గిరిజన మంత్రిని విమర్శించడం సబబేనా ?
సమాజంలో ఉన్నత వర్గానికి చెందిన మహిళలే రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో రాణించ డం, కష్టతరమైన ఈ కాలంలో
సమాజంలో ఉన్నత వర్గానికి చెందిన మహిళలే రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో రాణించ డం, కష్టతరమైన ఈ కాలంలో, ఒక వెనుకబడిన గిరిజన తెగకు చెందిన, ఒక సాధారణ మహిళ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక మారు మూల గ్రామం నుంచి వచ్చి రాష్ట్రమంత్రిగా ఎదిగారంటే చాలా గొప్ప విషయం. ఆమె పడ్డ శ్రమను, ఆమె చేసిన కృషిని ప్రశంసించాల్సింది పోయి.. ఒక వెనుకబడిన గిరిజన తెగకు చెందిన ధనసూరి అన సూయ అలియాస్ సీతక్కను భాషాపరంగా కించపరచడం తమను తాము అవమానించుకోవటమే.
తెలుగు రానివాళ్లూ వ్యాఖ్యానిస్తే..
కోయ సమాజం ప్రధానంగా, కోయ భాషను మాట్లాడుతుంది. దీనిని, కోయి అని కూడా పిలుస్తారు. ఇది గోండికి దగ్గరి సంబంధం ఉన్న దక్షిణ మధ్య ద్రావిడ భాష. తెలంగాణలో ఉన్న చాలా మంది గిరిజనులు వారి-వారి సొంత భాషలను మాట్లాడడం వల్ల తెలుగు గాని, ఇతర భాషలు గాని మాట్లాడడంలో కొంత ఇబ్బంది పడతారు. నేడు భాషాపరంగా ఆమెను విమర్శించిన వారు.. ఉన్నత వర్గ కుటుంబంలో జన్మించి వంశపారపర్యంగా రాజకీయాల్లో చలామణి అవుతున్నవారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టినా తమకు తెలుగు రాదనే విషయంపై చింతించకుండా, ఒక వెనుక బడిన గిరిజన మహిళను నిండు శాసనసభలో భాష పరంగా అవమానించడం అంటే, యావత్ గిరిజన సమాజాన్ని అవమానించినట్లే. గిరిజనుల భాష, వేషధారణ ప్రత్యేక సాంప్రదాయం కలిగినటువంటి సమాజం. అటువంటివారు ఇప్పుడే సమాజంలో ఎదుగుతున్న తరుణంలో వారిని నిండు సభలో అవమానించడం దురదృష్టకరం. ఒక వెనుకబడిన గిరిజన తెగకు చెందిన మహిళా మంత్రి అయిన సీతక్క ఎంత ప్రజాదరణ పొందిందో మనం ప్రమాణ స్వీకారం రోజే చూశాం. అలాగే కరోనా లాంటి కష్ట సమయంలో, ఎవరూ చేయనటువంటి సాహసం చేసి, చాలామంది నిరుపేద గిరిజన కుటుంబాలకు ఆర్థిక, మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన విధానం ప్రపంచం మొత్తం ఆమెను అభినందించింది. అటువంటి, ప్రజా నాయకురాలని భాషాపరంగా విమర్శించే ముందు ఒక్కసారి తాము ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది.
మనోభావాలు దెబ్బతీయొద్దు!
ఒక వెనుకబడిన గిరిజన తెగకు చెందిన మహిళ బయటికి వచ్చి, రాజకీయాల్లో రావడమే కష్టతరమైనటువంటి సమయంలో, ఇటువంటి భాషా పరమైన విమర్శల వల్ల మిగతా ఆ వర్గానికి చెందిన మహి ళలు రాజకీయాల్లో రావడానికి ఆసక్తి చూపకపోవచ్చు. కాబట్టి నగరాలలో పుట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపినటువంటి వారు మిగతా వారిని తమతో సమానంగా ఊహించుకొని వారిని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఒకసారి వారిని విమర్శించే ముందు, వారు జీవించిన పరిస్థితులు, వారు పెరిగిన వాతావరణం పరిస్థితులను అధిగమించి ఎదుగుతున్న వారి మనోభావాల మీద దెబ్బ కొట్టి బలహీనపరచాలనుకోవడం దుర్మార్గమైన చర్య. అలాగే మహిళ లోకాన్ని కూడా కించపరచడమే. రాజకీయాలలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. ఇకనైనా మనిషి రూపం మీద, వేషధారణ మీద, మాట్లాడడం కాకుండా తను చేసే పనిమీద తన పనితనం మీద మాట్లాడితే బాగుంటుంది..
-డాక్టర్. ఎ. శంకర్
99514 50009