దేశ భక్తి చిత్రాల హీరో.. మనోజ్ కుమార్
బాలీవుడ్‌లో దేశ భక్తి చిత్రాలు అనగానే మనకు గుర్తుకు వచ్చే ఏకైక నటుడు మనోజ్ కుమార్. అతని చిత్రాలలో కథానాయకుని

బాలీవుడ్‌లో దేశ భక్తి చిత్రాలు అనగానే మనకు గుర్తుకు వచ్చే ఏకైక నటుడు మనోజ్ కుమార్. అతని చిత్రాలలో కథానాయకుని పేరు భరత్ అని ఉండటంతో ప్రేక్షకులు ముద్దుగా భరత్ కుమార్ అని పిలిచేవారు. ఈయన అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి, 1937 జూలై 24న ప్రస్తుతం పాకిస్తాన్ లోని అబోటబాద్ ప్రాంతంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు దేశ విభజన తరువాత ఢిల్లీకి వలస రావడంతో ఢిల్లీలో డిగ్రీ విద్య అభ్యసించి మొట్ట మొదటిసారిగా 1957లో 'ఫ్యాషన్ బ్రాండ్' సినిమాలో నటించి తెరజీవితం ప్రారంభించారు. ఈయన నటిం చిన చిత్రాలు విఫలం చెందినా.. అధైర్య పడకుండా ముందుకు కొనసాగించారు. చివరకు 1962 సంవత్సరంలో ప్రముఖ హీరోయిన్‌తో మాలసిన్హా నటిం చిన 'హరియాలి ఔర్ రాస్తా' హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూడలేదు. 1967లో ప్రథమంగా దర్శకత్వం వహించిన 'ఉపకార్' చిత్రంలో సమకాలీన గ్రామీణ భారతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్రీకరించారు. అలాగే 'షహీద్' అనే చిత్రంలో భగత్ సింగ్ పాత్ర పోషించి మన్ననలు పొందారు. విదేశీ నాగరికత ప్రభావం వలన దేశంలోని ఉమ్మడి కుటుంబాలు, యువత చెడిపోవడం 'పురబ్ ఔర్ పశ్చిమ్' చిత్రంలో చూపించారు. 1974లో ఆయన రచించి, దర్శకత్వం వహించిన 'రోటీ కపడా ఔర్ మకాన్' చిత్రంలో అమితాబ్ బచ్చన్, శశికపూర్ నటించారు. అప్పట్లో చూపిన నిరుద్యోగం, అవినీతి, రాజకీయ పరుల స్థితి నాటి దేశ పరిస్థితులకు అద్దం పడుతుందనటంలో ఆయన విజన్ కనబడుతుంది. 1981లో ఈయన నటించి, దర్శకత్వం వహించిన 'క్రాంతి' చిత్రంలో ప్రముఖ నటులు దిలీప్ కుమార్, శశి కపూర్ నటించారు. ఈ చిత్రం నేపథ్యం, దేశ స్వాతంత్ర్య పోరాటం. ఆంగ్లేయులు చేసిన అకృ త్యాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. సినిమా పరిశ్రమకు ఈయన చేసిన సేవలకు పద్మభూషణ్, ఫిలిం ఫెయిర్ అవార్డ్స్ అందుకున్నారు. 2015లో భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చి సత్కరించింది. మనోజ్(భరత్)కుమార్ తన 87వ ఏట మరణించడం బాలీవుడ్ ప్రేక్షకులకు తీరని శోకం.
ఆళవందార్ వేణు మాధవ్
86860 51752