ఆదివాసీకి అందలం అందుకేనా?

రాష్ట్రపతి ఎన్నికలలో ఏకపక్షంగా గెలిచి తీరుతామని అధికార పక్షం కలలు కన్నది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాను

Update: 2022-06-30 18:30 GMT

మన దేశంలో నిజమైన సమస్యలు తరచుగా అబద్ధపు కారణాలతో వెలుగు చుస్తుంటాయి. సామాజిక చైతన్యం తలకిందులుగా ఉన్నంతకాలం ఇది తప్పదేమో. అబద్దపు పునాదుల మీద అధికార భావజాలం దానిని జల్లెడ పడుతుంది. అధికార పార్టీలో ఉన్న రుగ్మతలను పోగొట్టుకోవడానికి పాలకపక్షాలు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుంటాయి. వాండ్ల జీవితంలో కనబడే పటిష్ట నియమాలు, సిద్ధాంతాలు అమలులో ఎన్నడూ దర్శనం ఇవ్వలేదు. ప్రజల మట్టుకు దేనికయినా సామాజిక రూపం వచ్చినప్పుడే అస్తిత్వం ఉన్నట్టు గుర్తిస్తారు. అందరీ అంచనాలను తారుమారు చేస్తూ అత్యున్నత రాష్ట్రపతి పదవిని ఒక ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకే బీజేపీ ఎందుకు పట్టం గట్టాలనుకుంటోంది?

రాష్ట్రపతి ఎన్నికలలో ఏకపక్షంగా గెలిచి తీరుతామని అధికార పక్షం కలలు కన్నది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాను బరిలోకి దించేసరికి బీజేపీకి మింగుడు పడలేదు. కేంద్ర ప్రభుత్వం అధికార దాహంతోఎనిమిది రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకున్నది. ఇదే అదనుగా శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్లు విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఐక్యతా రాగం తీస్తున్నాయి. ఇప్పుడు జరిగే రాష్ట్రపతి ఎన్నికలు మోడీ సారథ్యంలోని ఎన్డీయేకూ, విపక్షాలకూ కూడా కీలకం కానుంది. విపక్షాలు బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గెలుపు కోసం కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఖంగుతిన్న బీజేపీ, తాము అత్యున్నత రాష్ట్రపతి పదవికి ఆదివాసీ బిడ్డను ప్రతిపాదిస్తే విపక్షాలు ఒడియావాసి ద్రౌపది ముర్ముని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయనే ప్రచారానికి దిగింది.

తాము వ్యతిరేకించేది బీజేపీ నిరంకుశత్వ తీరును, నియంతృత్వ పాలనను మాత్రమేనని, ఆదివాసీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కాదని దాదాపు అన్ని పార్టీలు స్పష్టం చేశాయి. ద్రౌపది ముర్ము 1997లో రాజకీయాలలోకి వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉన్నత పదవులను అలంకరించి, గిరిజన నాయకురాలుగా నీలకంఠ పురస్కారాన్ని అందుకున్నారు. కానీ, తాను జన్మించిన మయూర్‌భంజ్ జిల్లా ఉపర్బెడ గ్రామానికి ఇప్పటికీ కరెంట్ లేదు. గ్రామస్థులు అనేకసార్లు మొత్తుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. బీజేపీ చేతిలో అచేతనంగా మారి సొంతూరుకు న్యాయం చేయలేని ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయితే, మోడీ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అధికార పక్షం రాష్ట్రపతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు 'నోరులేని మేకలను బలి ఇస్తారు కానీ, పులులలను కాదు' దీని వెనుక స్పష్టమైన కారణం ఉందనేది నిర్వివాదాంశం.

హక్కులు దరిజేరకుండా

రాజ్యాంగంలోని 244 (1) ఆర్టికల్ ఐదవ‌ షెడ్యూల్ ద్వారా ఆదివాసీలకు ప్రత్యేకంగా ఎన్నో హక్కులున్నాయా. అయినా ప్రాజెక్టుల‌ విషయంలో పీసా, అటవీ హక్కుల చట్టాల కింద గ్రామ సభలు నిర్వహించుకునే అవకాశం ఇవ్వలేదు. సామ్రాజ్యవాద పులిని చూసి వారి హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయనే విమర్శ ఉంది. ఆదివాసీలు బతుకుతున్న అడవులను మైనింగ్‌ పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అడవిపైవున్న హక్కును నిలబెట్టుకొనేందుకు పోరాడుతున్న గిరిజనులు, హక్కుల కార్యకర్తలపై బెయిల్‌ రాని భయంకరమైన 'ఉపా' చట్టం కింద బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌, అస్సాం, హర్యానా ప్రభుత్వాలు వేల మంది గిరిజనులను జైలులో నిర్బంధించాయి. ఝార్ఖండ్‌లో పది వేల మంది గిరిజనులపై రాజద్రోహం నేరం కింద కేసు నమోదు చేశారు.

ఒడిశాలోని కళింగన‌గర్‌లో గతంలో ఆదివాసీలకు పట్టెడన్నం పెట్టే అడవిని విద్వంసం చేసి స్టీల్ ప్లాంట్ కడుతుంటే, 2 జనవరి, 2006 న గిరిజనులు ఆందోళనకు దిగారు. కాల్పులు జరిపి 13 మందిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వంలో ద్రౌపది ముర్ము రాష్ట్ర మంత్రిగా స్పందించ లేదు. గిరిజనులను ఓదార్చిన పాపాన పోలేదు. ఆదివాసీలని 'అభివృద్ధి నిరోధకులని, నక్సలైట్లుగా ప్రచారం చేసి ఎంతో మందిని బలి తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో మాత్రం రాజకీయ ఎత్తుగడల‌తో కపట ప్రేమతో కులం పునాదుల మీద స్వార్థంతో అభ్యర్థులను నిలబెడుతున్నారు. బీజేపీ నిర్ణయం వెనుక పెద్ద గూడుపుఠాణి దాగి ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. గుజరాత్‌తో పాటు వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అత్యధికంగా గిరిజన జనాభా కలిగి ఉన్న రాష్ట్రాలలో లబ్ధి పొందాలని చూస్తున్నారు. గిరిజనులను ఏదో ఉద్ధరిస్తామని బీజేపీ కొత్తపలుకు పలుకుతున్నది. రాష్ట్రపతి అభ్యర్థిగా 'ద్రౌపది ముర్ము'ను ఎంపికతో విపక్షాలను చీల్చాలనుకున్నారా?

ఇప్పుడెందుకీ చిలుక పలుకులు

మన దేశంలో నిజమైన సమస్యలు తరచుగా అబద్ధపు కారణాలతో వెలుగు చూస్తుంటాయి. సామాజిక చైతన్యం తలకిందులుగా ఉన్నంతకాలం ఇది తప్పదేమో. అబద్దపు పునాదుల మీద అధికార భావజాలం దానిని జల్లెడ పడుతుంది. అధికార పార్టీలో ఉన్న రుగ్మతలను పోగొట్టుకోవడానికి పాలకపక్షాలు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుంటాయి. వాండ్ల జీవితంలో కనబడే పటిష్ట నియమాలు, సిద్ధాంతాలు అమలులో ఎన్నడూ దర్శనం ఇవ్వలేదు. ప్రజల మట్టుకు దేనికయినా సామాజిక రూపం వచ్చినప్పుడే అస్తిత్వం ఉన్నట్టు గుర్తిస్తారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ అత్యున్నత రాష్ట్రపతి పదవిని ఒక ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకే బీజేపీ ఎందుకు పట్టం గట్టాలనుకుంటోంది? అనేవి అందరి మదిలోనే తలెత్తే ప్రశ్నలే. కారణం లేకపోలేదు. ఓడిపోతామన్న భయంతో తనకు ఉన్న ఓట్లను బేరీజు వేసుకొని తన రాజకీయ చతురతను ఉపయోగించి ఒడియా మద్దతు కూడ గట్టుకోవాలనే 'ద్రౌపది ముర్ము' పేరును తెరపైకి తెచ్చి బీజేపీ గిరిజనులను ఉద్ధరిస్తామని కొత్త పలుకులు పలుకుతోంది.

గతంలో మాదిరిగా అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతిగా ఎన్నికైతే భవిష్యత్‌లో ఏం జరుగుతుందోనన్న భయంతో దూకుడు పెంచింది. విపక్షాల చీలిక తెచ్చి లబ్ధి పొందేందుకు రాజ్యాంగ సంస్థలను అడ్డుపెట్టుకుంటోంది. బీజేపేయేతర ప్రభుత్వం ఉన్న మహారాష్ట్రలో 'షిండే' రాజకీయ సంక్షోభం సృష్టించడానికి బీజేపీ అండదండలే కారణంగా భావిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ ఒకడుగు ముందుకేసి కేంద్ర బలగాలను మోహరింపజేయడం బీజేపీ మైండ్ గేమ్‌లో ఒక భాగం అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

డా. సంగని మల్లేశ్వర్

జర్నలిజం విభాగాధిపతి

కేయూ, వరంగల్

98662 55355

Tags:    

Similar News