అధికారం అవమానించడానికి కాదు

రాజకీయం అనేది ఎప్పుడూ స్థిరంగా ఒక పార్టీనో, ఒక నాయకుని చేతిలో మాత్రమే ఉండదు అలా ఉంటుందనుకుని విర్రవీగడం మంచిది కాదు

Update: 2024-06-08 00:30 GMT

రాజకీయం అనేది ఎప్పుడూ స్థిరంగా ఒక పార్టీనో, ఒక నాయకుని చేతిలో మాత్రమే ఉండదు అలా ఉంటుందనుకుని విర్రవీగడం మంచిది కాదు. అలా చేస్తే ప్రజలు తమ చేతిలో ఉన్న ఆయుధంతో బుద్ధి చెప్తారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి అలాగే మారింది. ప్రజలు ఎంతో నమ్మి తమకు సేవ చేస్తారని అధికారం కట్టబెడితే... అధికారంలో ఉండి.. గెలిచామనే పోకడతో ప్రతిపక్ష నాయకులను అతిగా విమర్శిస్తూ అవహేళన చేస్తుంటారు. వ్యక్తిగత జీవితాలను తెరపైకి తెచ్చి ఆ వ్యక్తిని పలుచన చేయాలని చూస్తుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్ ఇటు తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎదురీత తప్పలేదు. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీలో సంపన్నులను పార్టీలో చేర్చుకొని పుష్కలమైన అవకాశాలు ఇవ్వడం, వారు ఆ అవకాశాలను తీసుకొని పార్టీలు ఫిరాయించారు. కింది స్థాయిలో సుదీర్ఘ కాలంగా ఉద్యమ పార్టీలో పని చేసిన వారిని గుర్తించకపోవడంతోనే బీఆర్ఎస్‌కు ఈ గడ్డు పరిస్థితి తీసుకువచ్చిందని చెప్పక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రం లో బీఆర్ఎస్ రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నా కనీసం ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగకుండా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మేల్యేలు చేశారు. ఒక దశలో పూర్తిగా ఉద్యమ పార్టీ సిద్ధాంతాలను మరిచి.. పవర్ బ్రోకర్లకు అవకాశం ఇవ్వడంతో ఉద్యమ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతుందనడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ పరిస్థితిని గమనించి బీజేపీ, నరేంద్ర మోడీ తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచారు. సాధారణ కార్యకర్తలను కలవడం లాంటి విషయాలు కలిసివచ్చాయి.

ఏపీలో కర్రు కాల్చి.....

ఆంద్రప్రదేశ్ లోనూ ఒకసారి ప్రతిపక్షంగా ఉన్న జగన్‌మోహన్ రెడ్డికి 2019లో మంచి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి కక్ష సాధింపులకు పాల్పడ్డారు. దళితులపై విపరీతమైన దాడులు పెరిగిపోయాయి. వీటిపైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపున టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ను అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ నాయకులు పూర్తిగా అవహేళనలు చేశారు. అయినప్పటికీ ఆయన నిత్యం ప్రజలతో మమేకమవడం యువగళం లాంటి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. ఆ చరిష్మా కూడా ఎన్నికల్లో పని చేసింది. టీడీపీ కూటమిగా పోటీ చేసినప్పటికీ .. టీడీపీకే ఏకంగా 135 స్థానాలు సంపాదించగలిగింది.

ఇక భగత్ సింగ్, అంబేద్కర్ మహనీయుల స్ఫూర్తితో మార్పు కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కించుకో గలిగారు. అయినా ఎక్కడ నిరాశ చెందకుండా వారాహి యాత్రతో ప్రజలకు దగ్గరయ్యారు. అభిమానం వేరు రాజకీయం వేరు అని అనేకమంది మాట్లాడినప్పటికీ ఆయన ఎప్పుడూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ వచ్చారు. అనూహ్యమైన నిర్ణయంతో ఎన్డీఏ కూటమిలో చేరిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున 175 స్థానాల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు 2 లోక్‌సభ స్థానాలు గెలిచి విమర్శించిన నోర్లను మూయించారు.

చెత్తగా మాట్లాడితే తిప్పికొట్టారు

రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ఉండాలే తప్పా... వ్యక్తిగత విషయాలు ఉండొద్దు. కానీ జగన్ కేబినెట్‌లోని మహిళ మంత్రులు కూడా అసభ్య మాటలు మాట్లాడిన తీరు చూసిందే. అధికారం ఎవరికీ సొంతం కాదు. అది ఎప్పుడూ స్థానభ్రంశం చెందుతూ ఉంటుంది. రాజకీయ నాయకునిగా ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటున్నామనేది ముఖ్యం. అలా కాకుండా అధికారం ఉందని అహం పెరిగితే... ప్రజలు తమ చేతిలో ఉన్న ఓటు అస్త్రాన్ని గట్టిగా ఉపయోగిస్తారు. అధికారం వస్తే రెట్టింపు బాధ్యత పెరగాలి. ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు మాని... ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం అవుతూ ప్రజల సలహాలతో ప్రభుత్వం నడవాలి. అప్పుడే నాయకులుగా మరింత ఎక్కువ కాలం ప్రజల్లో ఉండగలుగుతారు. కక్ష సాధింపులకు దూరంగా ఉండి ఎన్నికల కోసం ఇచ్చిన హామీలతో పాటు సామాన్యుల బతుకుల్లో మరింత వెలుగుల కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కొత్తగా ఎన్నికైన వారు పని చేస్తారని విశ్వసిస్తున్నాం. ఎటువంటి గర్వం లేకుండా నిస్వార్థ సేవ చేసి అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు నిరంతరం సేవకులుగా మెదిలితే బాగుంటుంది.

సంపత్ గడ్డం

78933 03516

Tags:    

Similar News