ఇంతలోనే ఎంత మార్పు! ఒకరోజులో వచ్చింది కాదు!

Update: 2023-04-11 00:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో బయటకు కనిపించే రాజకీయ ముఖచిత్రం వేరు, లోలోపల రగులుతున్న జనం అంతర్మధనం వేరు! ఒకటికొకటి పొంతన లేకుండా బలపడుతూ వస్తున్నాయి. దేశంలో మరెక్కడా లేనంతగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ, పాలనపై తెలియని అసంతృప్తి ఏదో జనం గుండెల్లో గూడు కట్టుకొని ఉంది. ‘ఇదీ కారణం’ అని చెప్పేంత స్పష్టత కనబడకపోయినా.. అసంతృప్తి ‘ఉంది’ అనే వాస్తవాన్ని మొదట పార్టీ శ్రేయోభిలాషులు, తర్వాత కార్యకర్తలు, అటుపై నాయకులు, ఇప్పుడిప్పుడే అగ్రనాయకత్వం గుర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. అంగీకరిస్తే, ఉపశమన చర్యలు తీసుకుంటున్నారా అన్నది ఇంకా తెలియటం లేదు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇందుకు ఒక సంకేతమే అయినా లోతైన పరిశీలనలో తెలిసే విషయాలు నేర్చుకోదగ్గ పాఠాలుగా పాలకులకు పనికివస్తాయి. అన్నం ఉడికిందీ, లేనిది ఒకటి, రెండు మెతుకుల్ని పట్టి తెలుసుకోవచ్చు అన్నది జగమెరిగిన సత్యం!

కమలములు నీట బాసిన

కమలాత్ముని రశ్మిసోకి కమలిన భంగిన్‌

తమతమ నెలవులు దప్పిన

తమ మితృలె శత్రులగుట తథ్యము సుమతీ!

అంటాడు నాలుగయిదు వందల యేళ్ల కింద బద్దెనామాత్యుడు.

వెంటాడుతున్న తండ్రి నీడ..

దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు ప్రఖ్యాతులే... ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఒకసారి అనుకూలంగా, మరోమారు ప్రతికూలంగా పనిచేయనున్నాయా ఏపీలో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని లోతుగా పరిశీలించి, సమీక్షిస్తే సమాధానం అవుననే వస్తుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాక్షేత్రం....ఇలా అంతటా అంతర్లీనంగా సంఘర్షణ సాగుతోంది. ‘ఒక అవకాశం ఇమ్మని అడుగుతున్నాడు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి గొప్ప పాలనను అందించిన వైఎస్సార్‌ తనయుడిగా ఆ వారసత్వం కొనసాగిస్తాడేమో!’ అన్న పెద్దమనసు వల్లే జగన్మోహన్‌రెడ్డికి భారీ మద్దతు (151/175)తో 2019లో ప్రజలు పట్టం కట్టారు. నవరత్నాల్లో ప్రకటించినట్టే, సగటు ప్రజలు ఆశించినట్టే పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాల పరంపర ఆయన చేపట్టారు. ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఏపీలో మొదలయ్యాయి. ఆర్థిక ఇబ్బందులున్నా, కోవిడ్‌ కష్టకాలంలోనూ... మాట తప్పకుండా సంక్షేమ బాటనే సాగారు. ‘సంక్షేమం సరే, మరి అభివృద్ది మాటేమిటి’ అన్నది తరచూ చర్చకు వస్తోంది. ‘సంక్షేమం ద్వారా జనజీవితాల్ని మెరుగుపరచి, పరోక్షంగా సాధిస్తున్నది అభివృద్దే!’ అని పాలకపక్షం చెబుతున్నా, సమాధానం అందర్నీ మెప్పించేదిగా లేదు.


జరుగుతున్న పరిణామాలను సగటు పౌరులు, పార్టీ శ్రేణులు, ప్రతిపక్షాలు విభిన్నంగా చూస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన, విపరిణామాలు, భవిష్యత్‌ అవకాశాలు అన్న ప్రాతిపదికన 2014 ఎన్నికలు జరిగాయి. జగన్మోహన్‌రెడ్డి ప్రవర్తన, వ్యవహారశైలి కన్నా అప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాలనానుభవమే ప్రధానంగా కనిపించి, అనూహ్యంగా అటు మొగ్గారు జనం. కానీ, 2019 ఎన్నికలు వేరు! అయిదేళ్ల బాబు పాలన-వైఫల్యాలతో విసిగిన జనం ఒక కొత్త ఆశ, నమ్మకంతో జగన్మోహన్‌రెడ్డి వైపు తిరిగారు. జగన్‌ పాదయాత్ర ప్రజల్ని ప్రభావితం చేసింది. వైఎస్సార్‌ రాజ్యం తిరిగి వస్తుందని ఆశించారు. నాలుగేళ్లు పూర్తవుతున్న తరుణంలో... ప్రస్తుత పాలనను నాటి వైఎస్సార్‌ పాలనతో పోల్చి చూస్తున్నారు. అన్ని స్థాయిల్లో ఎవరికివారు నేటి నిర్ణయాలు, పరిణామాలు, పరిస్థితుల్ని వైఎస్సార్‌ కాలంతో బేరీజు వేస్తున్నారు. అసలు పోలికే లేదంటున్నారు. అసంతృప్తికి ఇదొక బలమైన కారణంగా కనిపిస్తోంది. ఈ భావన ముదిరితే, మేలు చేసిన వైఎస్‌ పేరే చివరకు ఇబ్బందులు తెచ్చే ఆస్కారముంది.

ఒకడుగు ముందంటున్నా..

ఏదో సహాయంతో ప్రతి ఇంటినీ తట్టేలా, సంతృప్తికర స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేశారనే కీర్తి వైఎస్సార్‌కు దక్కింది. సంక్షేమానికి తోడు జలయజ్ఞం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వంటి అభివృద్ది పనులు చేపట్టి రెంటినీ సమతుల్యం చేశారాయన.‘ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది, అభివృద్ది మందగించింది, కొత్త ప్రాజెక్టులు, కంపెనీలు, ఫ్యాక్టరీలు రావట్లే, కనీసం రోడ్డు రిపేర్లైనా లేవ’నే విమర్శ సర్వత్రా వినిపిస్తోంది. ‘పీపుల్స్‌పల్స్‌’ ప్రజాక్షేత్రంలో తిరిగినపుడు ఇచ్ఛాపురం నుంచి రాయదుర్గం వరకు దాదాపు ఒకే స్వరం వినిపిస్తోంది. సంక్షేమం కింద ఇస్తున్న నగదు సహాయాలు కూడా పలుచోట్ల విమర్శలకు నెలవౌతున్నాయి. అసాధారణంగా పెరిగిన నిత్యావసరాల ధరలు, నగదు పథకాలను కూడా చిన్నబుచ్చి మాట్లాడేలా చేస్తున్నాయి. ‘ఉచితాలు ఎవరిమ్మన్నారు ఎందుకిస్తున్నారు కూర్చోబెట్టి మనుషుల్ని సోమరుల్ని చేస్తారా ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కుంటారా’ వంటి మాటల ఈటెల్ని జనం సంధిస్తున్నారు. బస్‌ చార్జీలు, విద్యుత్‌ చార్జీల పెంపుపైనా ఆగ్రహమే! పథకాల్లో లబ్ది రానివాళ్లు సరేసరి! ఇక ఒక వృత్తిలో లబ్ది పొందుతున్న వాళ్లు కూడా ‘.. ఫలానా వాళ్లకు పదివేలు ఎందుకండి, 45 దాటిన మహిళకు 18 వేలు ఎందుకిస్తున్నారు’అని విమర్శించే సాంఫీుక స్పర్ధల్ని ఈ ‘నగదు మేళ్లు’ సృష్టించి, పెంచుతున్నాయి.


ఒకే ఇంట్లో ఎక్కువ పథకాల్లో లబ్ది పొందేవారిని చూసి తక్కువ ప్రయోజనాలున్న వారు, అలాంటివారిని చూసి అసలు రానివారు.. అసూయ పొందుతున్నట్టు వారి మాటలే చెబుతాయి. ఇంట్లో వాహనం ఉందనో, ఉద్యోగి ఉన్నారనో, భూమి ఉందనో, అధిక విద్యుత్తు వాడుతున్నారనో.. ఇలా రకరకాల కారణాలతో అప్పటివరకు వస్తున్న నగదు లబ్దికి కత్తెర వేయటాన్ని జనం భరించలేకపోతున్నారు. అసలే రాని వాళ్లకన్నా, కొన్నాళ్లు పొందాక... అవి తొలగిపోయిన వాళ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వృత్తి జరుగుబాటు కోసం 50 వేలు పెట్టి పాతకారు కొనుకున్న ఓ ఆసామి (పేరుపాలెంలో), ‘అదుగో, ఆ డొక్కు కారు కొన్నానని నాకు వచ్చే పథకాలన్నీ రద్దు చేశారు’అని సర్కారుపై రుసరుసలాడారు. ‘సంక్షేమ పథకాల్లో నాన్న ఒక అడుగువేస్తే, నేను రెండడుగులు వేశా’నని సీఎం చెబుతున్నా.. పొందుతున్న లబ్దికి కత్తెర వేస్తున్న తాజా వైనాన్ని జనం జీర్ణించుకోవటం లేదు. ఇక మద్యం విషయంలో జనం బాధ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది!

పలుచనౌతున్న బంధం..

అధినేతకు-నాయకులకు, వారికీ-సామాన్య ప్రజలకు మధ్య బంధం సన్నగిల్లటం రానురాను ప్రమాదకరంగా మారుతోందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో సీఎంకి తెలియకపోవడానికి ఇదొక కారణమంటున్నారు. ఓ సందర్భం కల్పించుకొని, ఏదో రూపంలో వైఎస్సార్‌ని కలిసే అవకాశం అప్పట్లో నాయకులకు లభించేది. ‘ఓ విషయం ఆయన చెవిలో వేస్తే.. ఇక అంతా ఆయన చూసుకుంటారు’ అన్న భరోసా వారికుండేది. ప్రతిరోజూ ఉదయం పెద్ద సంఖ్యలో జనాన్ని కలిసే వ్యవస్థనూ వైఎస్‌ కల్పించారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కారణమేదైనా.. వైఎస్సార్సీపీలోని అత్యధికులు లోగడ కాంగ్రెస్‌ వారే! కాంగ్రెస్‌ వంటి జాతీయపార్టీ వ్యవహారశైలితో పనిచేసిన వారు, ఏకస్వామ్యంలో నడిచే ఫక్తు ప్రాంతీయపార్టీలో ఇమడలేకపోవడం కూడా పార్టీ నాయక శ్రేణుల్లోని కొందరి అసంతృప్తికి కారణం కావచ్చు. ‘అందరికీ కలిపి జరిగే మీటింగులు తప్ప, ఈ నాలుగేళ్లలో నేను సీఎం గారిని కలిసింది ఒకమారే!’ అని రెండుమార్లు ఎన్నికైన ఎమ్మెల్యే చెప్పడం పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది.

రాజకీయ వ్యూహాఎత్తుగడలిచ్చే సంస్థల పురమాయింపు మేరకు ఎన్ని ప్రచార కార్యక్రమాలు, నినాదాలు, కార్యాచరణలు చేపట్టినా.. అవి కృతకంగానే ఉంటాయని, వ్యక్తిగత భేటీలతో ఏర్పడే బంధం రాదనేది అత్యధిక ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ల అభిప్రాయం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థ, నమూనా ఉండాల్సిన అవసరాన్ని వారు కోరుకుంటున్నారు. ‘పల్లెబాట’, ‘ప్రజాపథం’, ‘రచ్చబండ’, ‘రైతుసదస్సులు’ వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యే అవకాశాల్ని వైఎస్సార్‌ సృష్టించేవారు. కానీ, ప్రస్తుత సీఎం చుట్టూ ఉన్న వ్యవస్థ ఆయనని క్రమంగా ప్రజలకు దూరం చేస్తోందనే భావన బలపడుతోంది. సీఎం జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీకి దూరమైన కొత్తలో మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురై కూడా ప్రజలకు చేరువగా ఉండే నమూనాలు ఎన్నో రచించి, అమలు చేశారు. ఇప్పుడా ప్రజలతో కనెక్షన్‌ కట్‌ అయిపోతోంది. ‘నాయనలా పాలించటం లేదు’ అని ప్రజలు, ‘వైఎస్‌‌లా మా మనసు తెలుసుకోవటం లేదు’ అని వైసీపీ నాయకులు మధనపడుతున్నారు.

పాస్‌ మార్కులే అన్న జననేత!

అభివృద్ధి-సంక్షేమాలు జోడి గుర్రాలుగా సర్కారు రథాన్ని సమర్థంగా నడిపిన వైఎస్సార్‌, 2009లో గెలిచాక, ‘మనకు ప్రజలిచ్చింది పాస్‌ మార్కులే!’ అన్నారు. మరి, 2024 కి సమాయత్తం కావాల్సిన తరుణంలో పరిస్థితి ఏంటి అని వైఎస్సార్‌సీపీ వర్గాలు విశ్లేషించుకోవడం మంచిది. విపక్ష నేత చంద్రబాబును నిత్యం నిందించే, పవన్‌ కల్యాణ్‌ను రెచ్చగొట్టే పాలకపక్ష విమర్శల విషయంలోనూ నాటి వైఎస్సార్‌ వైఖరితో పోల్చి చూస్తున్నారు. చిరంజీవి విడిగా పోటీ చేయడం 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లాభించిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే పరిస్థితేంటి అని ప్రశ్నిస్తున్నారు. అటు ప్రజాక్షేత్రంలో ఇటు రాజకీయ వర్గాల్లో ఓ చర్చ సాగుతోంది.

సర్కారు ఇంటలీజన్స్‌ వ్యవస్థ, సొంత మీడియా సంస్థ, సేవలు విక్రయించే ‘రాజకీయ ఎత్తుగడల ఏజెన్సీ’, వంద మందికి పైగా సలహాదారులు.. ఇన్ని ఉండీ ప్రజాక్షేత్రంలో జరిగే వాస్తవాలను ఏలినవారు తెలుసుకోకుంటే ఎలా అన్న ప్రశ్న పార్టీ వర్గాల్లో రొదపెడుతోంది. వినడానికి సిద్దంగా ఉంటే.. పార్టీలో అనుభవం కలిగిన సీనియర్లు ఎందరో ఉన్నారు. వారే కాదు, ఏ సాధారణ కార్యకర్తనో, సామాన్య పౌరుడినో గిల్లినా నిజాలు వెల్లువలా వస్తాయి, అప్పుడైనా పాలకపక్షం నడత మార్చుకొని, నడక సరిదిద్దుకోవచ్చన్నది అంతటా ఉన్న జనాభిప్రాయం!

-దిలీప్‌రెడ్డి

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

dileepreddy.ic@gmail.com, 9949099802




Tags:    

Similar News