ఉన్నది ఉన్నట్టు: అవి జేబు సంస్థలేనా?
ఉన్నది ఉన్నట్టు: అవి జేబు సంస్థలేనా?... unnadi unnattu: ED, CBI acting as pocket agencies to central government says senior journalist
దేశంలో దర్యాప్తు సంస్థలు నిజంగా స్వంతంత్రంగానే పనిచేస్తున్నాయా? నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నాయా? అధికార పార్టీల ఒత్తిడికి గురవుతున్నాయా? రూలింగ్ పార్టీలు వాటిని జేబు సంస్థలుగా మల్చుకుంటున్నాయా? రాజకీయ ప్రయోజనాలను ఆశించి వాటిని ప్రభావితం చేస్తున్నాయా? అధికార పార్టీలకు జీ హుజూర్ అంటున్నాయా? చాలా కాలంగా ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ప్రశ్నలే కాదు, విమర్శలు కూడా. దశాబ్దాల క్రితమే కొన్ని దర్యాప్తు సంస్థలకు ఈ మచ్చ పడింది. అది ఇప్పుడు మరింతగా స్థిరపడింది. ఆ మచ్చను తొలగించుకునే ప్రయత్నాలు లేవు. మరింతగా బలపడుతున్నది.
సీబీఐని (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఉద్దేశిస్తూ పదేండ్ల క్రితమే సుప్రీంకోర్టు జడ్జి ఆర్ఎం లోధా 'పంజరంలో చిలుక' అని వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పుచేతలలోనే అది నడుస్తున్నదనే అభిప్రాయాన్ని ఓపెన్ కోర్టులోనే చెప్పారు. ఇప్పటికీ ఆ నింద పోలేదు. దీనికి తోడు ఐటీ (ఇన్‌కమ్ టాక్స్), ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కూడా ఆ మచ్చ అంటుకున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ), సీబీ సీఐడీ, సిట్ లాంటివాటికీ ఈ అపవాదు తప్పలేదు. సిట్ దర్యాప్తు అనగానే అధికార పార్టీలు 'సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే సెటైర్లు వినిపిస్తాయి.
రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్
పొలిటీషియన్ల కామెంట్లు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. 'ఓటుకు నోటు' కేసులో అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఉదాహరణ. 'నీకు ACB ఉంటే, నాకూ ఏసీబీ ఉంది. నీకు పోలీసులు ఉంటే నాకూ ఉన్నారు' అనేది ఆ విభాగాలపై పెత్తనానికి నిదర్శనం. ఇలాంటి వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల నిజాయితీనే ప్రశ్నార్థకం చేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ 'ఈడీ, బోడీలకు భయపడతమా! దొంగలు, లంగలు భయపడతరు' అనే మాటలు ఆ సంస్థల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నదో తేల్చేసింది. ఇక శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇటీవల దర్యాప్తు సంస్థలన్నింటినీ కలగలిపి 'కాంట్రాక్టు కిల్లర్స్'(Contract killers) అంటూ ఘాటుగానే విమర్శించారు.
రాజకీయ ప్రత్యర్థులపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం అధికారంలో ఉన్న పార్టీలకు ఇటీవలి కాలంలో కామన్ ప్రాక్టీసుగా మారిపోయింది.అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో తేడా లేకుండా కొనసాగుతున్నది. ప్రభుత్వాలు వాటిని నిర్లజ్జగా దుర్వినియోగ పరుస్తున్నాయంటూ వస్తున్న విమర్శలే ఇందుకు నిదర్శనం. పేరుకు మాత్రమే అవి స్వతంత్రంగా పనిచేసే సంస్థలు. కానీ, అధికార పార్టీ కనుసన్నలలోనే ఇవి పనిచేస్తాయన్నది నిర్వివాదాంశం. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రూలింగ్ పార్టీలు వీటిని అనుకూలంగా మల్చుకుంటున్నాయి. నిష్పక్షపాతంగా జరగాల్సిన దర్యాప్తు ప్రక్రియ రాజకీయ రంగు పులుముకుంటున్నది.
Also read: ఉన్నది ఉన్నట్టు: దేశంలో ఫెయిర్ ఎలక్షన్స్ సాధ్యమేనా?
వారే అన్నీ చెబుతారు
దర్యాప్తు కంటే ముందే రాజకీయ పార్టీలు సాక్ష్యాలను, ఆధారాలను బైట పెట్టేస్తున్నాయి. అవి చేయాల్సిన పనులను రూలింగ్ పార్టీలే చేసేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితులెవరో బీజేపీ ఎంపీలు చెప్పేశారు. తెలంగాణలోని మొయినాబాద్ ఫామ్‌హౌజ్ వ్యవహారంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ వివరాలను బైటపెట్టారు. ఈ పని చేయాల్సిన దర్యాప్తు సంస్థలు మాత్రం సైలెంట్‌గానే ఉండిపోయాయి. 'త్వరలోనే ఇంకొద్దిమంది అరెస్టువుతారు' అంటూ కేసీఆర్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించడం 'సిట్' ఏం చేయనున్నదో ముందే చెప్పేశారు. మంత్రి కేటీఆర్ సైతం 'ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది' అనేది కూడా దర్యాప్తు సంస్థ చేయాల్సిన పనిని నిర్దేశించినట్లయింది. ఇలాంటి పరిస్థితులలో దర్యాప్తు సంస్థల నిజాయితీని శంకించక తప్పదు.
అవి ఎవరి చెప్పుచేతలలో పని చేస్తున్నాయో, ఎవరి ప్రభావానికి లోనవుతున్నాయో, కంటికి కనిపించకుండా ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నాయో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.స్వంత పార్టీ నేతలపై దర్యాప్తులు, కేసులు, విచారణలు పెద్దగా కనిపించవు. విపక్షంలోకి వెళ్లిపోగానే అసైన్డ్ భూముల కబ్జాపై ఎంక్వయిరీ మొదలవుతుంది. స్పెషల్ టీమ్‌లు రంగంలోకి దిగుతాయి. జీఎస్టీ ఎగవేత ఆరోపణలు తెరపైకి వస్తాయి. దాడులు జరుగుతాయి. తప్పులన్నీ బైటకు తీసే వ్యవహారం మొదలవుతుంది. దర్యాప్తు సంస్థలు కేవలం రాజకీయ ప్రత్యర్థుల కోసం మాత్రమే అనేది స్థిరపడింది.
బెదిరించి లొంగదీసుకోవడం
అధికార పార్టీ నాయకులు వారు ఎన్ని ఆర్థిక నేరాలకు పాల్పడినా కేసులు, సోదాలు, దర్యాప్తులు, విచారణలు ఉండవు. కానీ, విమర్శిస్తే తప్పుడు కేసులలో ఇరికించడం, వెంటాడి వేధించడం ప్రభుత్వాల రెగ్యులర్ వ్యవహారంగా మారింది. గతంలో కాంగ్రెస్ అయినా ఇప్పుడు బీజేపీ అయినా కేంద్ర స్థాయిలో ఇదే జరుగుతున్నది. తెలంగాణలోనూ ఇందుకు భిన్నమైన పరిస్థితేమీ లేదు. ఇంతకాలం సీబీఐ మీద మాత్రమే అలాంటి మచ్చ ఉండేది. గత పదేళ్లుగా ED, IT, NARCOTIC CONTROL BUREAU, NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) లాంటి సంస్థలకూ అది అంటుకున్నది.
బెదిరించడం, లొంగదీసుకోవడం ఈ కేసులు, దర్యాప్తు వెనుక ఉన్న ఉద్దేశం. అందుకే అనుకూలంగా వ్యవహరించే అధికారులు ఉన్నత స్థానాలలో ఉంటే, ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఎక్స్‌టెన్షన్ పేరుతో ఉద్యోగంలో కొసాగుతూనే ఉంటారు. నిబంధనలు అంగీకరించకపోతే చట్ట సవరణ కూడా జరిగిపోతుంది. సహకరించేవారితో సంస్థలను అనుకూలంగా మల్చుకోవడం అధికార పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. ఈ కారణంగానే ప్రతిపక్ష నాయకులను ఉద్దేశపూర్వకంగానే ఇరికిస్తున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలోనూ బీజేపీ, టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య పొలిటికల్ వార్ జరుగుతున్నది.
ఎవరి స్వార్థం వారిదే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్‌ను కట్టడి చేయడానికే లిక్కర్ స్కామ్ దర్యాప్తు హడావిడి జరుగుతున్నదని, పోలింగ్ అయిపోగానే ఈ కేసు నీరుగారిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'సిట్'పైనా ఇదే తరహా విమర్శలు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్‌లో కవిత పేరును బీజేపీ నేతల ద్వారా బైటకు తెప్పించి ఇబ్బంది పెడుతున్న ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం కోసం టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఎమ్మెల్యేలకు వందల కోట్ల రూపాయల ఎర వేసి, ప్రలోభాలకు గురి చేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు బీజేపీ పాల్పడుతున్నదని కేసీఆర్ ఓపెన్‌గానే విమర్శలు చేశారు. దర్యాప్తు సంస్థల వెనక ఉన్న రాజకీయ ఒత్తిడి బహిరంగ రహస్యమే.
యూపీఏ-2 చివరి రోజులలో 2013 సెప్టెంబరులో అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్‌కు రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీ సుదీర్ఘ లేఖ రాశారు. దర్యాప్తు సంస్థల తీరును తూర్పారబట్టారు. గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని, మంత్రిగా ఉన్న అమిత్ షాను ఉద్దేశపూర్వకంగానే కేసులలో పెట్టి ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోహ్రాబుద్దీన్, ఇష్రత్ జహాన్, ప్రజాపతి ఎన్‌కౌంటర్ కేసులలో వారి పేర్లు పెట్టి వేధిస్తున్నారని వివరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీ సైతం భిన్నంగా ఏమీ లేదు. రాజకీయ ప్రత్యర్థులపైకి అదే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నది.
Also read: ఉన్నది ఉన్నట్టు: మారుతున్న డెమోక్రసీ మీనింగ్! ఇప్పుడిదే నయా ట్రెండ్
తెరపైకి పాత కేసులు
తాజాగా 'నేషనల్ హెరాల్డ్' కేసులో మనీ లాండరింగ్‌కు ఆరోపణలపై పాతకేసును బీజేపీ తిరగదోడింది. ఎనిమిదేళ్ల క్రితం జనతా పార్టీ నాయకుడు సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను ఆధారం చేసుకున్నది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను దర్యాప్తు పేరుతో ఈడీ పిలిపించుకుని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ విషయంలోనూ ఈడీ వ్యవహరించిన తీరు, చివరకు జైలుకు పంపడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుపట్టింది. ఇక మహారాష్ట్రలో ఎన్‌సీపీకి చెందిన ఇద్దరు మంత్రులు అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌లకూ దర్యాప్తు సంస్థల నుంచి తిప్పలు తప్పలేదు. జైలుకు వెళ్లాల్సి వచ్చింది. బొగ్గు గనుల కేటాయింపు ఆరోపణలపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌పైనా కేసు నమోదైంది.
కేరళలో రెండేళ్ల క్రితం నాటి బంగారం స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఇరికించడానికి ఈడీ పడరాని పాట్లు పడుతున్నదంటూ సీపీఎం బహిరంగంగానే కేంద్రాన్ని విమర్శిస్తున్నది. నిజానికి చాలా కేసులు ఒక దశ వరకూ దర్యాప్తు జరిగి ఆగిపోతాయి. తెలంగాణలో 'ఓటుకు నోటు' డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్ నయీం కేసు లాంటివి ఆ కోవలోనివే. రాజకీయంగా ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు బైటకొస్తాయి. ప్రయోజనం నెరవేరిన తర్వాత కోల్డ్ స్టోరేజీకి వెళ్ళిపోతాయి. అధికార పార్టీల అజమాయిషీలో నడిచే దర్యాప్తు సంస్థలు స్వంత అస్థిత్వాన్ని కోల్పోయాయి. ఈ మచ్చను తొలగించుకోకుంటే వాటిపై సామాన్య ప్రజలకు కూడా విశ్వాసం పోతుంది. వాటి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.
ఎన్. విశ్వనాథ్
99714 82403