రాజకీయాల్లో ఊహకందని పరిణామాలు..
దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ మార్పులు పరిశీలిస్తుంటే రాజకీయ విశ్లేషకులకు, మేధావులకు సైతం అంతు చిక్కడం
దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ మార్పులు పరిశీలిస్తుంటే రాజకీయ విశ్లేషకులకు, మేధావులకు సైతం అంతు చిక్కడం లేదని స్పష్టమవుతోంది. ఏ రాజకీయ పార్టీ గెలుస్తుందో.., ఏ పార్టీ ఓడిపోతుందో.. ఎవరు అధికారంలోకి వస్తారో అనే అంశాలపై వాస్తవాలను అంచనా వేయడంలో సఫలం కాలేకపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు లోతుగా అర్థం కావడం లేదు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇంతలా తికమక పెట్టే కీలక పరిణామాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదనే చెప్పాలి.
తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించినవాడిగా పేరుపడిన కేసీఆర్ పరాజయం పొందడం. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు సన్నిహితుడుగా మెలిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి కావడం, ఈసారి శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీకి నిలబెట్టకపోవడం. సుదీర్ఘ ఉద్యమ చరిత్ర గల ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో మిణుగురు పురుగుల వెలుతురు స్థాయికి పరిమితం కావడం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం హవా తగ్గిపోయి, సంకీర్ణ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. వంటి వన్నీ షాక్ కలిగించేవే మరి.
కేసీఅర్, జగన్‌లకు శృంగభంగం
తెలంగాణా రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతగా కేసీఆర్‌ను గుర్తించి బీఆర్ఎస్‌కు పట్టం కట్టారు. రెండోసారి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అధికారం ఇచ్చారు. మూడోసారి వచ్చేసరికి ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కారణం.. ఉద్యోగ నియామకాలు పూరించకపోవడం, గ్రూప్ పరీక్షలు సకాలంలో నిర్వహించ లేకపోవడం, పేపర్ లీకేజీ నిరుద్యోగులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. వారే ప్రభుత్వంపై బహుళంగా వ్యతిరేక ప్రచారం చేశారు. బీజేపీతో అంతర్గత ఒప్పందం జరిగిందనే ప్రచారం కూడా కొంత వ్యతిరేక ఓటుకు కారణమయ్యింది. ఇలాంటి కారణాలతో కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అధికారం చేజారిపోయింది. అలాగే అభ్యర్థులపై ఉన్న తీవ్ర వ్యతిరేకత బీఆర్ఎస్ ఓటమిలో కీలక భూమిక పోషించింది. ఇలాంటి కారణాలే వైఎస్ఆర్‌సీపీకి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎదురయ్యాయి. అధికారమే పరమావధిగా, అన్ని రకాలుగా సర్దుబాటు చేసుకుని, విశాల ఐక్య సంఘటనతో చంద్రబాబు ఎట్టకేలకు అధికారంలోకి రాగలిగారు.
దయనీయ స్థితిలో వామపక్షాలు
తెలంగాణ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రాభవం మసకబారిపోయింది. 1983కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా కమ్యూనిస్టుల ఐక్య సంఘటన ఉండేది. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు శం పార్టీ అనుసంధాన పార్టీలుగా మారిపోయాయి. ఎన్నికల సమయంలో బేరసారాలాడి అభ్యర్థులను నిలబెట్టుకుని గెలిపించుకునే దుస్థితికి నెట్టివేయబడ్డాయి. ఇక ఆ వెనుకబాటు అలాగే కొనసాగుతూ వచ్చింది. ఇటీవలి తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు చివరి వరకు బీఆర్ఎస్‌తో పొత్తుకు ప్రయత్నాలు చేశాయి. అది బెడిసికొట్టడంతో సీపీఐ, కాంగ్రెస్ పార్టీని అభ్యర్థించి కేవలం ఒక సీటులో పోటీచేసి గెలిచింది. మొదట్లో ఒంటరిగా పోటీ చేసిన సీపీఎం చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా కొద్ది ఓట్లకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి భేషరతుగా మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా ఆ పార్టీల ఊసేలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీల దీనస్థితిని ఎవరూ ఊహించి ఉండరు.
చార్ సౌ పార్ ఎక్కడ?
కేంద్ర విషయానికొస్తే బీజేపీ చార్ సౌ పార్ ఆశించి, దో సౌ పార్ కే పరిమితం అయింది. రాజ్యాంగ మార్పు చేస్తారనే అంశం, ముస్లిం వ్యతిరేక ప్రచార అంశాలు బీజేపీని ఇరుకున పెట్టాయి. ఎన్డీఏ కూటమిలోని చిన్నాచితకా పార్టీలతో పాటు చంద్రబాబు, నితీష్ కుమార్‌ల సహకారంతో అధికారంలోకి రాగలిగింది. అది మోడీ ప్రభావానికి, బీజేపీకీ పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఏక వ్యక్తి, ఏక పార్టీ పాలన నుండి ఎన్డీఏ కూటమిగా మాత్రమే అధికారంలోకి రాగలిగింది. ఇండియా కూటమి తీవ్రంగా కృషిచేసినా, అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. బలమైన ప్రతిపక్షం స్థానంతో సరిపెట్టుకుంది.
అందుకే పక్క పార్టీవైపు చూపులు..
పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణాలో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం 8 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ అభ్యర్థులు అనూహ్యంగా ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడం ఊహలకందని విశేషం. ఒంటరిగా 12 లేదా 14 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్ మాటలు.. ఒక్క సీటూ గెలవలేదు. దీనికి తోడు కాంగ్రెస్‌ను నిరోధించేందుకు బీజేపీ అభ్యర్థుల గెలుపునకు సహకరించారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్‌లో అంతర్గత సంక్షోభానికి తెరలేపాయి. గెలిచిన ఎమ్మెల్యేలు, నాయకులు నెమ్మదిగా పక్క చూపులు మొదలుపెట్టారు. కొంతమంది అధికార పార్టీ బాట పట్టారు. ఇలా ఊహకందని పరిణామాలతో రాష్ట్ర, దేశ రాజకీయాలు రంజుగా మారనున్నాయి.
ప్రజలే చరిత్ర నిర్మాతలు..
ఇన్ని చిత్ర విచిత్ర రాజకీయ పరిణామాల మధ్య కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ సజావుగా సాగుతూనే ఉన్నది. కార్మికులు, రైతాంగం, నిరుద్యోగులు, విద్యార్థుల పరిస్థితులు ఆందోళనకరంగానే ఉంది. పోటీ పరీక్షల లీకేజీలు ఆగడం లేదు. ఉచిత విద్యా, ఉచిత వైద్యం ఎన్నికల వాగ్దానాలుగానే మిగులుతున్నాయి. జీవించే హక్కుకు భద్రత కానరావడం లేదు. కేవలం కార్పొరేట్ శక్తుల రక్షణ కోసం కొత్త క్రిమినల్ చట్టాలు మరింత కఠినంగా అమలు కాబోతున్నాయి. ప్రజలకు, పాలకుల విధానాలకు మధ్య అంతరాలు నానాటికి పెరుగుతున్నాయి. హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యం అన్న భావన స్థిరపడి, బలపడుతున్నది. ప్రజలే చరిత్ర నిర్మాతలన్నది నిత్య సత్యం!
రమణాచారి
99898 63039