అణగారిన సామాజికవర్గం నుంచి ఉన్నత రాజకీయ పదవులు అధిరోహించినా... ఆ వర్గాల హక్కుల నాయకునిగానే చరిత్రలో బాబు జగ్జీవన్ రామ్ మిగిలారు. కానీ దళిత జాతి విముక్తి కోసం స్వశక్తితో అంబేద్కర్ లాగా పోరాటం చేయలేకపోయారు. మరోవైపు అగ్రకుల మనువాదుల ముసుగులో అంబేద్కర్ పోరాటానికి ఆటంకం కలిగించడం చరిత్ర మరిచిపోదు. చివరకు ఆయనే తమ తప్పును తెలుసుకొని ఒకానొక సందర్భంలో పశ్చాత్తాప పడ్డారు. నిజంగా జగ్జీవన్ రామ్ అనాడు అంబేద్కర్ ఉద్యమానికి తోడైతే దళిత బ్రతుకులు మరోలా ఉండేవి.
భారతదేశ స్వరాజ్య ఉద్యమంతో పాటు, ఈ దేశ పునర్నిర్మాణంతో ముడిపడినది జగ్జీవన్ రామ్ జీవితం. 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లాలోని చంద్వా గ్రామంలో జన్మించారు. అంటరాని, అస్పృశ్యత కులంలో పుట్టి పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు మెరుగైన విద్యార్థిగా, మేధావిగా రాణించారు. జగ్జీవన్ రామ్ 1922లో పాఠశాలలో చదువుతున్నప్పుడు కుండలో నీటిని తాగడానికి ఆధిపత్య కులాల విద్యార్థులు నిరాకరించడంతో మొదటిసారి అంటరానితనం, అణచివేతకు గురైనారు. దళితులకు పాఠశాలల్లో ప్రత్యేక నీటి కుండను ఏర్పాటు చేయడంతో సహించలేక ప్రతి కుండను పగలగొట్టి నిరసన వ్యక్తం చేశారు. కుల వివక్షతపై ఆగ్రహంతో జగ్జీవన్ రామ్ స్కూల్లో అందరి కన్నా గొప్ప ప్రతిభను కనబరిచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బిఎస్సి పట్టభద్రుడయ్యారు. కలకత్తా వచ్చిన ఆరు నెల్లోనే విల్లింగ్టన్ స్క్వేర్‌లో ముప్పై వేల మంది కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ విజయంతో సుభాష్‌చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి జాతీయ నాయకుల దృష్టికి ఆకర్షించారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో, పెట్టుబడిదారీ గ్రంథాలతోపాటు ఇతర సోషలిస్టు సాహిత్యం అధ్యయనం చేశారు. బ్రిటిష్ వలసవాద సంకెళ్ళుతెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం నిర్మించాలని విద్యార్థి దశలోనే సంకల్పించుకున్నారు. 1934లో జగ్జీవన్‌రామ్ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్ మహాసభను స్థాపించారు. దళితుల సాంస్కృతిక కులగురువుఅయిన గురు రవిదాస్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పలు జిల్లాల్లో రవిదాస్ సమ్మేళనాలను నిర్వహించారు. సాంఘిక సంస్కరణ కోసం ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ సంఘాన్ని స్థాపించారు. ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ, మరోవైపు సాంఘిక సంస్కరణ కోసం రాజకీయ ప్రాతినిధ్యం వహించిన గొప్ప మేధావి. డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికోసం తీవ్రంగా కృషి చేశారు.
28 ఏళ్ళ వయస్సులోనే మొట్టమొదట 1936లో బీహార్ శాసనసభకు ఎమ్మెల్యేగా గెలవడంతోనే జగజ్జీవన్ రామ్ తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అంతేకాకుండా 1937లో బీహారు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ నుంచి 14 రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను పోటీకి దింపి గెలిపించారు. దీంతో ఒక రాజకీయ నిర్ణయాత్మకశక్తిగా ఎదిగాడు. అప్పుడు తమతో చేతులు కలపమని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. 1942లో జగ్జీవన్ రామ్ బొంబాయిలో అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడనే అగ్రకుల పార్టీల కుట్రలను తెలుసుకోకుండా తమ శ్రమనంత ధారపోశారు. దీంతో తన పోరాటం కూడా పక్కదారి పట్టింది. అంబేడ్కర్‌కు బాబు జగ్జీవన్ రామ్‌కు మధ్య వైవిధ్యం ఇక్కడనే కనబడుతుంది. అంబేద్కర్ దేశ స్వాతంత్ర్యం కన్నా నా జాతి విముక్తే ముఖ్యమంటే, జగ్జీజీవన్ రామ్ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని తన జాతి విముక్తిని మరిచారు.
బాబూ జగ్జీవన్‌రామ్ 1946 మధ్యంతర ప్రభుత్వంలో కార్మికశాఖమంత్రిగా, కేంద్ర కేబినెట్‌మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రి వంటి గొప్ప పదవులు అనుభవించారు. దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని పేరు తెచ్చుకున్నారు. కానీ దళిత జాతి అభ్యున్నతిలో తన ముద్ర వేయలేకపోయారు. వాస్తవంగా ఆయన ఈ దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తి. కులం అనే నీడతో ఉప ప్రధాని పదవికే పరిమితమయ్యారు. అయినా కేంద్ర వ్యవసాయ ఆహార శాఖ మంత్రిగా దేశంలోని ఆహార సమస్యల పరిష్కారానికై హరిత విప్లవానికి నాంది పలికారు. 1969లో అధికార కాంగ్రెస్ పార్టీకి జగ్జీవన్‌రామ్ అధ్యక్షుడయ్యారు. 1977లో ఇందిరాగాంధీ నియంతృత్వ విధానంతో విభేదించి, ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్’ (కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ) అనే పార్టీని స్థాపించారు. తదుపరి దానిని జనతా పార్టీలో కలపాడు. మొరార్జీదేశాయ్ ప్రధానిగా జనతాపార్టీ ప్రభుత్వంలో జగ్జీవన్‌రామ్ కేంద్ర రక్షణశాఖామంత్రిగా విధులు నిర్వర్తించాడు. అప్పుటి బంగ్లాదేశ్ యుద్ధంలో గెలుపొందే విధంగా కృషి చేశారు.
బాబు జగ్జీవన్ రామ్ ఆధిపత్యకుల పార్టీలో గొప్ప పదవులు అనుభవించాడే తప్ప, దళిత విముక్తికి ఆశించిన స్థాయిలో కృషి చేయలేదనేది దళిత నాయకుల భావన. నేటికీ కూడా ఇదే జరుగుతుంది. అగ్రకుల పార్టీలు ఓట్ల కోసం దళితులను చీల్చి మోసం చేస్తున్నారు. దళిత నేతలు సైతం వారి వలలో చిక్కుకొని తమ జాతి విముక్తికి చమర గీతం పాడుతున్నారు. అంబేద్కర్ కోరుకున్నది ఇదేనా? ఒకసారి ఆలోచించండి. పదవులు ముఖ్యం కాదు, భారత రాజ్యాంగం ప్రకారం మనకు రావాల్సిన వాటా రావాలి. స్వాతంత్యం సిద్ధించి 76 వసంతాలైయినప్పటికీ దళితుల బతుకుల్లో ఇప్పటికి మార్పు రాలేదు. ఇప్పటికైనా దళిత నేతలు మనువాద అగ్రకుల పార్టీల నుంచి బయటకు వచ్చి స్వశక్తితో రాజ్యాధికారం వైపు ప్రయాణించాలి. అప్పుడే బాబు జగ్జీవన్ రామ్ లాగా తప్పు చేయకుండా, పూలే, అంబేద్కర్, కాన్షిరాం స్ఫూర్తిని కొనసాగించిన వాళ్ళం అవుతాం. లేదంటే చరిత్రలో మరో తప్పు చేసిన వాళ్ళం అవుతాం. 1986 జూలై 6వతేదీన బాబూజీ భౌతికంగా మనల్ని వీడారు, యావత్తు భారతజాతి ఘనంగా నివాళుర్పించింది.
(నేడు బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి)
సంపతి రమేష్ మహారాజ్
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
79895 79428