ప్రభుత్వ విధానాల మార్పులు రైతుల ఆత్మహత్యలను పెంచుతున్నాయి. ప్రభుత్వ రుణ సదుపాయం తగ్గిపోవడం, సహకార వ్యవస్థ పూర్తిగా మూతపడడం, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు, విధానాలు, విద్యుత్ చట్టాలు రైతాంగాన్ని భూముల నుండి తరిమివేసేలా లేదా ఆత్మహత్యలను పెంచే విధంగా వున్నాయి. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు రైతులను ముంచేస్తున్నాయి.గత రెండు సంవత్సరాల్లో అధిక వర్షాల వల్ల రాష్ట్రంలో కనీసం 14 జిల్లాల్లో కోట్ల రూపాయల రైతుల పెట్టుబడులు మట్టిపాలు కావడం చూస్తూనే వున్నాం. 2016 నుండి 2021 సంవత్సరాల మధ్య 64,222 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతుల్లో ఎక్కువమంది పేద, దిగువ మధ్యతరగతి, వ్యవసాయ కూలీలు. వీరిలో సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన వారు అత్యధికం. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రచారాలు చేసుకుంటుండగా మరోవైపు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇది పాలకుల ప్రకటనలకు, ప్రజల అనుభవాలకు మధ్యనున్న అంతరానికి ఓ నిదర్శనం.
రైతులకు తగ్గిన ఆదాయం..
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ఆరేళ్లల్లో ప్రతి సంవత్సరం సగటున పది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారిక రికార్డులకు ఎక్కని రైతుల ఆత్మహత్యలు ఇంతకు రెట్టింపు వుంటాయి. వ్యవసాయాధారిత దేశంలో ఇంతమంది అర్థాంతరంగా ఊపిరి తీసుకుంటుంటే పాలకులు సిగ్గు పడాల్సిందిపోయి, నిబంధనల చాటున రైతుల ఆత్మహత్యలు రికార్డుల్లోకి ఎక్కకుండా అడ్డుకుంటున్నారు.
వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి తమ కుటుంబాన్ని పోషించుకోగలమనే ధైర్యం ఏ రైతు కుటుంబంలోనూ లేదు. అందుకే తమ పిల్లలకు వ్యవసాయం వద్దని గ్రామీణ పెద్దలు చెబుతుంటే, వ్యవసాయ కుటుంబాలతో సంబంధం కలుపుకోవడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు అయిష్టత చూపిస్తున్నారు. జాతీయ గణాంకాల శాఖ 2021 సెప్టెంబర్ 10న ప్రకటించిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం వ్యవసాయ సాగు ద్వారా రోజుకు రైతుకు వచ్చే సగటు ఆదాయం కేవలం రూ.27 కాగా, నెలకు రూ. 816.50 పైసలు. సగటున ఒక కుటుంబం పంటల సాగు ద్వారా రూ. 3,798 మాత్రమే పొందుతున్నది. 2013 సర్వే నుండి 2019 నాటికి రైతులు వ్యవసాయం మీద సగటున సంవత్సరానికి పొందుతున్న ఆదాయం రూ.6,442 నుండి రూ.10,218కి పెరిగినట్లు ఇది తమ ఘనత అయినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. వాస్తవంగా 2013లో ఒక రైతు కుటుంబం సాగు ద్వారా రూ. 3,081 సంపాదించగా 2012 ధరలతో పోలిస్తే ఈ ఆదాయం రూ. 2,770కి సమానం. 2019లో రైతు కుటుంబ సగటు ఆదాయం రూ.3,798 మాత్రమే. పంటల ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం 2013 నుండి 2019 నాటికి 5 శాతం పైగా తగ్గింది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, విద్య, వైద్యం, ఇతర ఖర్చుల ధరలతో పోలిస్తే వాస్తవ ఆదాయం మరింతగా తగ్గిపోవడమే కాక తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు
గత మూడు దశాబ్దాల్లో వ్యవసాయ పెట్టుబడులు ఎన్నడూ లేనంత భారీగా పెరిగిపోయాయి. విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు, యంత్రాల వినియోగం పెరిగిపోయింది. నగదు చేతిలో వుంటే తప్ప వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇది సహజంగానే చిన్న, సన్నకారు రైతులకు గుదిబండగా మారింది. వ్యవసాయ సాగు భూములకు నీటి పారుదల కల్పించాల్సిన ప్రభుత్వాలు క్రమంగా ఆ బాధ్యత నుండి తప్పుకున్నాయి. వర్షాధార సాగు రైతుల జీవితాలను కుంగదీసింది. దీనివల్ల బోర్లపై ఆధారపడటం ఎక్కువైంది. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద సాగు చేయడం పెరిగింది. ప్రభుత్వాలు ఇస్తామన్న డ్రిప్, స్పింక్లర్ల సహాయం బోర్ల వ్యవసాయాన్ని పెంచేసింది. అనేక కష్టాలు కోర్చి సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. 2010-11లో క్వింటాల్ పత్తి ధర రూ. 6,500 కాగా ప్రస్తుతం రూ. 3.500 నుండి రూ. 4 వేల లోపు వుంది. పసుపు, కందులు, మినుములు, జొన్న, మొక్కజొన్న ఇలా అన్ని రకాల పంటల ధరలు గత దశాబ్దంతో పోలిస్తే పెరుగుదల లేకపోగా తగ్గాయి. దిగుబడి సుంకాలను సరళీకరించడం ఇందుకు ప్రధాన కారణం. పెట్టుబడి ఖర్చులు మాత్రం మూడింతలు పెరిగాయి. ప్రభుత్వ విధానాల మార్పులు రైతుల ఆత్మహత్యలను పెంచుతున్నాయి.
ప్రభుత్వ రుణ సదుపాయం తగ్గిపోవడం, సహకార వ్యవస్థ పూర్తిగా మూతపడడం, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు, విధానాలు, విద్యుత్ చట్టాలు రైతాంగాన్ని భూముల నుండి తరిమివేసేలా లేదా ఆత్మహత్యలను పెంచే విధంగా వున్నాయి. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు రైతులను ముంచేస్తున్నాయి. వరి ధాన్యానికి 2006లో కేంద్రం క్వింటాల్‌కు రూ. 570 మద్దతు ధర ప్రకటించగా, కేరళ ప్రభుత్వం ప్రోత్సాహక బోనస్ పేరుతో ఆ సంవత్సరం రూ.707కు కొనుగోలు చేసి, 2011 నాటికి రూ.1140లకు పెంచింది. 2020-21లో కేంద్రం మద్దతు ధర రూ.1868 కాగా కేరళ లాంటి రాష్ట్రాలు దేశంలో ఎక్కడా లేనంతగా క్వింటాల్ రూ.2,800లకు కొనుగోలు చేశాయి. కేరళలో వ్యవసాయ కూలీలకు అమలవుతున్న 'కుడుంబశ్రీ' పథకం అద్భుతాలను సృష్టిస్తున్నది.
మన రాష్ట్రంలో అధికారంలో వున్న పార్టీ పేరులో రైతు వుంది గాని రైతులకు వ్యతిరేకమైన కేంద్ర ప్రభుత్వ విధానాలనన్నింటినీ అమలు చేస్తూ రైతు ఆత్మహత్యల్లో దేశంలో నాలుగో స్థానంలో వుంది. రైతు ఆత్మహత్య అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య కాదు, దేశానికి కీలకమైన వ్యవస్థ ఆత్మహత్యకు గురికావడమే అవుతుంది. అందుకే రైతు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలి..
మేకల రవి కుమార్
82474 79824