ఉత్తరాంధ్రకు క‘న్నీరు’ మిగిల్చిన ప్రభుత్వం

The YCP government left 'tears' for Uttarandhra

Update: 2024-03-02 01:00 GMT

ఏ ప్రాంతమైనా సస్యశ్యామలంగా ఉంటే అన్ని రంగాల్లో ముందంజలో కొనసాగుతూ అభివృద్ధిపథంలో పయనిస్తుంది. దీనికోసం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అధిక భూమిని సాగులోకి తేవాలి. కానీ ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉత్తరాంధ్ర ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజనానంతరం కూడా సాగునీటి ప్రాజెక్టులలో వివక్షకు గురయ్యింది.

ఉత్తరాంధ్రలో సాలీనా 1050 మి.మీపైనే వర్షపాతం నమోదవుతున్నా ఈ ప్రాంత ప్రజలు సాగునీరు, తాగునీరు సమస్యలతో సతమతమవుతూ బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం దురదృష్టకరం. అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకొని, భూమిని సాగుకు అనుకూలంగా మల్చుకోవడం కోసం ప్రాజెక్టును నిర్మించాలనే ప్రాథమిక సూత్రాన్ని ప్రభుత్వం విస్మరించడమే ఇందుకు ప్రధాన కారణం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే ఈ ప్రాంతానికి ప్రాణవాయువని తెలిసినా జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్య ధోరణితో అన్యాయం చేసింది.

సగం నీరు సముద్రం పాలు

ఉత్తరాంధ్రలో అత్యధిక మందికి ఆధారం వ్యవసాయమే. రాష్ట్రంలో చిన్న కమతాల భూములున్న చిన్న, సన్నకారు రైతులు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఐదెకరాల కంటే తక్కువ భూములున్న కుటుంబాలు శ్రీకాకుళంలో 77.53 శాతం, విజయనగరంలో 91.29 శాతం, విశాఖపట్నంలో 97.74 శాతం ఉన్నాయి. ఉత్తరాంధ్రలో 16 చిన్న, మధ్యతరహా నదులున్నాయి. వీటిలో ఏటా 207 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అందులో కేవలం 100 టీఎంసీలు మాత్రమే వినియోగంలో ఉండగా, మిగిలిన నీరు సముద్రం పాలవుతోంది.

వైఎస్సార్ కలనూ విస్మరించారు

ఉత్తరాంధ్రలో మొత్తం 23.24 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా, అందులో కేవలం మూడవ వంతైన 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, తాగునీరు కష్టాలను పరిష్కరించడానికి బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విశాఖపట్నంలో 3.21లక్షల ఎకరాలు, విజయనగరంలో 3.94 లక్షల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలు మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 12 వందల గ్రామాలకు తాగునీరు అందుబాటులో ఉంటుంది. 53.40 టీఎంసీలు వ్యవసాయం కోసం, 4.46 టీఎంసీలు తాగునీటి కోసం, 5.34 టీఎంసీల నీరు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించేలా ఈ ప్రాజెక్టు డిజైన్‌ రూపొందించారు. ఈ ప్రాజెక్టు దివంగత నేత డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కల. ఆయన వారసులమని చెప్పుకునే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టును పట్టించుకోకుండా పూర్తి నిర్లక్ష్యం చేస్తూ దివంగత నేత ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు.

వైఎస్ జగన్‌ హయాంలో ఉత్తరాంధ్రలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పాత ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదు. జగన్‌ సీఎం అయ్యాక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం పొందే ప్రాజెక్టుల జాబితాలో శ్రీకాకుళంలోని వంశధార, నాగావళి అనుసంధానం ప్రాజెక్టును చేర్చినా పనులు పూర్తి చేయలేదు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల కోసం వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కేటాయించిన నిధులు, పెట్టిన ఖర్చుల మధ్య వ్యత్యాసాలను పరిశీలిస్తే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణిని కనబర్చిందో తేటతెల్లమవుతోంది. బడ్జెట్లో భారీగా లెక్కలు చూపిస్తున్నా కేటాయింపులలో మాత్రం రిక్త హస్తం చూపిస్తోంది.

కేటాయింపు జాస్తి, ఖర్చు నాస్తి

ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం జగన్‌ ప్రభుత్వం 2019 నుండి ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం దాదాపు రూ.3 వేల కోట్లు కేటాయించగా వాటిలో కేవలం సుమారు రూ.5 వందల కోట్లకుపైగా ఖర్చు చేశారు. వంశధార రెండో దశ రెండో భాగం పనులకు రూ. 6 కోట్లు కేటాయించగా రూ.375 కోట్లు, తోటపల్లి బ్యారేజీ, గజపతి నగరం బ్రాంచి కాలువ నిర్మాణానికి రూ.7 వందల కోట్లు కేటాయించగా రూ.61 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.7 వందల కోట్లు కేటాయించగా రూ.5 కోట్లు, మద్దువలస ప్రాజెక్టుకు రూ.31 కోట్లు కేటాయించగా రూ.1 కోటి, మహేంద్రతనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్ల కోసం రూ. 4 వందల కోట్లు కేటాయించగా రూ.26 కోట్లు, జంఝావ‌తి రిజర్వాయర్‌ కోసం రూ.20 కోట్లు కేటాయించగా రూ. 2 కోట్లు, తారకరామ తీర్ద సాగరం ప్రాజెక్టుకు రూ.5 వందల కోట్లు కేటాయించగా రూ.76 కోట్లు, వంశధార-నాగావళి అనుసంధానం కోసం రూ.120 కోట్లు కేటాయించగా రూ.44.76 కోట్లను మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసింది.

ప్రజాతీర్పు తోనే మార్పు

ఉత్తరాంధ్రలోని 24 లక్షల ఎకరాలకు కనీసం ఒక పంటకైనా సాగునీరు సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉన్నా పెండింగ్ లోనే ఉంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదు. కనీసం ఒక పంటకు సాగునీరు, తాగడానికి గుక్కెడు నీళ్లు మాత్రమే అడుగుతున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుతో పాటు ఇతర పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తికావాలన్నా, నదుల అనుసంధానం జరగాలన్నా ఉత్తరాంధ్రలోని విద్యావంతులు, మేధావులు, ప్రజలు మరోసారి మోసపోకుండా తమ విలువైన తీర్పు ఇవ్వాలి. రాబోయే ఎన్నికల సందర్భంగా వచ్చే సువర్ణావకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు ఒక అస్త్రంగా ఉపయోగించుకోవాలి.

ప్రతి చేతికి పని-ప్రతి చేనుకు నీరు

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఇచ్చిన ‘ప్రతి చేతికి పని-ప్రతి చేనుకు నీరు’ అనే హామీ ఉత్తరాంధ్రులకు జీవనాడిగా మారనుంది. వెనుకబడిన ఈ ప్రాంతంలోని నీటి ప్రాజెక్టులు పూర్తయితే ఇక్కడి ‘ప్రతి చేనుకు నీరు’ అందుబాటులోకి వచ్చి ‘ప్రతి చేతికి పని’ లభిస్తుంది. దీంతో ఇక్కడ వ్యవసాయ రంగం పురోగతి సాధిస్తే జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలసలను అరికట్టవచ్చు.

- కొణతాల రామకృష్ణ,

అనకాపల్లి మాజీ ఎంపీ, మాజీ మంత్రి,

కన్వీనర్‌, ఉత్తరాంధ్ర చర్చావేదిక

konathalaramkrishna1957@gmail.com

Tags:    

Similar News