బ్రిటిషర్లకు సింహస్వప్నమైన టిప్పు..

Update: 2023-05-04 00:00 GMT

భారత దేశ స్వాతంత్ర్య చరిత్ర ఎందరో అమరుల త్యాగాలతో నిండి ఉంది. దేశ రక్షణకోసం అసంఖ్యాకమంది వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగంచేశారు. అందులో టిపూ (టిప్పూ) సుల్తాన్ అమరత్వం అపూర్వం, అనుపమానం. 1750 నవంబర్ పదవ తేదీన కర్నాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా, దేవనహళ్లిలో ఫాతిమా ఫఖ్రున్నీసా, హైదర్ అలీలకు టిపూ జన్మించాడు. టిపూను అన్నిరంగాల్లో నిష్ణాతుణ్ణి చేయాలని కలలుగన్న తండ్రి హైదరలీ చిన్నతనం నుంచే మంచి విద్యాబుద్దులు చెప్పించాడు. తన స్వీయ పర్యవేక్షణలో యుద్ధ కళల్లోని మెళకువలు నేర్పించాడు. తండ్రి కనుసన్నలలో యుద్ధ కళలో అసాధారణ ప్రావీణ్యతను సాధించిన టిపూ, నాటి ప్రముఖ యోధులందరిలో అగ్రగామిగా గుర్తింపు పొంది, పిన్న వయసులోనే ప్రతిభను చాటాడు.

బ్రిటిష్ అధికారులే ప్రశంసించారు..

ఆంగ్ల మూకల కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించడానికి ఆయన సాగించిన పోరాటం అజరామరం. పిన్న వయసులోనే టిపూ చూపిన తెగువ, ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఊహకందనివి. మంచీ చెడుల విశ్లేషణ టిపూకు చిన్నతనం నుండే అలవడింది. సునిశిత పరిశీలనద్వారా సాధించిన అపూర్వ మేధా పరిజ్ఞానం సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక , రాజకీయ పరిణామాలపట్ల ఆయనకున్న సాధికారత ఫ్రెంచ్ , ఆంగ్లేయాధికారుల్ని సైతం ఆశ్చర్య చకితుల్ని చేసింది. జాతీయ , అంతర్జాతీయ విషయాలపై టిపూ వ్యక్త పరిచిన అభిప్రాయాలను, దౌత్య వ్యూహాలను ఆయన శత్రువు డోవ్ టన్ (DOVETON) లాంటి బ్రిటిష్ అధికారి సైతం ప్రశంసించకుండా ఉండలేక పోయాడు. పదిహేనేళ్ళ పిన్నప్రాయంలోనే టిపూ రాజ్యపాలనా వ్యవహారాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ యుద్ధాల్లో పాల్గొన్నాడు.

యుద్ధం, ప్రజాసంక్షేమమే జీవితం..

మొదట బ్రిటిషర్ల కూటమినుండి నిజాంను దూరంచేయడానికి సాగిన ప్రయత్నాల్లో భాగంగా ఎంతో పరిణితితో, నేర్పుతో, దౌత్య కార్యాన్ని నడిపినప్పుడు ఆయన వయసు కేవలం పదిహేడేళ్ళు. టిపూ ప్రదర్శించిన రాజనీతికి ముగ్దుడైన నిజాం టిపూను ఫతే అలీఖాన్ అన్న బిరుదుతో సత్కరించాడు. టిపూ తండ్రి హైదర్ 1782 లో శత్రువుతో వీరోచితంగా పోరాడుతూ నవంబర్ 6 న రణరంగంలోనే తుది శ్వాస వదిలాడు. తండ్రికన్ను మూసిన వార్త తెలియగానే టిపూ హుటాహుటిన శ్రీరంగపట్నం చేరుకున్నాడు. అప్పటికి ఆయన వయసు 31 సంవత్సరాలు. చిన్న వయసులోనే వీరాధి వీరుడిగా, ప్రజాసంక్షేమమే ఊపిరిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన టిపూ సుల్తాన్ మైసూరుకు రాజయ్యాడు.

ప్రజా సంక్షేమంలోనే రాజ్యసంక్షేమం, రాజుసంక్షేమం దాగుందని బలంగా నమ్మే టిపూ రాజ్యాభిషేకం రోజునే, 'ప్రజల్ని విస్మరించి , ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే నేను నా జీవితాన్ని, నా సంతానాన్ని, చివరికి నా స్వర్గాన్ని కూడా కోల్పోవచ్చు. ప్రజలసంక్షేమం, వారి సంతోషంలోనే నా సంతోషం. సంక్షేమం ఇమిడిఉంది. నాకిష్టమైనదాన్ని కాకుండా. నాప్రజలకు ప్రయోజనకరమైనదాన్నే నేను నాఇష్టంగా, అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే రాజ్యాధికారం ప్రజలకు సేవ చేయడానికేగాని , స్వీయలాభం పొందడానికి కాదు.' అని విస్పష్టంగా ప్రకటించాడు.

రైతు శిస్తు తగ్గింపు..

ప్రజల జీవితాలను సుఖమయం చేయడానికి టిపూ వినూత్న విధానాలను అవలంబించాడు. స్వదేశీ విజ్ఞానాన్ని విదేశీ పరిజ్ఞానంతో మేళవించి ప్రజోపయోగానికి వినియోగించిన ప్రప్రధమ స్వదేశీ పాలకుడిగా ఖ్యాతి గడించాడు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాన్నందించాడు. వివిధరకాల చేతివృత్తులను అభివృద్ధి పరిచాడు. సహకార వ్యవస్థను పటిష్ట పరిచాడు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించి, ఎగుమతులను చేపట్టాడు. వర్తక , వాణిజ్య రంగాల్లో ప్రభుత్వపాత్రను విస్తరించేందుకు టిపూ ఆనాడే ప్రభుత్వ వ్యాపార సంస్థను (state trading corporation) ను ఏర్పాటు చేశాడు. టిపూ సుల్తాన్ వ్యవసాయ రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాడు. నీటిపారుదల రంగంపై ప్రత్యేకశ్రద్ధ కనబరిచాడు. పంట సిరులు అందించే రైతన్నకు టిపు సుల్తాన్ భూమిపై హక్కును కల్పించాడు. జాగీర్దారీ వ్యవస్థకు చరమగీతం పాడాడు. బీడుభూములను మాగా ణులుగా మార్చే రైతన్నలు మూడేళ్ళ వరకూ ఎలాంటి పన్నూ కట్టనవసరం లేదని ప్రకటించాడు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని అవసరాలకు ప్రభుత్వం తరఫున రుణ సౌకర్యం కల్పించాడు.

13 మంది మంత్రుల్లో 7గురు హిందువులే..

టిపూ జనరంజక పాలనలో ప్రజలు సుఖ శాంతులతో జీవించారని, భారత దేశంలోని ఇతర అన్ని ప్రాంతాలకంటే టిపూ రాజ్యంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారని, పంటలు పుష్కలంగా పండేవని ప్రఖ్యాత చరిత్రకారుడు జేమ్స్ మిల్ తన HISTORY OF BRITISH INDIA గ్రంధంలో పేర్కొన్నాడు. టిపూ అన్ని మతాలను సమానంగా, గౌరవభావంతో చూసేవాడు. ఈస్టిండియా పాలకులతో పోరాడుతున్నా క్రైస్తవ మతాచార్యులను అమితంగా గౌరవించేవాడు. మసీదు - మందిరాలమధ్య ఎలాంటి తారతమ్యం చూపలేదు. మైసూరు రాజ్యంలోని అనేక ఆలయాలకు ప్రతి ఏడాది గ్రాంటులను, ప్రత్యేక నిధులను మంజూరు చేశాడు. ఈమేరకు టిప్పుసుల్తాన్ 156 ఫర్మానాలను జారీచేశాడు. సైన్యం విషయంలో కూడా టిప్పు ఆదర్శాన్ని నెలకొల్పాడు. ఆయన సైన్యంలోని 19 మంది సేనాపతుల్లో 10 మంది ,13 మంది మంత్రులలో ఏడుగురు హిందువులేనని ప్రఖ్యాత చరిత్రకారుడు బి. ఎన్ . పాండే తనగ్రంధంలో పేర్కొన్నారు. పరమత సహనానికి మారుపేరుగా నిలిచిన టిప్పు సుల్తాన్ అసమాన ధైర్య సాహసాలతో తండ్రికి తగ్గ తనయుడిగా, పిన్నవయసులోనే అనేక విజయాలు సాధించాడు.

ఈ రోజు నుండి భారతదేశం మాది..

మలబారు ప్రాంతంలో ప్రారంభమైన ఆ యుద్దవీరుని జీవితం అటు ఈస్టిండియా కంపెనీతో, ఇటు స్వదేశీ పాలకులైన నిజాం, మరాఠాలతో పోరులోనే గడిచింది. చివరిశ్వాస వరకూ బ్రిటిష్ ముష్కర మూకలను భారతదేశం నుండి తరిమికొట్టడానికి అవిశ్రాంతంగా పోరాడిన ఏకైక స్వదేశీ పాలకుడిగా ఖ్యాతి గడించిన టిప్పు చివరికి ,1799 మే నాల్గవ తేదీన రణ భూమిలోనే తుది శ్వాస వదిలాడు. బ్రిటిష్ అధికారి జనరల్ హ్యారీ టిపూసుల్తాన్ శవాన్ని స్వయంగా పరిశీలించి, మరణించాడని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే 'ఈరోజునుండి భారతదేశం మాది' అని ప్రకటించే సాహసం చేయగలిగాడంటే, ఈ మైసూరు పులి ఆంగ్లేయులకు ఎంత సింహ స్వప్నంగా మారాడో అర్ధం చేసుకోవచ్చు. మానవజాతి ఉన్నంత వరకూ టిప్పు అమరత్వం అజరామరంగా నిలిచి ఉంటుంది.

(నేడు టిపూ సుల్తాన్ వర్ధంతి)

- యండి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్టు

99125 80645




Tags:    

Similar News