కించపరిచే రాజకీయం!

ఎదుటివారిని అవమానించడమే, కించపరచడమే, నేటి రాజకీయం అయిపోయింది.

Update: 2023-08-31 19:00 GMT

ఎదుటివారిని అవమానించడమే, కించపరచడమే, నేటి రాజకీయం అయిపోయింది. అవహేళన, మరీ సామాన్యం అయ్యింది. దీనికంతటికి కారణం అధికారం, అధికార అహంకారం, కొంత ఆయా వ్యక్తుల గుణం! తెలంగాణలో మూడు నెలలలోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చెప్పలేము, పార్లమెంట్ ఎన్నికలు కూడా ముందస్తుగా ఈ ఏడాది డిసెంబర్ లోనే ఉంటాయి. కావచ్చు, అలా అధికార, విపక్ష నేతల సంకేత ఉపన్యాసాలు, స్టేట్మెంట్‌లు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎక్కడి వారు అక్కడ ప్రిపేర్ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలలో ఎన్నికల వేడి కనిపిస్తున్నది. బీజేపీ అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తున్నది. కాంగ్రెస్ తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో ఇదే కసరత్తులో నిమగ్నం అయ్యింది.

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. దాదాపు సిట్టింగ్‌లే ఇందులో ఉండగా, కొన్ని స్వల్ప మార్పులు చేసారు. ఇంకా ఆ పార్టీ సర్వే లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లు టికెట్ నిర్ధారణ అయిన వారు, జోష్ లో ఉంది ర్యాలీలు నిర్వహిస్తుండగా, టికెట్ ఆశించి రాని వారు, పార్టీ మీద కారాలు, మిర్యాలు నూరుతున్నారు. అసమ్మతి గళం పెరిగింది. కొందరు కాంగ్రెస్, బీజేపీ లలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. బుజ్జగింపులు, నయానా, భయానా, సాగుతుంది.

హస్తం పార్టీ అభ్యర్థులూ కోవర్టులేనట..

ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తమ పార్టీ లో చేరిన ఇతర పార్టీల నేతలను కుక్కలు, పిల్లులు అంటూ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు సార్ అంటారని, అంటే సీఎం కేసీఆర్ అంటారని పేర్కొనడం సంచలనం కలిగించింది. నాలుగు రోజులు కాక ముందే, చెన్నూర్ ర్యాలీలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ వారిని ఏమి అనవద్దని, వారు తనని విమర్శించినా ఏమీ అనవద్దని, వారంతా తమ వారే నని, తామే వారిని అక్కడికి పంపామని పేర్కొన్నారు.

అంతే కాదు తన పక్కన ఉన్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతను చూపుతూ వెంకన్న మన పార్టీకి రాలేదా అన్నారు. దీంతో వెంకటేష్ సంతోషంగా తబ్బి ఉబ్బి అయి, రెండు చేతులు పైకి లేపి కేరింతలు కొట్టారు. కాంగ్రెస్ టికెట్‌పై 2018 లో చెన్నూర్ నుంచి సుమన్ మీద పోటీ చేసి ఓడిన వెంకటేష్ 2019 ఎన్నికల్లో సుమన్ మద్దతుతో బిఆర్ఎస్‌లో చేరడం, పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ సాధించడం ఒకే రోజు జరిగింది. అంతవరకూ పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా అనుకున్న మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి ని కార్నర్ చేశారు. దీనితో పార్లమెంట్ ఎన్నికల అనంతరం వివేక్ బీజేపీ లో చేరారు. వివేక్ లాంటి నాయకుడికి ఎందుకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదో నేటికీ సస్పెన్స్ గానే ఉంది.

2018లో విజయం సాధించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్‌లో చేరిపోయారు. ఫలితంగా ప్రధాన విపక్ష హోదాను కాంగ్రెస్ కోల్పోయింది. ఎంఐఎం పెద్ద పార్టీ అయ్యింది. ఇలా కాంగ్రెస్‌ను జనంలో పలుచన చేసే పనిని సీఎం కేసీఆర్ వ్యూహత్మకంగా చేశారు. పబ్లిక్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచినా బీఆర్ఎస్‌లో చేరిపోతారు అనే అభిప్రాయం కలిగించారు. కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం దేశమంతా పడింది. బెంగాల్, మహారాష్ట్రలో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తెలంగాణలో టిపిసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ బలం పెరిగింది. నేతల్లో, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు దాటుతుంది అనే నమ్మకం పలు సర్వేల ద్వారా పెరిగింది. దీనితో బీజేపీని వదిలేసి కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడం బిఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ నుంచి మొదలు అయ్యింది. మంత్రులు కూడా కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నారు.

విశ్వనీయతను దెబ్బతీసే మాటలు..

ఇదే నేపథ్యంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, అటు అంతకు ముందు ఎమ్మెల్సి రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు మొత్తం కాంగ్రెస్‌ను గురి పెట్టేశాయి. ఈ వ్యాఖ్యలను ఏదో ఆషామాషీగా భావించడానికి లేదు. బీఆరెస్ పక్కా స్ట్రాటెజీగా భావించవచ్చు. సుమన్, రాజేశ్వర్ రెడ్డిలు ఇద్దరు సీఎం కోటరీ లోని కీలకమైన నేతలు, కేటీఆర్‌కు సైతం దగ్గరి వారు, కాబట్టి ఇదంతా ప్లాన్‌గా చేసిన వ్యాఖ్యలు గానే భావించాలి. ఇతరులను కించపరచడం, తక్కువ అంచనా వేయడం, జనం ముందు సదరు పార్టీపై ఉన్న విశ్వసనీయతను దెబ్బ తీయడం రాజకీయాల్లో కొత్త విషయం ఏమీ కాదు. బీజేపీ గ్రాఫ్ రాష్ట్రంలో తగ్గింది. కాబట్టి బిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అనేది ఉంటే గింటే కాంగ్రెస్ ఒక్కటే కాబట్టి పై వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలు చేశారు. ఒక పార్టీ నుంచి గెలిచి, మరో పార్టీలో ఎమ్మెల్యే లు చేరడం అనేది, ప్రజల మనోభావాల కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడమే అవుతుంది. అనైతిక చర్య అవుతుంది.

అమ్ముడుపోయే నేతలకు వార్నింగ్..

2018 లో కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్‌లో చేరిన వారికి ఏం ప్యాకేజీలు లభించాయో తెలియదు కానీ, వారు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు అనక తప్పదు. తాము నిలుచున్న చెట్టును తామే నరుకున్నారు. ఇప్పుడు అదే విషయం ప్రస్థావిస్తూ ఒక రకంగా చెప్పాలంటే అలాంటి జంపు జిలానీల పరువును బాల్క సుమన్, రాజేశ్వర్ రెడ్డిలు బజార్‌లో పెట్టారు. అయితే ఈ వ్యూహం అవుట్ డేటెడ్ అయిపోయింది. డబ్బు, అధికారం ఈసారి తెలంగాణ ఆత్మ గౌరవం ముందు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు.

నోటి దూల ఇటీవల కొందరికి ఎక్కువైపోయి, తాము ఎంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారో, వారికి అర్థం కావడం లేదు. పదవులు, అధికారం, శాశ్వతం కాదు, ఎవరూ నేటి రాజకీయాల్లో పురుషోత్తములు లేరు, ఉన్న దాంట్లో ఉత్తములు ఎవరు హూ ఈస్ బెటర్ అని జనం చూస్తున్నారు. అమ్ముడు పోయే, కోవర్ట్ రాజకీయాలు చేసే వారిని, నీతి, మానవత్వం లేని అవినీతి నేతలకు, నియంత నేతలకు ఈ సారి బుద్ది చెప్పే పరిస్థితి వంద శాతం కనిపిస్తున్నది. ఇదే నేల మీది నిజం! అహం బ్రహ్మాస్మి! ఎదుటి వారిని కించపరిచే వారిని, కించపర్చబడే వారు ఏదైనా బలహీనతల వల్ల ఏమి అనక పోయినప్పటికి, ఆ అమర్యాద మనుషులను సమాజం ఛీత్కరిస్తోంది.

ఎండి. మునీర్,

సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు,

99518 65223



 



Similar News