు :వారసత్వం లేనిదెక్కడ?

జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకోవడం వెనక బీజేపీకి స్పష్టమైన వ్యూహమే ఉన్నది. రెండు రోజుల కసరత్తులో తెలంగాణపై

Update: 2022-07-06 19:00 GMT

నిజానికి కేసీఆర్ ఎనిమిదేళ్ల విధానాన్నే ఇప్పుడు మోడీ అనుసరిస్తున్నారు. అధికారాన్ని కేంద్రీకృతం చేసుకోవాలంటే విపక్షాలను లేకుండా చేయాలని కేసీఆర్ భావించారు. ఆయన కార్యాచరణ కూడా అదే తీరులో సాగింది. కాంగ్రెస్, తెలుగుదేశం ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. ఆ పార్టీల శాసనసభా పక్షాలను టీఆర్ఎస్‌లో విలీనం చేయించారు. ప్రతిపక్షం లేకుండా చేసుకోగలిగారు. సరిగ్గా బీజేపీ కూడా ఇప్పుడు అదే చేస్తున్నది. కేసీఆర్‌కు ఇది మింగుడుపడడం లేదు. అందుకే బీజేపీపైనా, మోడీపైనా విరుచుకుపడుతున్నారు. మోడీ, కేసీఆర్ ధోరణులు రెండూ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. విపక్షాల గొంతును నొక్కే పెత్తందారీ ధోరణులు. 'అప్రజాస్వామికం' అనే నాణానికి ఈ రెండూ బొమ్మా బొరుసు.

జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకోవడం వెనక బీజేపీకి స్పష్టమైన వ్యూహమే ఉన్నది. రెండు రోజుల కసరత్తులో తెలంగాణపై ప్రత్యేకంగా ఒక తీర్మానాన్ని (పత్రం) చర్చించింది. చివరకు 'కుటుంబ పాలన నిర్మూలన' అనే నినాదాన్ని తెరపైకి తెచ్చింది. చాలాకాలంగా 'వారసత్వ రాజకీయాలు' అంటూ విపక్షాలపై విరుచుకు పడుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే విపక్షాలు లేని రాజకీయాలను కోరుకుంటున్నది. కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు దేశంలో అనేక రాష్ట్రాలలో వారసత్వ రాజకీయాలే కొనసాగుతున్నాయి. అది లేని వ్యవస్థను కోరుకుంటున్నదంటే బీజేపీ మాత్రమే పాలన సాగించాలని, ఉనికిలో ఉండాలని చెప్పుకోవడమే అవుతుంది.

గతంలో 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అనే నినాదాన్ని ఇచ్చింది. అప్పుడూ వారసత్వ రాజకీయాలనే ప్రస్తావించింది. నెహ్రూ మొదలు రాహుల్ వరకు అందరి పేర్లనూ తెరపైకి తెచ్చింది. ఇప్పుడు 'పరివార్‌వాదీ పార్టీ' అంటూ తెలంగాణను టార్గెట్ చేసింది. నిజానికి బీజేపీలోనూ వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అనురాగ్‌ ఠాకూర్, ధర్మేంద్ర ప్రదాన్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు మొదలు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మాజీ మంత్రుల వరకు పదుల సంఖ్యలో కనిపిస్తారు. వీరికి వర్తించని వారసత్వ రాజకీయాలు విపక్షాలకు ఆపాదించడమే విశేషం. ఏదో ఒక పేరుతో విపక్షాలను ఇరకాటంలో పెట్టి, నిర్వీర్యం చేసి రాజకీయంగా ఏకఛత్రాధిపత్యం కొనసాగించడమే బీజేపీ లక్ష్యం.

అంతా స్వార్థ రాజకీయమే

కాంగ్రెస్ పార్టీతో మొదలుపెట్టిన 'వారసత్వ' నినాదాన్ని ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకూ వర్తింపజేస్తున్నది బీజేపీ. వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రధాని మోడీ పిలుపు ఇవ్వడం వెనక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఇతర పార్టీలేవీ ఉనికిలో ఉండకూడదన్నదే దాని పరమార్ధం. ఏ బహుళ పార్టీ ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పుకుంటున్నదో దాన్ని నిర్వీర్యం చేయడమే బీజేపీ లక్ష్యం. ఏకపార్టీ పాలనలోకి తీసుకెళ్లాలన్నదే దాని అంతిమ లక్ష్యం. అందుకే తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాన్ని వేలెత్తి చూపుతున్నది. ఇక్కడ అధికారంలోకి రావాలంటే ఆ నినాదాన్ని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లడమే ఏకైక మార్గం. నిజానికి వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికితే దేశంలో చాలా పార్టీలు ఉనికిని కోల్పోతాయి, ప్రజలకు బీజేపీ తప్ప ఇంకోటి కనబడదు.

కాశ్మీర్‌లో ముఫ్తీ, అబ్దుల్లా కుటుంబాలు లేకుండా రాజకీయాలను ఊహించుకోలేం. రాజస్థాన్‌లో వసుంధరా రాజె, హర్యానాలో చౌతాలా, హూడా, ఉత్తరప్రదేశ్‌లో యాదవ్ (ములాయం, అఖిలేష్) కుటుంబం, బిహార్‌లో లాలూ యాదవ్, జార్ఖండ్‌లో సోరేన్, ఒడిశాలో పట్నాయక్, మహారాష్ట్రలో పవార్, థాకరే, కర్నాటకలో దేవెగౌడ-కుమారస్వామి, తమిళనాట స్టాలిన్, ఏపీలో చంద్రబాబు, జగన్, తెలంగాణలో కేసీఆర్ ఇలా అనేక రాష్ట్రాలలో వారసత్వమో లేక కుటుంబ పాలనో కొనసాగుతున్నది. వీటిని కాదనడమంటే ప్రాంతీయ పార్టీలను నిరాకరించడమే. విపక్షాలను లేకుండా చేయడమే.

మరి వీరి మాటేమిటి?

ఎలాగూ జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ పోటీ ఇచ్చే స్థానాన్ని కోల్పోయింది. కొంత కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధమైతే మరికొంత బీజేపీ అగ్నికి ఆజ్యంపోసే చర్యలు ఇందుకు కారణం. ఇక మిగిలింది ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు వీటిని కూడా ప్రజల నుంచి దూరం చేయాలనుకుంటున్నది. మహారాష్ట్రలో తాజాగా శివసేన పార్టీకి అలాంటి ఒత్తిడే ఎదురవుతున్నది. బీజేపీలో విలీనం చేయడమో లేక కోరలు లేని పాముగా మిగిలిపోవడమో తప్ప మరో మార్గం లేదు. ఇక్కడో విచిత్రమేమంటే బీజేపీ తన స్వంత పార్టీలోని వారసత్వ రాజకీయాలు, వారసుల గురించి ఎక్కడా మాత్రం ప్రస్తావించదు. సిద్ధాంతరీత్యానే వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లయితే ఆ ప్రక్షాళన బీజేపీ నుంచే మొదలుకావాలి.

కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు ఉద్వాసన పలకాలి.ఎన్నికలలో టికెట్ ఇచ్చేటప్పుడే విధాన నిర్ణయంగా ప్రకటన చేయాలి. అవకాశాలూ ఇవ్వకూడదు. అదే జరిగితే ఆ పార్టీలో చాలా మంది ఇంటికి పోవాల్సి ఉంటుంది. కానీ వీరికి ఎందుకు అవకాశం ఇచ్చిందో ఆ పార్టీ నుంచి సమాధానం ఉండదు. దుశ్యంత్ సింగ్ (వసుంధరారాజె కుమారుడు), జయంత్ సిన్హా (యశ్వంత్ సిన్హా కొడుకు), పర్వేష్ వర్మ (ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడు), వివేక్ ఠాకూర్ (కేంద్ర మాజీ మంత్రి సీపీ ఠాకూర్ కొడుకు), నీరజ్ శేఖర్ (మాజీ పీఎం చంద్రశేఖర్ కొడుకు), పూనం మహాజన్ (ప్రమోద్ మహాజన్ కూతురు), ప్రీతమ్ ముండే (ఎంపీ), పంకజా ముండే (ఎమ్మెల్యే) – వీరిద్దరూ కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తెలు, వరుణ్ గాంధీ (మేనకాగాంధీ కొడుకు), సన్నీ డియోల్ (హేమమాలిని కొడుకు), డీవై రాఘవేంద్ర (ఎడ్యూరప్ప కొడుకు), పంకజ్ సింగ్ (రాజ్‌నాధ్ సింగ్ కొడుకు).. ఇలా పదుల సంఖ్యలో పదవులలో ఉన్నారు.

మాటలకూ, చేతలకూ పోలికేది?

కుటుంబ, వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి, ఆ స్ఫూర్తికి ప్రమాదం అంటూ మోడీ చాలాసార్లు చెప్పారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లోనూ ఏకరువు పెట్టారు. తాజాగా మే నెల చివరి వారంలో 'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజనెస్' స్నాతకోత్సవానికి వచ్చినప్పుడు తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీని 'పరివార్‌వాదీ పార్టీ' అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, మేనల్లుడు, సడ్డకుడి కొడుకు అంటూ ప్రస్తావించారు. ప్రజలలో అప్పటికే 'కుటుంబంలో అందరికీ ఉద్యోగం' ఇచ్చుకున్న కేసీఆర్ నిరుద్యోగులకు మాత్రం ఇవ్వలేదు అనే సాధారణ అభిప్రాయాన్ని మోడీ తన పార్టీకి అనుకూలంగా మల్చుకున్నారు. ఇప్పుడు కార్యవర్గ సమావేశాలలోనూ దాన్నే ప్రధాన నినాదంగా ఎంచుకున్నది.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఒక 'పరివార్‌వాదీ' పార్టీ అంటూ ప్రజల నుంచి దూరం చేయగలిగితే ఇక మిగిలేది బీజేపీ ఒక్కటే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వారసత్వ పార్టీ అనే ముద్ర వేసి తిరస్కరించాలని ప్రజలకు ఇప్పటికే పిలుపిచ్చింది. ఎలాగూ తెలుగుదేశం సహా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలకు పవర్‌లోకి వచ్చే స్థాయి లేదు. అధికారం కేంద్రీకృతమై అవినీతి జరుగుతున్నదంటూ వల్లె వేస్తూనే తిరిగి ఆ దిశగానే ప్రయత్నిస్తున్నది. అటు కాంగ్రెస్‌కు, ఇటు ప్రాంతీయ పార్టీలకు అదే ముద్ర వేస్తే దేశంలో ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయే. చివరకు బీజేపీ రూపంలో ఏకపార్టీ వ్యవస్థను అది కోరుకుంటున్నది.

అసలు లక్ష్యం అదే

నిజానికి కేసీఆర్ ఎనిమిదేళ్ల విధానాన్నే ఇప్పుడు మోడీ అనుసరిస్తున్నారు. అధికారాన్ని కేంద్రీకృతం చేసుకోవాలంటే విపక్షాలను లేకుండా చేయాలని కేసీఆర్ భావించారు. ఆయన కార్యాచరణ కూడా అదే తీరులో సాగింది. కాంగ్రెస్, తెలుగుదేశం ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. ఆ పార్టీల శాసనసభా పక్షాలను టీఆర్ఎస్‌లో విలీనం చేయించారు. ప్రతిపక్షం లేకుండా చేసుకోగలిగారు. సరిగ్గా బీజేపీ కూడా ఇప్పుడు అదే చేస్తున్నది. కేసీఆర్‌కు ఇది మింగుడుపడడం లేదు. అందుకే బీజేపీపైనా, మోడీపైనా విరుచుకుపడుతున్నారు. మోడీ, కేసీఆర్ ధోరణులు రెండూ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. విపక్షాల గొంతును నొక్కే పెత్తందారీ ధోరణులు. 'అప్రజాస్వామికం' అనే నాణానికి ఈ రెండూ బొమ్మా బొరుసు.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Tags:    

Similar News