నవోదయం వైపుగా 2025..!

అనంత విశ్వాన్ని అర్థం చేసుకోవాలనే అన్వేషణ అడవులలోని ఆది మానవుల కాలం నుంచి చంద్రయాన్ ఆధునిక మానవుని దాకా వచ్చింది.

Update: 2025-01-01 00:45 GMT

అనంత విశ్వాన్ని అర్థం చేసుకోవాలనే అన్వేషణ అడవులలోని ఆది మానవుల కాలం నుంచి చంద్రయాన్ ఆధునిక మానవుని దాకా వచ్చింది. సత్యశోధనకు "కాలం" ఓ ఆయుధం. గడియారంలోనో, క్యాలెండర్ లోనో కని పించేదీ మాత్రమే కాదు కాలమంటే..! ఫిజిక్స్‌లో, ఫిలాసఫీలో, పోయెట్రీలో 'కాలం' అనే పదానికి అర్థాలే వేరు. ఏదేమైనా సాంకేతికత జతగా సంవ త్సరాలు కరిగిపోతూనే వున్నాయి. నాగరికత విభిన్న పోకడలతో అంతరిక్ష హద్దులను, అంతర్జాతీయ గీతలను కాలంతో పాటుగా కబంధ హస్తాలతో పట్టుకెళ్తూనే వుంది. 

2024కు యావత్ మా'నవ' ప్రపంచం వీడ్కోలు పలికేందుకు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు వేదికలను సిద్ధం చేసుకుంటోంది. 2025 సందర్భంగా ఓ ఉషో దయానికి స్వాగతం పలికేందుకు పలురకాలుగా సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. కొన్ని గడిచి పోయిన సంఘటనల తాలూకు స్మృతు లను, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు సవాళ్లను, సాధించాల్సిన సంగతుల వంటి ఎన్నో విషయాలను కాసేపు మాట్లాడుకుందాం.

సైన్స్ ఆండ్ టెక్నాలజీలో..

సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేథ, రోబోటిక్ టెక్నాలజీ, ప్రయివేటు రంగంలో అంతరిక్ష యాత్రలు, అంతరిక్ష పంటలు, చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు, సూర్యుడి ఉపరితలం, అంత ర్భాగం శోధన వంటివి ఎన్నో... మనల్ని విశ్వరహస్యాల సాధన వైపు నడిపిస్తున్నాయి. మన ఇస్రో, డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల, ఇంజనీర్ల కృషి వలన మన ప్రయోగాలు మనందరికీ గర్వకారణమైనాయి. పీఎస్ఎల్‌వీ, అగ్ని, హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగ ఫలితాల విజయాలు వంటివి మన జాతీయ జెండాను మన గుండెల్లో ఎగిరేలా చేశాయి. గగనయాన్‌తో సహా మన శాస్త్రీయ ప్రయోగాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని నింపేలా, శాస్త్రీయ దృక్పథంను సమాజంలో పెంపొందించేలా వుంటూ శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ అగ్ర దేశాలకు సైతం దిక్సూచిగా మారాలని, ఆ మార్గంలోనే మన ప్రయాణం, ప్రయత్నం కొనసాగాలని ఆశిద్దాం.

రాజకీయ రంగంలో..

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోడీ చరిష్మా కొంచెం తగ్గినా, ప్రధానమంత్రిగా మూడోసారి కొనసాగుతూ ప్రపంచంలో బలమైన నాయకునిగా తన సత్తాను చాటుతున్నారు. భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలకు దగ్గరైన రాహుల్ గాంధీ ద్వేషంపై ప్రేమే గెలుస్తుందంటూ బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావాణిని వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సుదీర్ఘ రాజ కీయ అనుభవ చతురతతో కొట్టిన సూపర్ సిక్స్‌తో తనదైన మార్క్ పాలనతో నేటి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 'మార్పు' పాలన అంటూ వినూత్న పథకాలతో దేశ రాజకీయాల్లో సైతం బలమైన కాంగ్రెస్ నేతగా దూసుకుపోతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పవన్ కల్యాణ్ గురించి గూగుల్ సెర్చ్ ఇంజిన్ నుండి డిప్యూటీ సీఎం గా ఆయన పేరు, పిఠాపురం నియోజకవర్గం పేరు ఎన్నో సినీ, రాజకీయ వేడుకల్లో, వేది కల్లో ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల దాకా బలంగా వినిపిస్తోంది.

ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ..

ప్రభుత్వ బడుల్లో సమస్యలు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒత్తిడి తట్టుకోలేక కొంత మంది విద్యార్థుల ఆత్మహత్యలు, పంట చేతికి రాక అప్పుల ఊబిలో రైతుల ఆత్మహత్యలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు, పరువు పేరుతో అమానవీయ సంఘటనలు, చదువు "కొనలేని" ప్రతిభ గల పేద విద్యార్థుల కలలు, బడ్జెట్ ప్రయివేటు విద్యాసంస్థల నిర్వాహకుల సమస్యలు,ఉన్నత విద్య చదివి ప్రయివేటు విద్యాసంస్థల్లో చాలీ చాలని జీతాలతో పని చేస్తున్న సిబ్బంది సమస్యలు, యూనివర్సిటీ స్థాయిలో నాణ్యమైన విద్య, పరిశోధన సదుపాయాలు అందని సందర్భాలు, పలు రంగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ప్రయివేటు ఉద్యోగుల, కార్మికుల బతుకు సమస్యలతో పాటు 78 సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో ఉచిత విద్య, సమాన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఉన్నత స్థాయి వైద్యం, సాంకేతికత అందుకోలేని గ్రామీణ ప్రాంతాలు... ఇలా ఎన్నో సమస్యలతో కూడిన సవాళ్లతో యావత్ దేశం తల్లడిల్లుతున్నప్పటికీ అలుపెరగని పోరాటం చేస్తూ, వికసిత భారత్ 2047 సాక్షిగా విభిన్నతలో ఏకత్వమై దేశం ముందుకు వెళుతుంది.

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించకపోతే..

6G టెక్నాలజీ సాక్షిగా అందమైన భవనాలు ఆకాశాన్ని తాకుతుండగా, అభివృద్ధి పేరుతో అడవులను నరకడం, చెట్లను సంరక్షించక పోవడం వంటి వాటితో ప్రకృతి వైపరీత్యాలు, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం, కర్బన ఉద్గారాలు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించకపోవడం వల్ల భవిష్యత్తులో మానవ మనుగడే చాలా కష్టంగా మారుతుంది. పర్యావరణ కాలుష్యంపై ప్రపంచమంతా ఏకమై 'పరిరక్షణ' యుద్ధం చేయకపోతే ప్రాణం పోస్తున్న ఆక్సిజనే ప్రాణం తీసే అణుబాంబు అవుతుంది. మనమంతా మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.

క్రీడా రంగంలో..

భారతీయ సినిమాపైనే కాదు! అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా, సంస్కృతి ప్రజలను ఆకట్టుకుంటుంది. వినేశ్ పొగాట్, గుకెశ్, కోనేరు హంపి, నితీష్ రెడ్డి వంటి వారెందరో మన క్రీడా వైభవపు వారసత్వాన్ని కొనసాగిస్తూనే వున్నారు. ఏదేమైనా 2024 క్యాలెండర్‌ను తీసేసి 2025ను ఆహ్వానిద్దాం. హద్దులు మీరని ఆనందపు వేడుకలతో పర్యావరణ, ప్రజాస్వామ్య పక్షమై మనమంతా గతం తాలూకు మంచి జ్ఞాపకాలతో ముందు కు వెళ్తూ భవిష్యత్తు సమస్యలపై, ఓటమిలపై యుద్ధం చేద్దాం."చిరునవ్వులతో బతకాలి..! చిరంజీవిగా బతకాలి..! ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బతకాలి..!! అంటూ వెనిగళ్ల రాంబాబు గారి అక్షరాల స్ఫూర్తితో 2025కు గ్రాండ్ వెల్ కమ్ చెబు దాం. విష్‌యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్..!

- ఫిజిక్స్ అరుణ్ కుమార్

ప్రైవేటు టీచింగ్ ఫ్యాకల్టీ

93947 49536

Tags:    

Similar News