వారి సమస్యలు తీర్చాలి

The problems of KGBV teachers should be resolved

Update: 2024-01-09 00:45 GMT

తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యా విధానాన్ని సంపూర్ణంగా మార్చుతారని ఎంతో ఆశగా ప్రజలు చూశారు. కానీ, అది జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో విద్యా విధానంపై కన్నెత్తి చూడలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కేజీ టు పీజీ అని తమ మేనిఫెస్టోలో పెట్టి విద్యావిధానంపై సరైన మార్గంలో నడిపించకుండా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా ప్రజల చెవిలో పూలు పెడుతూ వచ్చారు. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి దాదాపు 4 వేల పాఠశాలలు ఉండేవి. 2014 నాటికి ఉపాధ్యాయుల కొరత కూడా పెద్దగా ఉండేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో దాదాపు 12 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించారు. కానీ 2014 తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. పాఠశాలలను మూసివేసిన ఘనత గత సర్కారుకు దక్కింది. 2014కు ముందు నాలుగింట మూడో వంతు విద్యార్థులు (75% శాతం) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను చదివేవారు. కానీ 2023 నాటికి 50 శాతం విద్యార్థులు మాత్రమే ప్రభుత్వం రంగ పాఠశాలల్లో పరిమితమయ్యారు. ఉపాధ్యాయుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.

పేద విద్యార్థినులకు ప్రత్యేక స్కూళ్లు

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల బాలికల కోసం ప్రాథమికోన్నత స్థాయిలో వసతి పాఠశాలకు ఆగస్టు 2004న భారత ప్రభుత్వంచే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కే.జీ.బీ.వీ.) పథకం ప్రారంభించబడింది. ఈ బ్లాకుల్లో నెలకొల్పిన పాఠశాలలు మహిళా అక్షరాస్యత తక్కువ గల గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు సంబంధించినవి. విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లలేని పేద విద్యార్థినులను బడి బాట పట్టించాలన్న లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఉద్యోగ భద్రత కరువై

తెలంగాణ రాష్ట్రంలో కేజీబీవీలు 475 స్కూల్స్ ఉన్నాయి. కొన్ని స్కూల్స్‌ని అప్డేట్ చేస్తూ 195 కాలేజీలుగా గుర్తించారు. ఈ కాలేజీల్లో ఎంతో మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పనిభారంతో సతమతమవుతున్నారు. వీరికి ఇచ్చే వేతనం కూడా తక్కువే. సిబ్బందికి కనీస వేతనాలు లేవు. ఉద్యోగ భద్రత లేదు. కేజీవీబీలు ప్రారంభమై దాదాపు పదేళ్ళవుతున్నా వీరి సర్వీస్ ఇప్పటికీ రెగ్యులర్ కాలేదు. కాంట్రాక్టు విధానం కిందే వీరు కొనసాగుతున్నారు. ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్టీ) స్పెషల్ ఆఫీసర్లకు. పీజిసిఆర్టి. ఏఎన్ఎం. పీఈటీ. క్రాఫ్ట్. కంప్యూటర్ ఆపరేటర్స్. అకౌంటెంటు, వంట మనిషి.. అసిస్టెంట్, వాచ్మెన్‌కు గానీ ఇతర లేబర్ సరైన జీతాలు లేకుండా తాత్సారం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం. సమాన పనికి సమాన వేతనం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ అమలు చేసి వారికి సరైన న్యాయం చేసి వారిని ఆదుకోవాలని కోరుకుందాం.

కొత్త ప్రభుత్వంపై ఆశలు

ఇక తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందోనని నిత్యం భయపడుతూ కేజీబీవీ టీచర్లు పనిచేయాల్సి వస్తోంది. పదో తరగతి, ఇంటర్ ఫలితాలను బట్టి వీరి కొనసాగింపు ఉంటుంది. ఫలితాలు బాగుంటే మరుసటి సంవత్సరానికి రెన్యువల్ ఉంటుంది. లేకుంటే ఉద్వాసనే. బోధనేతర సిబ్బంది వేతనాలు మరీ తక్కువ, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 475 కేజీబీవీలు , సుమారు 195 కాలేజీలు, 5,160 మంది టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ దాదాపు 2,150 మంది ఉన్నారు. ఈ విద్యాలయాల్లో పనిచేస్తున్న వంట వారికి నెలకు రూ.7,500 వాచ్మెన్, స్వీపర్లకు కూడా దాదాపు అంతే ఇస్తున్నారు. పీజీసీఆర్డీ, సీఈటీ, కంప్యూటర్ టీచర్లకు వేతనాలు తక్కువ, ఒకేషనల్ టీచర్లకైతే నెలకు రూ.6 వేలు చెల్లిస్తున్నారు. స్వీపర్లకు ఇచ్చే జీతం కన్నా తక్కువ. ప్రభుత్వ పాఠశాలల్లోని మహిళా ఉపాధ్యాయులకు వర్తించే ఏ సెలవులూ కేజీబీవీ మహిళా టీచర్లకు వర్తింప చేయడం లేదు. ఏ రోజు సెలవు వాడుకున్నా ఆ రోజు వేతనం ఉండదు. కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ మహిళలే. అయినా ఉపాధ్యాయులకు పిఎఫ్ గాని, ఈఎస్ఐ గాని వీరికి ప్రభుత్వ పరంగా వచ్చే వసతులు కూడా లేకపోవడం శోచనీయం. పాత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. కనీసం కొత్త ప్రభుత్వం పట్టించుకోవాలని ఆశిద్దాం.

మన్నారం నాగరాజు,

రాష్ట్ర అధ్యక్షుడు,

తెలంగాణ లోక్‌సత్తా పార్టీ,

95508 44433

Tags:    

Similar News