సామాన్యులకు భారంగా మారుతున్న రైలు ప్రయాణం

సామాన్యులకు భారంగా మారుతున్న రైలు ప్రయాణం... Train travel is becoming a burden for common people

Update: 2023-01-04 18:30 GMT

రైల్వేలో ఇప్పటికే 13 లక్షల పర్మినెంట్ పోస్టులు (ఖాళీలతో కలిపి), 6.50 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వీటిని 7 లక్షలకు తగ్గించారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే ఇప్పటివరకు టిక్కెట్‌పై ఇస్తున్న రాయితీ 45 శాతానికి పడిపోతుంది. అలాగే సరకు రవాణాపై వచ్చే ఆదాయం ప్రైవేటు, కార్పొరేట్ చేతిలోకి వెళతాయి. కొత్త ఉద్యోగాలు రాకపోవడంతో పాటు ఉన్న ఉద్యోగాలు పోతాయి. రైలును వారు ఆదాయం వచ్చే రూట్లలోనే నడుపుతారు కాబట్టి వెనుకబడిన ప్రాంతాలకు రైలు దూరం అవుతుంది. అలాగే రైలు చార్జీల భారం పెరుగుతుంది.

ప్రైవేటీకరణ కోసమేనా ఇదంతా?

రైల్వే వ్యవస్థను ఇలా ప్రైవేటీకరించడం వలన అర్జెంటీనాలో 35 వేల కిలోమీటర్లు ఉన్న రైలు మార్గాన్ని రద్దుచేసి కేవలం 8 వేల కిలోమీటర్లు మాత్రమే నడుపుతున్నారు. ఆ అర్జెంటీనా అనుభవంతోనే ఇక్కడి రైల్వేను ప్రవేటీకరించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా చాప కింద నీరులా ప్రైవేటీకరణ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే రైల్వేలోని 53 వేల కోట్ల ఆస్తులను అమ్మేసింది. అలాగే వారణాసీలో డీఎల్‌డ్ల్యూ అనే ప్రభుత్వ రంగ కంపెనీకి గతంలో 320 డీజీల్ ఇంజన్లు తయారు చేయాలనే లక్ష్యాన్నివ్వగా ఆ కంపెనీ 330 ఇంజన్లనే తయారు చేసింది. ఇప్పుడు అలాంటి సంస్థను కాదని అమెరికాలోని ఎలక్ట్రికల్ సంస్థతో 1000 డీజిల్ ఇంజన్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ రైల్వే కోచ్‌లను తయారుచేస్తోంది. దానిని కాదని ఫ్రెంచ్ ఆల్ స్టామ్ నుండి దిగుమతికి ఒప్పందం కుదుర్చుకుంది.

అలాగే రాయబరేలీలోని కోచ్ ఫ్యాక్టరీ 1000 కోచ్‌లను తయారు చేయగలదు. కానీ 150 మాత్రమే తయారు చేయమనడం ఆశ్చర్యం. ఇలా విదేశాల కంపెనీలకు రైల్వే ఇచ్చే ఆర్డర్లు అన్నీ మన కంపెనీలకే ఇస్తే రూ. 20 వేల కోట్లు మిగులుతాయని రైల్వే అధికారి చెప్పారు. మన దేశంలో ఇంజన్ ఖర్చు రూ. 1.8 కోట్లు కానీ అమెరికాతో తీసుకుంటే దానికి రూ. 8 కోట్లు చెల్లించాలి. కానీ ఆ తయారీదారులు ప్రయాణికులను ఆకర్షించే పనిపై దృష్టి పెట్టి ప్రయాణికుల భద్రత గాలికొదిలేస్తారు. బ్రిటన్‌లో అదే జరిగింది. అక్కడి రైల్వే ప్రైవేటీకరణ తరువాత రైల్వే ప్రమాదాలు మూడు రెట్లు పెరిగాయి. పట్టాలు, కోచ్‌లు, ఇంజన్లు, సిగ్నల్, స్టేషన్లు ప్రజలవి. లాభాలు మాత్రం కార్పొరేట్లవి. రైల్వేను ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి కరోనా సమయంలో రైల్వే కోచ్‌లను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చింది. కానీ అదే ప్రైవేట్ పరం అయితే ఇది సాధ్యమవుతుందా? ఆ సమయంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులే చేతులెత్తేశాయి. రైల్వే ప్రైవేటీకరణ వలన సామాన్య ప్రజలు రైలు ప్రయాణానికి దూరం అవుతారు. ఉద్యోగాలు రావు, రాయితీలు ఉండవు, రైళ్లు తగ్గుతాయి, చార్జీలు పెరుగుతాయి, యాక్సిడెంట్లు పెరిగి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ప్రజలు కష్టాల్లోకి వెళ్తారు.

రిజర్వేషన్ చేసుకున్నా లాభం లేదా?

ఇప్పటివరకు చెన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) నుంచి హై స్టీల్‌తో తయారుచేసిన భోగీలను నడిపేవారు కానీ ఇప్పుడు వాటి స్థానంలో జర్మనీ దేశపు కంపెనీకి చెందిన ఎల్‌హెచ్‌బీ(LHP) నుండి మైల్డ్ స్టీల్‌తో తయారు చేయబడుతున్న భోగీలను ప్రవేశపెడుతున్నారు. ఈ భోగీలు తక్కువ శబ్దంతో అధిక వేగంతో ప్రయాణం చేసినా, చూడటానికి సుందరంగా ఉన్నా, ఇందులో ఏర్పాటు చేసిన టాయిలెట్స్‌ను ఉపయోగించుకోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ కోచ్‌లో డోర్ ముందు నీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తుంది. అలాగే ఈ కోచ్‌లో బాత్ రూం డోర్ తియ్యడానికి పెట్టడానికి చిన్న పిల్లలకు, సీనియర్ సిటిజన్స్ కు ఇబ్బందిగా ఉంది.

గతంలో ఉన్న ఐసీఎఫ్ భోగీలు టాయిలెట్స్ లో సౌకర్యవంతంగా ఉపయోగించడానికి వీలుగా ఉండేవి.అలాగే ఈ మధ్య రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో వెయిటింగ్ లిస్ట్‌లో టిక్కెట్లు తీసుకున్న ప్రయాణికులను స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించడానికి అనుమతినిస్తున్నారు. దీనివలన అప్పటికే టికెట్ బుక్ చేసుకొని కన్ఫామ్ అయిన వారు ఇలా వెయిటింగ్ లిస్ట్ వారు భోగీలో ఎక్కడంతో టాయిలెట్స్, లగేజీ పెట్టుకునేందుకు, అలాగే కాస్త అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటప్పుడు స్లీపర్ క్లాస్‌కు జనరల్ భోగికి తేడా ఏమి ఉందని వాపోతున్నారు. అలాగే సెకండ్ సిట్టింగ్‌లో రిజర్వేషన్ చేసుకున్న వారి భోగీలలో జనరల్ ప్రయాణికులను అనుమతించడం వలన రద్దీగా ఉండే సమయంలో వారు సీటు దగ్గరికి పోవడానికి ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. అందుకే రైల్వే వారు కోచ్‌లలో సౌకర్యవంతమైన టాయిలెట్స్ తిరిగి ఏర్పాటు చేయాలి. వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్యాసింజర్ల కోసం అదనంగా ఏర్పాటు చేయాలి. ఇదే పద్ధతిలో ప్రయాణికుల రద్దీని బట్టి సెకండ్ సిట్టింగ్ కోసం అదనపు కోచ్‌లు ఏర్పాటు చేయాలి. భారతీయ రైల్వే ప్రయాణికులకు ప్రయాణం మరపురాని స్వప్నంగా మిగిలిపోయేలా చేయాలి.

దండంరాజు రాంచందర్ రావు

రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సింగరేణి భవన్, హైదరాబాద్

9849592958

Also Read....

ఉన్నది ఉన్నట్టు: నోట్ల రద్దు చేయలేనిది కరోనా చేసిపెట్టిందా?


Tags:    

Similar News