సమర్ధతకే పట్టం!
Tirupati MLA Bhumana Karunakar Reddy to be the new Chairman of TTD
తిరుమలలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరునిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల విశ్వాసం కొలమానం లేనిది. ఎటువంటి ప్రత్యేకతలు లేని సాధారణ దినాలలో కూడా ఆపద మొక్కులవాడిని డెబ్బై వేల నుంచి లక్షకు పైగా భక్తులు ప్రతి రోజు దర్శనం చేసుకుని తమ బాధలు, కోరికలు చెప్పుకుని శేషాద్రుని సన్నిధిలో సేద తీరుతుంటారు. గోవిందునిపై ప్రపంచంలోని హిందువులకు ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని ఈ పరిణామం తేటతెల్లం చేస్తుంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతీకగా తిరుమలలో ఆలయ నిర్వాహకులు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ పవిత్రత, భక్తుల భద్రత కాపాడుతూ హైందవ ధర్మ వ్యాప్తికి, ప్రజా ఉపయోగ కార్యక్రమాల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని 1932 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నెలకొల్పింది. శ్రీహరి నివాసం ఎంత పవిత్రమైనదో దాని కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటైన టీటీడీ ట్రస్ట్ బోర్డు కూడా అంతే పవిత్రమైనది, ప్రసిద్ధి చెందింది.
ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి..
ఈ నెల 8 వ తేదీకి ప్రస్తుత టీటీడీ పాలకమండలి కాలపరిమితి ముగియనుంది. దీంతో టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి కేటాయింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కత్తిమీద సాముగా మారింది. ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి తనకు ఎదురైన ఒత్తిడిని తట్టుకుని అన్నిరకాలుగా కసరత్తు చేసి గతంలో టీటీడీ కార్యక్రమాల నిర్వహణలో సమర్ధవంతమైన నేతగా పేరు ప్రఖ్యాతులు గడించిన తిరుపతి ప్రస్తుత శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించారు. 2006 నుంచి 2008 సంవత్సరం మధ్యలో అప్పటి ముఖ్యమంత్రి వై. యస్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి మొదటి పర్యాయం టీటీడీ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి అమలు చేసిన దళిత గోవిందం లాంటి అనేక కార్యక్రమాలు టీటీడీ చరిత్రలో మైలురాయిగా నిలిచాయని చెప్పవచ్చు. దళిత వాడలలో దళిత గోవిందం కార్యక్రమాల నిర్వహణ సమయంలో అప్పట్లో తనకు ఎదురైన అవాంతరాలను భూమన కరుణాకర్ రెడ్డి ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ పరిణామం భూమన కరుణాకర్ రెడ్డిని దళిత పక్షపాతిగా ముద్ర వేసింది. సమర్ధవంతమైన నేత అనే ముద్రతో పాటూ దళిత పక్షపాతిగా ముద్ర పడ్డ భూమన కరుణాకర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ బోర్డు చైర్మన్‌గా మరోసారి నియమించడం గొప్పపరిణామం. సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో పాటూ కరుణాకర్ రెడ్డికి పుస్తక పఠనంపై ఆసక్తి ఎక్కువ. అందువలనే హిందూ ధర్మంపై కరుణాకర్ రెడ్డికి పూర్తి విషయ పరిజ్ఞానం ఉన్నట్లు అర్థమవుతుంది. హైందవ ధర్మంపై ఆయనకు ఉన్న పరిజ్ఞానం మొదటి పర్యాయం టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా కరుణాకర్ రెడ్డి బాధ్యతలు నిర్వహించిన సమయంలోనే సమాజానికి తేటతెల్లం అయ్యింది. చిత్తశుద్ది, దృఢ సంకల్పం, నాయకత్వ పటిమ, విషయ పరిజ్ఞానం అధికంగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి రెండవ పర్యాయం టీటీడీ ఛైర్మన్‌గా నియమితులవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా వేంకటేశ్వరుని శోభ మరింతగా ప్రజ్వరిల్లుతుందని ఆశిద్దాం.
కైలసాని శివప్రసాద్
సీనియర్ జర్నలిస్ట్
94402 03999