ఉన్నది ఉన్నట్టు:పాలకుల విధానాలే శాపాలు
పాలకుల విధానాలు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. 'తాగండి, ఊగండి' అని ప్రోత్సహిస్తున్నాయి. మద్య నియంత్రణను సర్కారు
మద్యం విషయంలో ప్రభుత్వ విధానాలు ఇలా ఉంటే మాదకద్రవ్యాల విషయంలో సీరియస్‌గా ఎందుకుంటుంది? అనే చర్చ మొదలైంది. అందుకే గంజాయి మొదలు కొకైన్ వరకు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ వ్యాపారం సాగుతున్నది. బ్రోకర్లు అక్రమ సంపాదనకు అలవాటుపడ్డారు. ప్రతీ ఏటా మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరుపుతున్నా ఆ రోజు కూడా ఈ జాడ్యం తప్పడం లేదు. డి-అడిక్షన్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయంటే డ్రగ్స్ భూతం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సూర్యాపేటలో ఓ తల్లి తన కన్న కొడుకు గంజాయికి అలవాటు పడ్డాడని కళ్ళల్లో కారం చల్లి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు నోటుతో పాటు మద్యం బాటిళ్లను కూడా పార్టీలు సరఫరా చేస్తున్నాయి. కొత్త యువతకు మద్యాన్ని అలవాటు చేస్తున్నాయి.
పాలకుల విధానాలు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. 'తాగండి, ఊగండి' అని ప్రోత్సహిస్తున్నాయి. మద్య నియంత్రణను సర్కారు గాలికొదిలేసింది. విచ్చలవిడిగా వైన్ షాపులు, బార్లు, పబ్‌లకు లైసెన్సులు ఇచ్చేస్తున్నది. అర్ధరాత్రి తర్వాత కూడా మద్యం అమ్ముకోవచ్చంటూ స్వేచ్ఛను ఇచ్చింది. ఒక చేత్తో సంక్షేమ ఫలాలను ఇస్తూనే, మరో చేత్తో మద్యం ద్వారా గుంజుకుంటున్నది. రాష్ట్రం సొంతంగా ఆర్జిస్తున్న ఆదాయంలో మూడింట ఒక వంతు మద్యం ద్వారానే వస్తున్నది. గతేడాది రూ. 92,910 కోట్లలో రూ. 31,046 కోట్లు లిక్కర్, బీరు ద్వారానే సమకూరింది.
ఇక డ్రంకెన్ డ్రైవింగ్ పేరుతో మందుబాబుల నుంచి గుంజుతున్నది అదనం.సర్కారుకు కావాల్సింది ఖజానా నిండడమే. అందుకే రాష్ట్రంలో ఖరీదైన టాక్స్ పేయర్లు మందుబాబులే. ఇక మద్యం చాటున పబ్‌లలో డ్రగ్స్ వినియోగం సరేసరి. అదనంగా టాక్స్ కడితే 24 గంటలూ బార్లు, పబ్‌లు నడుపుకోవచ్చు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ అమ్ముకోవచ్చు. మొక్కుబడిగా అప్పుడప్పుడూ రాడిసన్ బ్లూ లాంటి రెయిడ్‌లు జరుగుతాయి. పలుకుబడి ఉన్నవారి పేర్లు స్కిప్ అవుతాయి. అప్పటికీ ఒత్తిడి పెరిగితే ఎఫ్ఐఆర్‌లో ఆ పేరు చేరుతుంది. దర్యాప్తు తర్వాత క్లీన్ చిట్ వచ్చేస్తుంది. 2017 టాలీవుడ్ కేసే ఇందుకు ఉదాహరణ. రాష్ట్రంలో కంటికి తెలియకుండా చాపకింద నీరులా డ్రగ్స్ వ్యాపారం విస్తరిస్తున్నది. చిన్నా-పెద్దా, పేద-ధనిక తేడా లేకుండా కమ్మేస్తున్నది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలలోకి చొరబడుతున్నది. మద్యం ఆదాయమంతా సర్కారుకు చేరుతుంటే డ్రగ్స్ అక్రమ సంపాదన మాత్రం బ్రోకర్లకు కాసులు కురిపిస్తున్నది.
పబ్‌లే డ్రగ్స్ సరఫరా కేంద్రాలు!
పబ్‌లు, రేవ్ పార్టీలు, రిసార్టులు అందుకోసమే ఉన్నాయనేది కామన్ టాక్. అక్కడికి వెళ్లేదే డ్రగ్స్ కోసం అనేది జనరల్ అయిపోయింది. సరదాతో మొదలై ఫ్యాషన్‌గా, స్టేటస్‌గా, అలవాటుగా, అవసరంగా మారుతున్నది. అంతిమంగా యువతను అడ్డదార్లు తొక్కిస్తున్నది. పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలలో మద్యం అనివార్యమైతే సంపన్నులకు డ్రగ్స్ ఎంజాయ్‌మెంట్ అవుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిస్సహాయత డ్రగ్స్ విస్తరణకు సహకరిస్తున్నది. కేంద్రంలోని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇటు రాష్ట్రాలలో ఎక్సయిజ్ విభాగాలలోని నార్కొటిక్స్ వింగ్‌లు చిత్తశుద్ధితో పనిచేస్తే అరికట్టడం కష్టమేమీ కాదు. ఉగ్రవాదుల, తీవ్రవాదుల, అసాంఘిక శక్తుల సమాచారాన్ని పక్కాగా సేకరిస్తున్న ఇంటెలిజెన్స్ సిబ్బంది డ్రగ్స్ రవాణా, వినియోగం విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయి.
నూతన ఆర్థిక సంస్కరణలతో పాటు ఈ మహమ్మారి మన దేశంలోకీ చొరబడింది. విదేశీ పెట్టుబడులతో పాటు కల్చర్ కూడా చొచ్చుకొచ్చింది. వారి అవసరాల కోసం తొలినాళ్లలో ఏర్పడిన పబ్ సంస్కృతి ఇప్పుడు విస్తృతమైంది. మనోళ్లకూ పాకింది. కాసుల కోసం, ఖజానా నింపుకోవడం కోసం పాలకులు పాకులాడుతున్నారు. అదనపు టాక్స్ కడితే 24 గంటలూ మద్యాన్ని అమ్ముకోడానికి లైసెన్సులు మంజూరవుతున్నాయి. సర్కారుకు ఖజానా నిండుతుంటే పబ్ యజమానులు రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అటు స్థానిక పోలీసులు, ఎక్సయిజ్ సిబ్బంది, ఇటు రాజకీయ నాయకులు మామూళ్లకు అలవాటు పడ్డారనేది బహిరంగ రహస్యం.
ఆవేదనకు తగిన ఆచరణేది?
డ్రగ్స్ వినియోగంపై ఎక్సయిజ్ శాఖ ఎన్నడూ సీరియస్‌గా దృష్టి పెట్టలేదు. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తనిఖీలు జరుపుతారు. కొన్ని రోజులు హడావుడి ఉంటుంది. ఆ తర్వాత సద్దుమణుగుతుంది. పబ్‌కు వచ్చినవారంతా డ్రగ్ తీసుకున్నవారేమీ కాదు. సెలెబ్రిటీలు బర్త్ డే పార్టీ కోసం వచ్చారులాంటి స్టేట్‌మెంట్లు షరా మామూలు. ఒకవేళ ఒత్తిడి పెరిగితే ఒకరిద్దరి పేర్లు ఎఫ్ఐఆర్‌లో చేరిపోతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. 'ఎంత ధనం, ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం.. మన పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్ కు బానిసలై వారి భవిష్యత్తు నాశనమైపోతూ ఉంటే ఎంత ఆవేదన?' అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
నార్కొటిక్ డ్రగ్స్ నియంత్రణ విభాగం శక్తివంతంగా, తేజోవంతంగా పనిచేయాలంటూ ఆదేశించారు. కానీ, ఇవేవీ ఆచరణలోకి రాలేదు. 'ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్' శాఖలో 'ప్రొహిబిషన్' అనే పదాన్ని సర్కారు గాలికొదిలేసింది. 2020-21 సంవత్సరంలో 'ప్రొహిబిషన్' టాస్క్ కోసం ఒక్క పైసానూ ఖర్చు చేయలేదు. మద్య నిర్మూలన/నియంత్రణపై ప్రజల్లో కల్పించిన అవగాహన శూన్యం. తాగడానికి నీరు దొరకని ఊర్లుంటాయేమోగానీ బీరు, బెల్టు షాపు లేని ఊరు/తండాలు లేవు. ఏటేటా వైన్ షాపుల, బార్ల లైసెన్సు ఫీజు పెరుగుతున్నది. అప్లికేషన్ రుసుమునూ సర్కారు పెంచేసింది. మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌ల సంఖ్య కూడా పెరిగింది.
తెలంగాణ సంస్కృతే అది
తెలంగాణ సంస్కృతిపై అప్పుడప్పుడూ కొన్ని సెటైర్లు వినిపిస్తూ ఉంటాయి. 'ముక్క-చుక్క' మన లైఫ్‌లో కామన్ అని సమర్థించుకుంటూ ఉంటాం. అంటే, మందు తాగడం మంచినీళ్లలాగా ఒక అవసరం అని లిజిటిమేట్ రైట్‌గా గొప్పగా చెప్పుకుంటుంటాం. చివరకు బీరు, మద్యం తాగడం ఒక హీరోయిజంగా మారిపోయింది. బీరు అలవాటు లేకుంటే అదో నామోషీ. పబ్‌లకు వెళ్లడం, డ్రగ్స్ తీసుకోవడం ఒక సెక్షన్ ప్రజలకు సోషల్ స్టేటస్. తాగడం కోసమే న్యూ ఇయర్, వ్యాలెంటైన్స్ డే, వీకెండ్.. లాంటి సందర్భాలు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వమూ దాన్ని పెంచి పోషిస్తున్నది. పేదలు, లోయర్ మిడిల్ క్లాస్‌కు బార్లు, వైన్ షాపులుంటే సెలెబ్రిటీలు, బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సంపన్నులు, వారి పిల్లలకు మాత్రం రేవ్ పార్టీలు, రిసార్టులు లాంటివి ఉన్నాయి.
రాష్ట్రంలో మద్యం, మత్తు పదార్ధాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. ఒక రోజుకు యావరేజ్‌గా 50 లక్షల బీరు బాటిళ్లను తెలంగాణ ప్రజలు తాగేస్తున్నారు. మూడున్నర కోట్ల మందిలో ఇది దాదాపు 15 శాతం. ఒకప్పుడు నెల్లూరు జిల్లా దూబగుంట రోశమ్మ చేసిన మద్యపాన వ్యతిరేక ఉద్యమం సమైక్య రాష్ట్రంలో పెద్ద సంచలనం. ఆ తర్వాత మద్య నిషేధానికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు కావాల్సి వచ్చింది. ఇప్పుడు కల్లు దుకాణాలు, నీరా కేఫ్ లాంటి పేర్లతో ప్రభుత్వాలే చొరవ తీసుకుంటున్నాయి. తమిళనాట ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపిస్తున్నది. గ్రామాలలో బెల్టు షాపులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఎక్సయిజ్ శాఖలోని విజిలెన్సు సిబ్బందికి తెలియందేమీ కాదు. ఖజానాకు కాసులొస్తుంటే అక్రమమో, సక్రమమో చూడాల్సిన పనేముంది? అంటూ సైలెంట్‌గా ఉండిపోతున్నారు. అసలు ఎక్సయిజ్ అధికారులకు ప్రభుత్వమే టార్గెట్ విధిస్తున్నది. ఆ మేరకు ఆదాయాన్ని చూపించాల్సిందే.
సర్కారు విధానాలు మారాలి
మద్యం విషయంలో ప్రభుత్వ విధానాలు ఇలా ఉంటే మాదకద్రవ్యాల విషయంలో సీరియస్‌గా ఎందుకుంటుంది? అనే చర్చ మొదలైంది. అందుకే గంజాయి మొదలు కొకైన్ వరకు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ వ్యాపారం సాగుతున్నది. బ్రోకర్లు అక్రమ సంపాదనకు అలవాటుపడ్డారు. ప్రతీ ఏటా మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని ప్రభుత్వాలు జరుపుతున్నా ఆ రోజు కూడా ఈ జాడ్యం తప్పడం లేదు. డి-అడిక్షన్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయంటే డ్రగ్స్ భూతం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సూర్యాపేటలో ఓ తల్లి తన కన్న కొడుకు గంజాయికి అలవాటు పడ్డాడని కళ్ళల్లో కారం చల్లి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు నోటుతో పాటు మద్యం బాటిళ్లను కూడా పార్టీలు సరఫరా చేస్తున్నాయి. కొత్త యువతకు మద్యాన్ని అలవాటు చేస్తున్నాయి. గతంలో నాటుసారా, కల్తీ కల్లు, గుడుంబాలాంటివి ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వమే ఆ ధరకు చీప్ లిక్కర్, ఐఎంఎఫ్ఎల్ లాంటి బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. సర్కారు విధానాలు, రాజకీయ పార్టీల తీరు ఇలా ఉంటే ప్రజలు మరోలా ఎందుకుంటారు? 'తిలా పాపం తలా పిడికెడు'.
ఎన్. విశ్వనాథ్
99714 82403