ఉన్నది ఉన్నట్టు: వివాదాలలో గవర్నర్లు! కారణాలేంటి?
ఉన్నది ఉన్నట్టు: వివాదాలలో గవర్నర్లు! కారణాలేంటి?... unnadi unnattu: reasons for Governor disputes with state government
రాజకీయాలలో యాక్టివ్‌గా పాల్గొన్నవారిని గవర్నర్‌లుగా నియమించడం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు రెగ్యులర్ ప్రాక్టీసుగానే మారిపోయింది. గవర్నర్‌లు స్వంతంత్రంగా వ్యవహరించే వాతావరణం లేదు. దీర్ఘకాలం పాటు ఒక పార్టీ రాజకీయాలతో కొనసాగిన వ్యక్తులు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నంత మాత్రాన గవర్నర్‌గా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావించలేం. రాజకీయ రంగు లేనివారిని గవర్నర్‌లుగా ఎంపిక చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వాలకూ లేదు. పునరావాసం కల్పించడం, నమ్మకమైన బంటుగా మార్చుకోవడమే ఈ నామినేటెడ్ పోస్టుల వెనక ఉన్న ఏకైక లక్ష్యం. అందుకే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల మధ్య ఉన్న రాజకీయ ఘర్షణ రాజ్‌భవన్ వైపు మళ్లుతున్నది. ఆ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కచేయడం లేదు. వ్యక్తులుగా గవర్నర్‌లు కూడా గౌరవాన్ని పొందలేక పోతున్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో గవర్నర్‌ల వ్యవహార శైలి వివాదాలలో చిక్కుకుంటున్నది. తొమ్మిది రాష్ట్రాల గవర్నర్‌ల మీద అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తమిళనాడు ప్రభుత్వం ఏకంగా గవర్నర్‌ను రీకాల్ చేయాలంటూ రాష్ట్రపతికి మొరపెట్టుకున్నది. తెలంగాణలో గవర్నర్, గవర్నమెంటు వ్యవహారం తూర్పు-పడమర లాగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి దోహపడాల్సిన గవర్నర్ వ్యవస్థ చర్చనీయాంశమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరిచే మెకానిజంగా మారిపోయిందనే విమర్శలు అందులో భాగమే.
వలస పాలనలో ఉనికిలోకి వచ్చిన గవర్నర్ వ్యవస్థ స్వతంత్ర దేశంలోనూ అవసరమా అనే చర్చ దీర్ఘకాలంగానే ఉన్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే ప్రజాస్వామ్యంలో సుప్రీం అనేది రాష్ట్ర ప్రభుత్వాల, రాజకీయ పార్టీల బలమైన వాదన. అందుకే గవర్నర్ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం. నిజానికి గవర్నర్‌లతో వివాదం మొదటిసారేమీ కాదు. 1960వ దశకం చివరి నుంచీ ఉన్న పంచాయతీయే. ఇలాంటి వివాదాల కారణంగానే అప్పటిలో రాజమన్నార్ కమిషన్, ఆ తర్వాత 1980వ దశకం చివరలో సర్కారియా కమిషన్ ఏర్పాటయ్యాయి.
సూచనలన్నీ బేఖాతరు
ఇలాంటి వివాదాల కారణంగానే 1969లో 'ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ కమిషన్' కూడా ఏర్పాటైంది. అది స్పష్టమైన సిఫారసులే చేసింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే కేంద్రం గవర్నర్‌లను నియమించాలని నొక్కిచెప్పింది. సర్కారియా కమిషన్ సైతం పొలిటికల్ యాక్టివిటీస్‌లో పాల్గొనని, రాజకీయాలతో సంబంధం లేనివారిని మాత్రమే గవర్నర్‌లుగా ఎంపిక చేయాలని సూచించింది. కానీ, ఇలాంటి సిఫారసు లేవీ అమలుకావడం లేదు. గడిచిన మూడు దశాబ్దాల అనుభవాన్ని చూస్తే అదే స్పష్టమవుతున్నది.
గవర్నర్ వ్యవస్థపైనా, గవర్నర్‌లు పోషించాల్సిన పాత్రపైనా, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి పరిస్థితులలో వివాదాలు వస్తున్నాయో పలు కమిషన్‌లు సమగ్రంగా అధ్యయనం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన సిఫారసులే చేశాయి. అయినా ఈ వివాదం సమసిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాల్సిన గవర్నర్ ఆ పని చేయకపోగా సమస్యలు సృష్టిస్తున్నారనేది అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల ఆరోపణ. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలలో 'మై గవర్నమెంట్' అని అంటూనే ఆచరణలో మాత్రం దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది తెరపైకి వస్తున్న వాదన.
Also read: ఉన్నది ఉన్నట్టు: అవి జేబు సంస్థలేనా?
నాటి నుంచీ నేటి దాకా అదే తీరు
సాధారణ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా గవర్నర్‌లు మారడం ఆనవాయితీ అయ్యింది. పాత ప్రభుత్వం నియమించిన గవర్నర్‌లు స్వచ్ఛందంగా తప్పుకోవడమో, లేక వారిని బలవంతంగా పంపించేయడమో జరుగుతున్నది. వారి కాలపరిమితితో సంబంధం లేకుండా ఇలాంటి నిర్ణయాలు జరిగిపోతున్నాయి. రాష్ట్రపతి ఆమోదం ప్రకారమే గవర్నర్‌ల నియామకాలు, ఉద్వాసనలు అని పైకి చెప్పుకుంటున్నా కేంద్ర ప్రభుత్వాల నిర్ణయం ప్రకారమే జరుగుతున్నదనేది వాస్తవం. ఇలాంటి కారణాలే 'కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్లుగా'అనే విమర్శలకు మూలం. వీపీ సింగ్ హయాం మొదలు పీవీ నర్సింహారావు, వాజ్‌పేయి, మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వాల వరకు ఇదే ఒరవడి. తాజాగా మోడీ హయాంలోనూ అదే జరుగుతున్నది.
బీజేపీ నేతలు గవర్నర్‌లుగా అపాయింట్ అవుతున్నారు. రాజకీయాలకు అతీతంగా, స్వతంత్రంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన రాజ్‌భవన్‌లు పార్టీల వ్యక్తులకు నెలవుగా మారాయి. అందుకే రాజ్‌భవన్‌లకు రాజకీయ పునరావాస కేంద్రం అనే ముద్రపడింది. కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలకు చెందిన ప్రభుత్వాలు ఉన్న దగ్గరే ఈ వివాదం చోటుచేసుకుంటున్నది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో స్వంత పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడూ జరిగాయి.
రాజ్‌భవన్‌పై నిందలు
స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు కేంద్రం, రాష్ట్రాలలో ఒకే పార్టీ ప్రభుత్వాలు మనుగడలో ఉండడంతో గవర్నర్ వ్యవస్థతో ఎలాంటి పేచీ లేకుండా సాఫీగా నడిచిపోయింది. వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉనికిలోకి వచ్చిన తర్వాత గవర్నర్ వ్యవస్థపై మరకలు పడ్డాయి. గవర్నర్‌లను అడ్డం పెట్టుకుని రాష్ట్రాల ప్రభుత్వాలపై కేంద్రం పెత్తనం చేస్తున్నదనే భావన ఏర్పడింది. ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపర్చడానికి, కూలదోసే ప్రయత్నాలకూ గవర్నర్ నివాసం ఉండే రాజ్‌భవన్ వేదికగా మారుతున్నదనే విమర్శలు వెల్లువెత్తాయి. గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి వివాదం అనేక రాష్ట్రాలలో కనిపించినా కర్నాటకలో ఎస్సార్ బొమ్మయి టైమ్‌లో మాత్రమే దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.
ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలోనే ఆ వ్యవస్థను వేలెత్తి చూపించినట్లయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా బల నిరూపణ కోసం ఫ్లోర్ టెస్టు కోసం గవర్నర్ అనుమతించకపోవడం సర్వత్రా విమర్శలకు కారణమైంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్‌రావు మధ్య విభేదాల టైమ్‌లో గవర్నర్ రాంలాల్ పోషించిన పాత్ర కూడా అదే తరహాలో వివాదాస్పదంగా మారింది. చాలా రాష్ట్రాలలో ఇలాంటివే రిపీట్ అయ్యాయి.
Also read: ఉన్నది ఉన్నట్టు: మారుతున్న డెమోక్రసీ మీనింగ్! ఇప్పుడిదే నయా ట్రెండ్
అందుకు ఘర్షణ వాతావరణం
ఇలాంటి వివాదాల కారణంగానే కేరళ, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలలో గవర్నర్‌లతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఘర్షణ వాతావరణం ఉన్నది. 'నీట్'కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన బిల్లును గవర్నర్ వెనక్కి పంపడంతో దీనికి తగిన సమాధానం చెప్పాలనే తీరులో రాష్ట్ర ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ల నియామకాల అధికారాన్ని మారుస్తూ అసెంబ్లీలో బిల్లును పెట్టింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకే ఈ అధికారం ఉంటుందనే వాదనను తెరపైకి తెచ్చింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా గవర్నర్‌కు ఉండే ఛాన్సెలర్ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే బదలాయించేలా చట్టం తీసుకొచ్చింది.
అసెంబ్లీ వేదికగా పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలపాల్సిన గవర్నర్‌ల పరిశీలన పేరుతో పెండింగ్‌లో పెట్టడం, తిరస్కరించడం కూడా గవర్నర్, గవర్నమెంటుకు మధ్య తలెత్తే వివాదాలలో ఒకటి. తెలంగాణ క్యాబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీ ఫైల్‌కు గవర్నర్ ఆమోదం తెలపలేదు. దీంతో వివాదం మొదలైంది. చివరకు ప్రొటోకాల్ లాంటి విషయాలలో రిఫ్లెక్ట్ అయింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా పరిశీలనలో ఉందనే పేరుతో నాన్చివేత ధోరణి కొనసాగుతున్నది. సందేహాలను నివృత్తి చేయాలంటూ మంత్రులను పిలిపించుకోవాల్సి వస్తున్నది.
వారు హుందాగానే ఉన్నారు
ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నంతవరకూ గవర్నర్‌లతో వివాదాలు లేవే. గతంలోకి వెళ్లి చూస్తే, శారదా ముఖర్జీ, కుముద్‌బెన్ జోషి, సుర్జీత్ సింగ్ బర్నాలా, రంగరాజన్, ఈఎస్ఎల్ నరసింహన్ ఇలా కొద్దిమంది కనిపిస్తారు. దీర్ఘకాలమే గవర్నర్లుగా వ్యవహరించారు. ఏ పార్టీకి చెందిన ప్రభుత్వాలు ఏర్పడినా స్నేహ సంబంధాలనే కొనసాగించారు. వివాదాస్పదం కాలేదు. కేంద్రంలో, రాష్ట్రాలలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నా హుందాగా వ్యవహరించి ఆ పోస్టుకు తగిన గౌరవం కంటిన్యూ అయ్యేలా చూసుకున్నారు.
రాజకీయాలలో యాక్టివ్‌గా పాల్గొన్నవారిని గవర్నర్‌లుగా నియమించడం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు రెగ్యులర్ ప్రాక్టీసుగానే మారిపోయింది. గవర్నర్‌లు స్వంతంత్రంగా వ్యవహరించే వాతావరణం లేదు. దీర్ఘకాలం పాటు ఒక పార్టీ రాజకీయాలతో కొనసాగిన వ్యక్తులు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నంత మాత్రాన గవర్నర్‌గా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావించలేం. రాజకీయ రంగు లేనివారిని గవర్నర్‌లుగా ఎంపిక చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వాలకూ లేదు. పునరావాసం కల్పించడం, నమ్మకమైన బంటుగా మార్చుకోవడమే ఈ నామినేటెడ్ పోస్టుల వెనక ఉన్న ఏకైక లక్ష్యం.
కొసమెరుపు
అందుకే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల మధ్య ఉన్న రాజకీయ ఘర్షణ రాజ్‌భవన్ వైపు మళ్లుతున్నది. ఆ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కచేయడం లేదు. వ్యక్తులుగా గవర్నర్‌లు కూడా గౌరవాన్ని పొందలేకపోతున్నారు. గవర్నర్ వ్యవస్థ అవసరమా లేదా అనేది వేరే చర్చ. కానీ, గవర్నర్ ద్వారా రాష్ట్రాలపై పెత్తనం చేయాలనే కేంద్రం ధోరణి మారనంతవరకూ ఈ వివాదం కొనసాగుతూనే ఉంటుంది. కేంద్రానికి గవర్నర్ జవాబుదారీ, ఏజెంట్ అనే ఆలోచన పోనంతవరకూ ఈ ఘర్షణలు ఉంటూనే ఉంటాయి. రాజకీయ అవసరాలే రాజ్‌భవన్ పనితీరును శాసిస్తున్నాయి.
ఎన్. విశ్వనాథ్
99714 82403