ఉన్నది ఉన్నట్టు: పాలిటిక్స్ ఫస్ట్.. పాలన గాలికి

ఉన్నది ఉన్నట్టు: పాలిటిక్స్ ఫస్ట్.. పాలన గాలికి... unnadi unnattu: trs party doing Politics not Governance says k viswanath

Update: 2022-12-07 19:00 GMT

ఒకటో తారీకు జీతం రాకపోయినా ఉద్యోగులు మౌనంగా ఉండడానికి అలవాటుపడ్డారు. కరువుభత్యం (డీఏ) లాంటివి రాకపోయినా ఇచ్చినప్పుడే పండుగ అని సర్దుకుపోతున్నారు. ఫొటోలకు పాలాభిషేకాలు సరేసరి. ఇస్తే పుచ్చుకోవడమే తప్ప కొట్లాడి సాధించుకోవాలనే సూత్రాన్ని మర్చిపోయారు. ఆర్టీసీ కార్మికులూ డిమాండ్ల సాధనకు సమ్మె చేయడానికి వణికిపోతున్నారు. వారికి సంఘమూ లేదు. ఎన్నికలూ ఉండవు. ఇక రోడ్డెక్కి నిరసనలు చేసే స్వేచ్ఛ కూడా కరువైంది. ధర్నా చౌక్‌ను సర్కారు ఎత్తివేసినా ప్రజాసంఘాలు, పార్టీలు నిస్సహాయంగా ఉండిపోయాయి. న్యాయస్థానాల ద్వారా హక్కును తిరిగి పొందాల్సి వచ్చింది. సామాజిక స్పృహ ఉన్న బుద్ధిజీవులూ సైలెంట్ అయిపోయారు. ప్రజల తరఫున కొట్లాడుతున్నామని చెప్పుకునే ప్రతిపక్ష పార్టీలూ రాజీపడ్డాయి. ప్రజలను చైతన్యం చేసేవారు కరువయ్యారు. సాయుధ తెలంగాణ పోరాటం, నక్సలైట్ ఉద్యమం. ఇలాంటివి అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడాలనే ఆలోచనలకు పునాది వేశాయి. ఆ చైతన్యమే వారిని మలి దశ ఉద్యమంలోకి దూకించింది. ఇంతటి ప్రశ్నించే తత్వమున్నా, తిరగబడే తెగువ ఉన్నా సమస్యల పరిష్కారం కోసం ఇటీవల నిస్సహాయులుగా మారారు.

మాది ఫక్తు రాజకీయ పార్టీ' అంటూ పార్టీ అధినేత కేసీఆరే చెప్పుకున్నారు. దానికి తగ్గట్టుగానే రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. పాలనను గాలికొదిలేశారు. అన్ని సెక్షన్ల ప్రజలకూ సంక్షేమాన్ని అందిస్తున్నామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ, సమస్యలకు పరిష్కారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి తరహాలోనే ఉండిపోయింది. అందుకు నిదర్శనమే ఎమ్మార్వో మొదలు కలెక్టర్ వరకు ప్రతీ వారం కుప్పలు తెప్పలుగా వస్తున్న ఫిర్యాదులు. కంచే చేను మేసిన చందంగా పరిష్కరించాల్సిన అధికారులే సమస్యలను సృష్టిస్తున్నారు.

కలెక్టర్(collector) సమక్షంలోనే ఆత్మహత్యాయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదు. న్యాయం కోసం స్థానిక నేతల మొదలు అధికారుల వరకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కలెక్టర్ ముందే ఓ రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరైనా చివరకు రద్దు కావడంతో సిద్దిపేట జిల్లాలో ఓ నిరుపేద తనువు చాలించాడు. ఆసరా పింఛన్ మంజూరు కాలేదని యాదాద్రి కలెక్టరేట్‌లో(yadadri collectorate) ఓ దివ్యాంగుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుల కబ్జాల ఆరోపణలతో కాళ్ల కింద నేల కదిలిపోవడంతో అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితంలేని అభాగ్యులు లెక్కలేనంత మంది.

సర్కారు పాపం.. ప్రజలకు శాపం

విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ఈ మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సంబంధమైన అంశాలతో జరిగే ఆత్మహత్యలు వేరు. కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యమే వందలాది మందిని ఆ దిశగా డ్రైవ్ చేస్తున్నది. ఎక్కువగా భూమి సమస్యలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. ప్రాజెక్టుల కోసం భూసేకరణ మొదలు కొత్తగా ఉనికిలోకి వచ్చిన ధరణి(dharani) వరకు సర్కారు విధానాలు రైతులను భూమి నుంచి దూరం చేస్తున్నాయి. పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వమే దోషిగా మారింది. ధరణి తెచ్చిన తంటా అంతా ఇంతా కాదు. భూమికి పక్కాగా పట్టా ఉన్నా అది ఎప్పుడు ఎవరికి బదిలీ అవుతుందో తెలియదు. కుటుంబ సభ్యుల మధ్యే కొట్లాట పెట్టింది.

దశాబ్దాల తరబడి సాగుచేస్తున్న భూమి నిషేధిత జాబితాలోకి(prohibited lands) వెళ్లిపోతుంది. ఒకటే భూమి పలువురి పేరుతో రిజిస్టర్ అయిపోతుంది. విప్లవాత్మకం అనే ఈ విధానం వివాదాలను సృష్టించింది. 30 యేండ్లు సర్కారు నౌకరీ చేసి దాచిపెట్టుకున్న రిటైర్‌మెంట్ డబ్బుతో ప్లాట్ కొనుక్కున్నా అది ఇంకొకరి పేరుతో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. డబుల్ రిజిస్ట్రేషన్‌కు ధరణిలో పరిష్కారమే లేదు. కలెక్టర్ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులలో సగం భూమికి సంబంధించినవే.

చిత్తశుద్ధి ఏదీ?

క్షేత్రస్థాయిలోని ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు. అధికార పార్టీకి పాలిటిక్స్ మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల పరిష్కారంపై లేదు. ఏవి ఫలితాలు ఇస్తాయో వాటిపైనే ఫోకస్. ఎన్నికలలో గెలవడం, బలం పెంచుకోవడం, పైచేయి సాధించడం, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం, ఇవే రూలింగ్ పార్టీ ప్రయారిటీలు. బీజేపీ(bjp)ని ఎదుర్కోవడం ఎలా? కాంగ్రెస్‌ను(congress) ఖతం పట్టించడం ఎలా? కొత్తగా ఉనికిలోకి వస్తున్న షర్మిల(ys sharmila) లాంటి వారి అడ్డుకట్ట వేయడమెలా? ఇవే ప్రాధాన్యతా అంశాలు. ఐటీ, ఈడీ దాడుల(cbi,it raids) నుంచి బైటపడేందుకు వ్యూహాలు రూపొందించడానికే సమయాన్ని వెచ్చిస్తున్నది.

అంతటా వైఫల్యాలే

ప్రాజెక్టులతో అభివృద్ధి చేస్తున్నామన్నది ప్రభుత్వ వాదన. కానీ, వాటి పేరుతో భూములు కోల్పోయినవారికి పరిహారం అందడం లేదు. నిలువ నీడ లేకుండా పోయిన నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ కాంపెన్సేషన్ కోసం నిరసనలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ విధానాలు, చట్ట ఉల్లంఘనలే ప్రజల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పంటల సాగు, గిట్టుబాటు ధరల దగ్గరా అండగా ఉండాల్సిన ప్రభుత్వమే అశాంతికి గురిచేస్తున్నది. ప్రభుత్వమే గందరగోళపడుతూ రైతులనీ అటే డ్రైవ్ చేస్తున్నది. వడ్ల కొనుగోళ్లలో రాజకీయ ఘర్షణ రైతులకు గుదిబండలా తయారైంది. అవగాహన కల్పించాల్సిన రైతుబంధు సమన్వయ సమితులు(Rythu Samanvaya Samithi) ఉత్సవ విగ్రహాల్లా మారిపోయాయి.

తొమ్మిదేళ్లలో ప్రభుత్వం ఒక్క డీఎస్సీ(dsc notification) కూడా వేయలేదు. ఉద్యోగంపై ఆశతో వేలాది మంది ఆశావహులు అప్పుచేసి మరీ కోచింగ్ తీసుకున్నారు. చివరకు అది భార్యాభర్తల మధ్య ఘర్షణకు దారితీసి భర్త ఆత్మహత్య చేసుకునే వరకు వచ్చింది. జాబ్ నోటిఫికేషన్ విషయంలోనూ విద్యార్థులకు ఇలాంటి చేదు అనుభవాలే మిగిలాయి. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, గెస్ట్ లెక్చరర్లు ఇలా విద్యావంతులూ తనువు చాలిస్తున్నారు. అన్ని సెక్షన్ల సంక్షేమం అని చెప్పుకునే ప్రభుత్వానికి ఈ సమస్యలపై దృష్టి సారించే టైమ్ దొరకడంలేదు. ఇలాంటివి వందలాది సమస్యలు సర్కారు వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనం.

పోరాడే చైతన్యం, స్ఫూర్తి కనుమరుగు

ఒకటో తారీకు జీతం రాకపోయినా ఉద్యోగులు మౌనంగా ఉండడానికి అలవాటుపడ్డారు. కరువుభత్యం (డీఏ) లాంటివి రాకపోయినా ఇచ్చినప్పుడే పండుగ అని సర్దుకుపోతున్నారు. ఫొటోలకు పాలాభిషేకాలు సరేసరి. ఇస్తే పుచ్చుకోవడమే తప్ప కొట్లాడి సాధించుకోవాలనే సూత్రాన్ని మర్చిపోయారు. ఆర్టీసీ కార్మికులూ(rtc employees) డిమాండ్ల సాధనకు సమ్మె చేయడానికి వణికిపోతున్నారు. వారికి సంఘమూ లేదు. ఎన్నికలూ ఉండవు. ఇక రోడ్డెక్కి నిరసనలు చేసే స్వేచ్ఛ కూడా కరువైంది. ధర్నా చౌక్‌ను సర్కారు ఎత్తివేసినా ప్రజాసంఘాలు, పార్టీలు నిస్సహాయంగా ఉండిపోయాయి. న్యాయస్థానాల ద్వారా హక్కును తిరిగి పొందాల్సి వచ్చింది. సామాజిక స్పృహ ఉన్న బుద్ధిజీవులూ సైలెంట్ అయిపోయారు. ప్రజల తరఫున కొట్లాడుతున్నామని చెప్పుకునే ప్రతిపక్ష పార్టీలూ రాజీపడ్డాయి.

ప్రజలను చైతన్యం చేసేవారు కరువయ్యారు. సాయుధ తెలంగాణ పోరాటం, నక్సలైట్ ఉద్యమం. ఇలాంటివి అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడాలనే ఆలోచనలకు పునాది వేశాయి. ఆ చైతన్యమే వారిని మలి దశ ఉద్యమంలోకి దూకించింది. ఇంతటి ప్రశ్నించే తత్వమున్నా, తిరగబడే తెగువ ఉన్నా సమస్యల పరిష్కారం కోసం ఇటీవల నిస్సహాయులుగా మారారు. కోపం కట్టలు తెంచుకున్నప్పుడు ఎమ్మార్వో విజయపై(mro vijaya) కిరోసిన్ పోసి కాల్చేయడం, ఇటీవల ఫారెస్టు అధికారి శ్రీనివాసరావుపై(fro srinivasa rao) గుత్తికోయలు దాడి చేయడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

అధికార పార్టీ అజమాయిషీ

రాజధాని మొదలు గ్రామం వరకు ప్రభుత్వ యంత్రాంగంపై అధికార పార్టీ అజమాయిషీ పెరిగింది. మునుపెన్నటికంటే కేంద్రీకృతమైంది. ఉద్యోగ నియామకాల మొదలు పదోన్నతులు, ప్రమోషన్లు, ప్రభుత్వ అనుమతులు ఇలా అన్నింటా అది రిఫ్లెక్ట్ అవుతున్నది. ఒక రకంగా చట్టబద్ధమైంది. సంక్షేమ పథకాలకు నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నా ఫైనల్ నిర్ణయం రూలింగ్ పార్టీ నేతలదే. ఆసరా పింఛను, కల్యాణలక్ష్మి, దళితబంధు, సీఎంఆర్ఎఫ్(cmrf), డబుల్ బెడ్‌రూమ్ లాంటివన్నీ స్థానిక ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలతోనే. ఎస్‌ఐ, సీఐ, డీఎస్‌పీ, ఎమ్మార్వో, ఆర్‌డీఓ ఎవరు ఉండాలో లోకల్ లీడర్లే డిసైడ్ చేస్తున్నారు.

పైరవీలు లేకుంటే పనులు కావు. ఏ స్కీమ్‌కైనా ఇది కామన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. గల్లీ లీడర్లు పైరవీకారుల అవతరామెత్తారు. పైసలిచ్చినవారికి పనులు చేసిపెడతారు. ఎమ్మెల్యే 'నో' అంటే అధికారులు ఆ గీత దాటరు. నిబంధనలు ఏం చెబుతున్నా అవి బేఖాతర్. దేవుడు వరమిచ్చినా తరహాలో లోకల్ లీడర్ల దయాదాక్షిణ్యాలే ఫైనల్. ప్రభుత్వ సిబ్బందీ దానికే అలవాటు పడ్డారు. ప్రజల కేంద్రంగా నడవాల్సిన పాలన రూలింగ్ పార్టీ చెప్పుచేతలలో నడుస్తున్నది. కమిషన్లు లేకుంటే ఫైల్ కదలదు. దళిత బంధుకు(Dalit bandhu) మూడు లక్షల రూపాయల ముడుపులు బహిరంగ రహస్యం.

దేనికీ పరిష్కారం లేదు

సంక్షేమ పథకాల పేరుతో పేదలు ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే తత్వం నెలకొన్నది. అధికార పార్టీ అండదండలుంటేనే అవి అందుతాయి. ఎంతో కొంత ముట్టచెప్పుకుంటేనే ఖాయమవుతుంది. అణిగిమణిగి ఉంటేనే ఫలాలు దక్కుతాయి. నిరసనలు, సమ్మెలంటే అవి ఎప్పటికీ అందవు అని ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం తేల్చిచెప్పింది. విద్యార్థి సంఘాలైనా, సింగరేణి కార్మిక యూనియన్లయినా అంతే. అందుకే ఉద్యోగ సంఘాలు జీ హుజూర్ అనడానికే అలవాటుపడ్డాయి.

కొత్త జిల్లాలతో పాలనా సౌకర్యం మెరుగుపడుతుందని, ప్రజలకు సేవలు అందుతాయన్నది మాటలకు మాత్రమే. ప్రజలు ఎన్ని చిక్కులలో ఉంటే అవి అంతగా ప్రభుత్వంపైనా, అధికార పార్టీపైనా ఆధారపడాలన్నదే టీఆర్ఎస్(trs) సిద్ధాంతం. అందుకే పాలనా సంస్కరణలైనా, సంక్షేమ పథకాలైనా ప్రజలను నియంత్రించడమే దాని ప్రాథమిక సూత్రం. వివాదాలు సృష్టించడం, మంటను రాజేయడం, దానికి మందు పూయడం, అన్నీ తానై వ్యవహరిస్తున్నది. 'బంగారు తెలంగాణ'పై విపక్షాల విమర్శలు, నిర్వచనాలు ఎలా ఉన్నా సర్కారు నుంచి సమస్యలకు పరిష్కారం గగనమే అన్నది వాస్తవం.

 

ఎన్. విశ్వనాథ్

99714 82403

Tags:    

Similar News