ఇదే పండుగల పరమార్థం

This is the essence of festivals

Update: 2024-01-13 23:45 GMT

మన పండుగలు ఒకవైపు ఆధ్యాత్మికతకు దోహదపడుతుండగా.. మరోవైపు ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. ప్రకృతిని ప్రేమించిన పూర్వీకులు ప్రకృతి ఆధారంగా లభించిన సహజమైన ఆహార ఉత్పత్తులను భగవంతుడికి నైవేద్యం పేరిట అందించడంతో పాటు వాటిని ఆహారంగా స్వీకరించేలా కృషి చేశారు. దీంతో ఓవైపు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ మరోవైపు ఆస్పత్రుల అవసరమే లేని సహజమైన ప్రకృతి ఆహారాన్ని భావితరాలకు పరిచయం చేశారు.

సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంబరాలకు కొదవుండదు. మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండగ రోజు ప్రకృతి ఆహారాన్ని స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. తొలి రోజు భోగి పండుగ జరుపుకునే హిందువులు సజ్జలు నల్ల నువ్వులతో ప్రత్యేకంగా రొట్టెలు చేసుకుని తింటారు. అనేక పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను పరిచయం చేయడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడడం దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం. కానీ ప్రస్తుతం సమాజం సంస్కృతి సాంప్రదాయాలను, పండగల విశిష్టతను మరిచిపోయి రసాయనిక ఎరువులతో పండించిన పంటలను ఆహారంగా స్వీకరిస్తున్న కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో భయంకరమైన రోగాల బారిన పడి ప్రజలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతున్నారు.

సంక్రాంతి తొలిరోజు జరుపుకునే భోగి పండుగ సందర్భంగా చేసుకునే సజ్జలు, నల్ల నువ్వుల ఆరోగ్య ప్రయోజనాన్ని ఎంతో కాపాడుతాయి. పండించిన పంటలు ఇంటికి చేరి ధాన్యరాసులతో కళకళలాడే సందర్భంలో సంక్రాంతి వస్తుంది.ఈ పండగ సందర్భంగా ప్రకృతి సేద్యంచేస్తూ సంప్రదాయ ఆహార పంటలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించాలి. రైతులు సైతం రసాయనిక పంటలకు స్వస్తి పలికి ప్రకృతి ఆహారాన్ని నేటి తరానికి అందించేందుకు ముందుకు రావాలి.

గుముడాల చక్రవర్తి గౌడ్

9441059424

Tags:    

Similar News