ఈ ఎన్నిక అగ్ని పరీక్ష

This parliamentary election is a litmus test for political parties

Update: 2023-12-29 01:00 GMT

ఢిల్లీ నెంబర్ గేమ్‌ రాజకీయంలో నెంబర్ కీలకం కావడంతో తెలంగాణలో గెలిచే పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్‌కి కీలకం కానున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ తన ప్రభను నిలబెట్టుకోవాలని చూస్తుంది. ఇక బీజేపీకి ఈ ఎన్నికలు పెను సవాలే! ఉత్తర భారతదేశం అంతా భారతీయ జనతా పార్టీ పట్టు సాధించడంతో కాంగ్రె‌స్ ఆశలన్నీ దక్షిణాది రాష్టాలపైననే ఉంది. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణాది రాష్ట్రాలపై పట్టుకోసం బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఐనా పూర్తిస్థాయి పట్టు సాధించలేకపోయింది. అధికారం ఉన్న కర్ణాటకలో ఓటమి చెందడంతో పట్టు కోల్పోయి చతికిలపడింది. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కేరళ, తమిళనాడులో తన మిత్రపక్షాలు అధికారంలో ఉండటం కాంగ్రెస్ కు ఊరట. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఢిల్లీలో అధికారంలో ఉండే పార్టీలతో మిత్ర వైఖరిలో ఉండటం తప్ప ప్రత్యేక లైన్ తీసుకొనే పరిస్థితిలో లేవు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో గెలిచే పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్‌కు కీలకం కానున్నాయి. రేవంత్ రెడ్డి సామర్ధ్యానికి పార్లమెంట్ ఎన్నికలు ఛాలెంజ్ లాంటివి.

అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్‌కి, కాంగ్రెస్‌కి ఓట్ల వ్యత్యాసం తక్కువే! పైగా బీజేపీ, బీఆర్ఎస్‌కి పడ్డ ఓట్లను ఉమ్మడిగా లెక్కిస్తే.. కాంగ్రెస్ కంటే ఎక్కువే! అందుకే రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీలు జత కట్టాలన్న యోచన చేయవచ్చు. ఇదే జరిగితే కాషాయం, గులాబీ కూటమికే పాజిటివ్ ఓటు పెరిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి దోషిగా తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. కేసీఆర్ అవినీతి పాలన, చేసిన అప్పుల వ్యవహారాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చే ప్రయత్నాలు సిద్ధం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ నుండి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే బీజేపీ సైతం మోడీని రంగంలో దింపేందుకు, మరోవైపు సోనియా గాంధీ మెదక్ పార్లమెంట్‌కు పోటీ చేయించి తెలంగాణ సమాజంలో సోనియాకు ఉన్న ఇమేజ్‌ను పూర్తి స్థాయిలో వాడుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తుంది. ఏది ఏమైనా రానున్న పార్లమెంట్ ఎన్నికలు రెండు జాతీయ పార్టీలకు ఇటీవలే జాతీయ పార్టీగా గుర్తింపు కోల్పోయిన బీఆర్ఎస్‌కు అగ్ని పరీక్షయే.

-దొమ్మాట వెంకటేష్

రాజకీయ విశ్లేషకులు.

98480 57274

Tags:    

Similar News