కనీవినీ ఎరుగని భూకంపం

కనీవినీ ఎరుగని భూకంపం... turkey earthquake unprecedented

Update: 2023-02-07 18:30 GMT

ఫిబ్రవరి 6 ఉషోదయాన జరిగిన భయంకర భూకంప మృత్యుకేళితో ఆగ్నేయ తుర్కియే లేదా టర్కీ, సిరియా నగరాలు(అలెప్పో, హామా లాంటి) విలవిల్లాడడం, పేక మేడల్లా బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం కావడం, శిథిలాల దిబ్బలుగా మారడం, వేల కొద్ది జనులు శిథిలాల కింద పడి తుది శ్వాస విడవడం చూస్తుండగానే జరిగిపోయింది. ప్రసార మాధ్యమాల్లో వీడియోలు చూసిన ప్రపంచ మానవాళి నివ్వెరపోయి విస్తుపోతున్నారు. కొద్ది గంటల్లోనే రిక్టర్‌‌ స్లేల్ ‌పై 7.8, 7.6. 6.0 పరిమాణంతో మూడు సార్లు భూమి కంపించడంతో దక్షిణ-కేంద్ర టర్కీ ప్రాంతంలో గాజియన్టెక్‌ నగరంతో పాటు మరో 10 నగరాల్లో భవనాలు పూర్తిగా నేల మట్టం కావడం లేదా పాక్షికంగా ధ్వంసం కావడంతో 2 మిలియన్ల ప్రజలు నిరాశ్రయులయ్యారు. గాజియాన్టెక్‌ నగరానికి 33 కిమీ దూరంలో 18 కిమీ లోతులో భూకంప ప్రభావ కేంద్రం కనిపించడంతో గజియాన్టెక్‌ నగరంలోని 2,200 ఏళ్ళ క్రితం నాటి రోమన్‌ కాలపు చారిత్రక కట్టడం కూడా పూర్తిగా ధ్వంసం కావడం జరిగిపోయింది. ఇంతవరకు 5 వేలమంది ప్రాణాలు కోల్పోగా, శిథిలాల కింద మరెంతో మంది కూరుకపోయారని భావిస్తున్నారు. పేదరికం రాజ్యమేలుతున్న టర్కీ, సిరియాల్లో అంతర్గత అశాంతి మంటలతో ప్రజలు అభద్రతల నడుమ బిక్కు బిక్కున బతుకులు ఈడుస్తున్నారు. సిరియాలో అంతర్గత యుద్ధం, టర్కీలో 30 లక్షలకు పైగా సిరియన్‌ శరణార్థుల చేరడం, భవనాలు బలహీనంగా నిర్మించడం, జనసాంద్రత ఎక్కువగా ఉండడం లాంటి సమస్యలు భూకంప నష్టాలను అనేక రెట్లు పెంచాయని నిపుణులు నిర్థారించారు.

వారి హెచ్చరికలు పెడచెవిన పెట్టారా?

ఫిబ్రవరి 03 శుక్రవారం రోజున 'ఫ్రాంక్‌ హూగర్‌బీడ్స్‌' అనే పేరున్న డచ్‌ పరిశోధకులు టర్కీ, జోర్డన్, లెబనాన్‌,‌ సిరియా ప్రాంతాల్లో 7.5 రిక్టర్‌ స్కేల్‌ కలిగిన తీవ్ర భూకంపం సమీప భవిష్యత్తులో రావచ్చని ట్వీట్‌ రూపంలో హెచ్చరించడం నేడు చర్చనీయాంశంగా మారింది. ఈ భూ ప్రళయం తరువాత కూడా వెంటనే తిరిగి భూకంపాలు రావచ్చని, ప్రజలు ముందు జాగ్రత్తగా ఉండాలని కూడా ఫ్రాంక్‌ హూగర్‌బీడ్స్ సలహాలు ఇవ్వడాన్ని పెడచెవిన పెట్టరాదు. ఈ భయానక, విధ్వంసకర భూ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు ఆవాసాలు కోల్పోవడం విచారకరమని ఫ్రాంక్‌ తెలియజేశారు. గోరుచుట్టుపై రోకలి పోటులా ఏళ్ళ తరబడి అంతర్యుద్ధంతో తిరుగుబాటుదారుల ఆధీనంలో అతలాకుతలం అవుతున్న సిరియాకు తాజా భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపాల ముప్పు ఉన్న ప్రదేశాలుగా గుర్తించి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ తుర్కియే, సిరియాల పాలకులు కనీస ముందు జాగ్రత్తలు, నిర్మాణ సమయాల్లో ప్రకంపనలు తట్టుకునేలా చర్యలు తీసుకోక పోవడంతో నష్టం అపారంగా కనిపిస్తున్నది. శాస్త్రజ్ఞుల హెచ్చరికలు భూకంపాలను నిరోధించనప్పటికీ ఆయా భూకంపాల ముప్పులను ఆయా దేశాల ప్రభుత్వాలు, పౌర సమాజం గమనించి కనీసం భూకంప నష్టాలను తగ్గించుకోవాలని విశ్వ మానవాళి విన్నవిస్తున్నది.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

9949700037

ఇవి కూడా చదవండి : Hindenburg Report: అదానీ రచ్చ దేశానికి మచ్చ

Tags:    

Similar News