ఉన్నది ఉన్నట్టు: మారుతున్న డెమోక్రసీ మీనింగ్! ఇప్పుడిదే నయా ట్రెండ్

ఉన్నది ఉన్నట్టు: మారుతున్న డెమోక్రసీ మీనింగ్! ఇప్పుడిదే నయా ట్రెండ్... unnadi unnattu: is changing democracy meaning new trend

Update: 2022-11-02 19:15 GMT

ఎన్నికలలో పోటీ చేస్తున్న వారిలో ఎక్కువ మంది కోటీశ్వరులే. మునుగోడులో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆస్తులూ కోట్లల్లోనే ఉన్నాయి. రాజకీయం ఒక బిజినెస్‌. అమ్ముడుపోయే లీడర్లు మార్కెట్ సరుకులు. పార్టీలు కొనడం, నేతలు అమ్ముడుపోవడం రొటీన్ ప్రాక్టీస్. ఓటర్లకూ ఈ జాడ్యం అంటుకున్నది. వ్యాపారాలు, కాంట్రాక్టులు, రాజకీయాలు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయి. పోలింగ్‌కు ముందురోజు పంపిణీ చేయడానికి నోట్ల కట్టలు, డబ్బు సంచులు దిగుమతి అవుతున్నాయి. చెక్ పోస్టులలో దొరికేవి కొన్నే. దొరికిన సొమ్ము ఏ పార్టీదో ఎప్పటికీ బైటకు రాదు. ఎన్ని తనిఖీలు చేసినా దొడ్డిదారులలో ఊళ్లకు చేరిపోతూనే ఉంటాయి. ఓటర్ల చేతులకు అందుతూనే ఉంటాయి. పార్టీలకు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల నుంచి కోట్లాది రూపాయలు ఎలక్టోరల్ ఫండ్‌‌గా అందుతున్నది.

తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది' అన్న తరహాలో పొలిటికల్ పార్టీలు రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించాయి. ఎన్నికల ప్రక్రియనూ కలుషితం చేశాయి. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను పదవులు, పైసలతో ప్రలోభ పెట్టడానికి మాత్రమే పరిమితం కాలేదు. ఓటర్లను ప్రభావితం చేయడానికీ నోట్లను కుమ్మరిస్తున్నాయి. అనేక ప్రధాన పార్టీలకు ఇది కామన్ ప్రాక్టీసుగా మారిపోయింది. ఒక్కో ఓటరుకు ఎంత ముట్టచెప్పాలో రేటును ఫిక్స్ చేసుకుంటున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నట్లుగానే ఓటు రేటు కూడా పెరిగిపోతున్నది. ఇప్పుడు మునుగోడులో ఆ రేటు వేలల్లో పలుకుతున్నది. ఓటుకు నోటు పాత ట్రెండ్. ఓటుకు రేటు నయా ప్రాక్టీస్.

2018 అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న రేటు దుబ్బాక ఉప ఎన్నిక నాటికి పెరిగింది. హుజూరాబాద్ బై పోల్ సమయానికి రెట్టింపైంది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక టైమ్‌కు ఊహకు అందనంతగా ధర పలుకుతున్నది. పంపకాలలో ఒక పార్టీతో మరొకటి పోటీ పడుతున్నది. వేలం పాటలు బహిరంగంగా జరిగితే ఓటుకు ధర కట్టే విధానం గోప్యంగా సాగుతున్నది. ప్రత్యర్థి పార్టీకంటే వెయ్యి ఎక్కువే ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాయి. ఎక్కడా సాక్ష్యాలకు, ఆధారాలకు దొరకకుండా చాపకింద నీరులా చీకటిలో జరిగిపోతున్నది. పార్టీలు ఇవ్వడం, ఓటర్లు పుచ్చుకోవడం ఒక హక్కు లాగానే అమలవుతున్నది. నోట్ల పంపిణీని ఎవరైనా అడ్డుకుంటే 'మా నోట్లో మట్టిగొట్టావు' అంటూ తిరగబడుతున్నారు.

విలువలు, నైతికత జాన్‌తా నై

ఓటుకు నోటు తీసుకుంటే మనం అమ్ముడుపోయినట్లే, ఓటు వేయకపోతే చచ్చినవారితో సమానం. ఎవ్వరూ నచ్చకపోతే 'నోటా'కు ఓటేయొచ్చు. ఇలాంటివన్నీ మాటలకే పరిమితం. 'ఐ యామ్ నాట్ ఫర్ సేల్' అని ఎన్నికల కమిషన్ ప్రచారం చేస్తున్నా, 'మా ఓటును అమ్ముకోం' అని ఓటర్లు బోర్డులు తగిలించుకున్నా ప్రాక్టీసులో జరిగేది వేరు. పార్టీల లీడర్లే అంగట్లో సరుకులాగా అమ్ముడుపోతున్నారు. మార్కెట్ సరుకుగా మారిపోయింది. రాజకీయ వ్యవస్థే అలా తయారైంది. గెలవడమే లక్ష్యంగా, అధికారమే పరమావధిగా పార్టీలు పాకులాడుతున్నాయి. అందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. అవి చెడిపోయి ప్రజలనూ చెడగొడుతున్నాయి. పార్టీలకు, ప్రజలకు మధ్య 'ఎంతిస్తావ్, ఎంత పుచ్చుకుంటావ్' అనేదే కీలకం. విలువలు, సిద్ధాంతాలు, నైతికత ఇవేవీ అవసరం లేదు.

లీడర్ల లాగానే ఓటు కూడా సంతలో సరుకైంది. 'వంద రూపాయలు సంపాదిస్తే ఇస్తున్నది ఒక్క రూపాయే, మిగిలినదంతా అక్రమంగా పోగేసుకుంటున్నదే. డిమాండ్ చేసి తీసుకోవడంలో తప్పేముంది. ఇస్తున్నది కూడా మా సొమ్మేగదా' అనే మాటలు ఇప్పుడు ఓటర్ల నుంచి డైరెక్టుగానే వినిపిస్తున్నాయి. ప్రజలు ఎమ్మెల్యేలను ప్రజా ప్రతినిధిగా చూడడంలేదు. ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు ప్రతినిధులం అనే భావనతో లేరు. స్కీమ్‌లకు ఎంపిక చేయాలంటే కమిషన్లు ముట్టచెప్పుకోక తప్పడంలేదు. ఎన్నికలు వచ్చినప్పుడే పండుగ. ఎంత రాబట్టుకుంటే అంత. ఇదీ ఓటర్ల మైండ్‌సెట్.

Also read: ఉన్నది ఉన్నట్టు: ఈసీ సాక్షిగా నోటు దూకుడు

రేటుకు తగ్గ రెస్పాన్స్

హుజూరాబాద్ ఉప ఎన్నికలో డబ్బులు రానందుకు ఓటర్లు రోడ్డెక్కి ధర్నా చేశారు. కొన్ని గ్రామాలలో ఒక్కో ఓటుకు పది వేలు ఇచ్చి మరికొన్ని చోట్ల ఆరు వేలే ఇవ్వడం గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఎక్కువ, తక్కువ తేడా ఏర్పడింది. పది వేలు అందితేనే ఓటు వేస్తామంటూ బహిరంగంగానే ఓటర్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు మునుగోడు పోలింగ్ సందర్భంగా ఒక్కో ఓటుకు రూ. 30 వేలు వస్తుందనే అంచనా వేసుకున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత సైలెంట్‌గా జరిగిపోయిన మనీ డిస్ట్రిబ్యూషన్‌లో మూడు వేలే అందడంతో ఓటర్లు నారాజ్ అయ్యారు. హుజూరాబాద్ ఓటర్ల కంటే మేం పల్చనోళ్లమా అని ముఖంమీదనే నిలదీశారు. పార్టీపై ఉప ఎన్నిక ఫలితం చూపే ప్రభావానికి తగినట్లుగా ఓటుకు రేట్ ఫిక్స్ అవుతున్నది.

మునుగోడు రిజల్ట్ చావో రేవో తేల్చేదనే భావిస్తున్న పార్టీ ఎంతైనా ఖర్చు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకే తులం బంగారం, 30 వేలు అంటూ లీకులు వచ్చాయి. చివరకు అది మూడు వేలకే పరిమితం కావడంతో ఓటర్లు నిరుత్సాహానికి గురయ్యారు. ఇది ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ మాత్రమే అని పార్టీ లీడర్లు సర్దిచెప్పాల్సి వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే ఓటు ఎందుకు వేయాలనే అభిప్రాయానికి వచ్చేశారు. 'మా ఓటును అమ్ముకోం' అని తమిళనాడు ఎన్నికల సందర్భంగా ఒక గ్రామం ఉమ్మడి నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు అది కాలం చెల్లిన విధానంగా మారిపోయింది.

Also read: ఉన్నది ఉన్నట్టు: ఉపఎన్నికలు ఎవరికోసం వస్తున్నాయి?

దిగజారిన రాజకీయాలు

'మేం అమలు చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని' అధికార పార్టీలు గర్వంగా చెప్పుకుంటున్నాయి. అయినా ఓటర్లను కొనడానికి డబ్బులు వెదజల్లుతున్నాయి. మద్యం మొదలు ర్యాలీలు, రోడ్ షో లకు లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. హాజరైన వారికి కిరాయి చెల్లిస్తున్నాయి. గెలుపు మాదేనంటూ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా డబ్బులే నిర్ణయాత్మక శక్తిగా మారింది. పోలింగ్ టైమ్‌కు నోటు ఇవ్వకుంటే ఓటు పడదనే అభద్రతా భావానికి లోనవుతున్నాయి. ఎంత ఎక్కువ ఇస్తే ఓటు అంత పక్కా అని అనుకుంటున్నాయి. ఒకప్పుడు వంద నోటు, ఆ తర్వాత పచ్చ నోటు (రూ. 500), గులాబీ నోటు (రూ. 2000) ఇలా రంగులు మారుతున్నది. ఇప్పుడు మూడు వేల నుంచి 30 వేల దాకా డిమాండ్ ఏర్పడింది.

సర్పంచ్, ఎంపీపీ, జెడ్‌పీటీసీ మొదలు స్థానిక లీడర్లను లక్షలాది రూపాయలు పెట్టి కొంటున్నాయి పార్టీలు. ఒకరోజు ఒక పార్టీలో ఉంటే మరుసటి రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. ఎక్కడ ఎక్కువ రేటు ఉంటే అక్కడకు చేరిపోతున్నారు. వీటిని గమనిస్తూ ఉన్న ఓటర్లు మాకు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారంటూ ఓపెన్‌గానే నిలదీస్తున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓటు వజ్రాయుధం, బ్రహ్మాస్త్రం, తలరాతను మార్చే ప్రజాస్వామిక హక్కు. ఇలాంటివన్నీ మాటలకే పరిమితం. ఏ కులానికి ఎన్ని ఓట్లున్నాయో పార్టీలు లెక్కలేసుకున్నాయి. ఆ కుల సంఘాల పెద్దలతో మీటింగులు పెట్టి భారీ హామీలతో పాటు హోల్‌సేల్ రేటు ఫిక్స్ చేసుకుంటున్నాయి. వాటిని నిలబెట్టుకోకపోవడంతో ఆ పార్టీ లీడర్లను ఓటర్లు నిలదీస్తున్నారు.

Also read: ఉన్నది ఉన్నట్టు: అక్కడ డబ్బులు ఊరికే ఎందుకు వస్తున్నాయి?

కోటీశ్వరుల రాజకీయ కొట్లాట

ఎన్నికలలో పోటీ చేస్తున్న వారిలో ఎక్కువ మంది కోటీశ్వరులే. మునుగోడులో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఆస్తులూ కోట్లల్లోనే ఉన్నాయి. రాజకీయం ఒక బిజినెస్‌. అమ్ముడుపోయే లీడర్లు మార్కెట్ సరుకులు. పార్టీలు కొనడం, నేతలు అమ్ముడుపోవడం రొటీన్ ప్రాక్టీస్. ఓటర్లకూ ఈ జాడ్యం అంటుకున్నది. వ్యాపారాలు, కాంట్రాక్టులు, రాజకీయాలు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయి. పోలింగ్‌కు ముందురోజు పంపిణీ చేయడానికి నోట్ల కట్టలు, డబ్బు సంచులు దిగుమతి అవుతున్నాయి. చెక్ పోస్టులలో దొరికేవి కొన్నే. దొరికిన సొమ్ము ఏ పార్టీదో ఎప్పటికీ బైటకు రాదు. ఎన్ని తనిఖీలు చేసినా దొడ్డిదారులలో ఊళ్లకు చేరిపోతూనే ఉంటాయి. ఓటర్ల చేతులకు అందుతూనే ఉంటాయి.

పార్టీలకు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల నుంచి కోట్లాది రూపాయలు ఎలక్టోరల్ ఫండ్‌‌గా అందుతున్నది. అధికారంలో ఉన్న పార్టీలకే వారి ప్రయారిటీ. ఫలితంగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ ఖర్చుల కోసం అందిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్‌కు పార్టీలు సమర్పిస్తున్న వార్షిక నివేదికలను పరిశీలిస్తే ఏయే పార్టీకి సంవత్సరానికి ఎంత ఫండ్ వస్తున్నదో తేలిపోతుంది. ఏ వ్యాపారవేత్త ఏ పార్టీకి విరాళం ఇస్తున్నారో, ఎందుకు ఇస్తున్నారో, ప్రతిఫలంగా ఏం పొందుతున్నారో లోతులకు వెళ్లి పరిశీలిస్తే బోధపడుతుంది.

కొసమెరుపు

తెలంగాణ రాజకీయ చరిత్రలో మునుగోడు ఉప ఎన్నిక ఒక మైలురాయిగా నిలిచిపోనున్నది. రాజకీయపరంగా చరిత్ర సృష్టించడంతో పాటు భారీ స్థాయి ఖర్చు, ఓటర్లకు భారీ రేటు లాంటి రికార్డునూ సాధించనున్నది. చెక్‌పోస్టులు, అబ్జర్వర్లు, తనిఖీలు, ఇవేవీ రాజకీయ అవినీతిని అరికట్టలేవు. చట్టాలు రూపొందించే నేతలే వాటిని తూచ్ అంటున్నారు. బుట్టదాఖలా చేస్తున్నారు. ఉల్లంఘన అని తెలిసినా బరితెగిస్తున్నారు. ఓటర్ల బలహీనతనూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆర్థిక అవసరాలే పార్టీలకు పెద్ద అడ్వాంటేజ్. అందుకే ఓట్ ఫర్ సేల్ మన డెమోక్రసీలో నయా ట్రెండ్.


ఎన్. విశ్వనాథ్

99714 82403

Tags:    

Similar News