సత్య మార్గం.. ఇదే జీవిత సత్యం!
నీ పిల్లలకు నీవిచ్చేది ఒక ఆస్తి మాత్రమే కాదు.. నీ మిత్రులను, నీ ఇరుగుపొరుగులను, నీ అన్నదమ్ములను, నీ చుట్టాలను, నీ సమాజాన్ని
నీ పిల్లలకు నీవిచ్చేది ఒక ఆస్తి మాత్రమే కాదు.. నీ మిత్రులను, నీ ఇరుగుపొరుగులను, నీ అన్నదమ్ములను, నీ చుట్టాలను, నీ సమాజాన్ని, నీ దేశాన్ని కూడా.. నీవు ఉన్నప్పుడు, పోయిన తరువాత కూడా నీ సంతానం వీరందరితో కలిసి సహజీవనం చేస్తారు. వీరందరూ అవినీతిపరులు అయితే.. నీవు ఎంత ఆస్తి ఇచ్చినా, నీ తరువాతి తరానికి సుఖం ఎక్కడ ఉంటుంది? ప్రశాంతత ఎక్కడ నుంచి వస్తుంది.?
సత్యం శివం సుందరం... ఇది నేను చిన్నప్పటి నుంచీ, వింటూ వస్తున్న మాట. ఆ పేరుతో వచ్చిన హిందీ సినిమా వలన అది అందరి నోటిలో నానింది. కానీ కొంత కాలం నాకు అది అర్థం అయ్యేది కాదు. సత్యం అంటే అర్థం నిజం అని కదా, మరి శివం అంటే శివుడు అనా! సుందరం అంటే అందం కదా. ఈ మూడింటికి ఏమిటి సంబంధం? అది ఎవరు ఎందుకు మొదట అన్నారో తెలియదు కానీ, నేను శివం అంటే భగవంతుడు అన్న అర్థంలో ఇప్పుడు తీసుకున్నాను. అలా తీసుకుంటే అర్థం నాకు సరిపోయింది. నేను దీనిని వివరిస్తాను..
అబద్ధాన్ని ఆశ్రయించిన వారు..
మహాత్ముడు, సత్యమే దైవం అని చెప్పినట్టు చదివాను, అంటే Truth is god అని అన్న మాట. దైవం అంటే ఏమిటి? ఒకరికి దైవం అంటే రాముడు, వేరొకరికి అల్లా, ఇంకొకరికి యేసు ప్రభువు... వీరందరి ద్వారా మనకు తెలిసేది ఏమంటే.. దైవం సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, తనను నమ్మిన వాళ్ళను, శరణాగతులను రక్షిస్తాడు అని. భక్తుల యోగక్షేమాలు అతనే చూసుకుంటాడని. దైవభక్తి ఎటువంటి ఆపదనైనా అవలీలగా ఎదురిస్తుందని, తిరుగే ఉండదని, అజేయమనీ నమ్మకం. ఇది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. దేవుని మాత్రం కంటే దేహం కనరాదని ఉవాచ. అంటే దైవభక్తి ఎంత శిక్ష అయినా భరించగలిగే శక్తి నిస్తుంది.
సత్యం అంటే నిజం. ఆ దైవం చేసే పనులన్నీ చేస్తుంది సత్యం. దైవానికి మారు పేరు సత్యం. సత్యం సర్వాంతర్యామి - అంతటా వ్యాపించి ఉంది. ఇందు గలడందు లేడని సందేహం వలదు. సర్వవ్యాపి. సర్వజ్ఞుడు, అంటే అన్నీ తెలిసినవాడు. అందరి పాపపుణ్యాల చిట్టా సత్యం వద్ద ఉంటుంది. అందరూ సత్యవంతులే అయితే.. లోకం ఎంత సుఖమయం, సౌకర్యవంతం అవుతుంది? విశ్వం ఎంత సుందరం అవుతుంది? సత్యం దైవం అయితే అసత్యం సహజంగానే, రాక్షసం అవుతుంది. అసత్యాన్ని ఆసరా చేసుకున్నవారు కుక్క తోక పట్టుకుని గోదారి ఈదిన చందం అవుతుంది. మునక తప్పదు. చరిత్రలో అబద్ధాన్ని ఆశ్రయించిన వారు ఎవరూ సుఖపడిన దాఖలాలు లేవు. వాడు కూడబెట్టిన సంపద తరువాతి తరాలు ఉపయోగించుకుని సుఖపడినట్టు ఎక్కడా కనిపించదు. పాపపు సొమ్ము గంగ పాలు కాక తప్పదు. కర్మఫలం అనుభవించక తప్పదు.
సత్యం అమృతం..
కర్మఫలం ఎలా సంభవిస్తుంది, ఎందుకు సంభవిస్తుంది, దీని కారణాలేమిటి, శాస్త్రీయత ఏమిటి? నీవు తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు నీ చుట్టు పక్కన ఉన్నవారికి తప్పు చేయడం తప్పుగా అనిపించదు. నీవు చేసిన పని వారు ఎందుకు చేయకూడదు అన్పిస్తుంది. వారు చేసిన తప్పు నేనేందుకు చేయకూడదు అని నీకు అన్పిస్తుంది. ఇది ఒక విషవలయం. నిరంతరంగా కొనసాగుతుంది. నిన్ను తీవ్ర సమస్యలలోనికి నెడుతుంది. నీతోపాటు పక్కన ఉన్నవారిని కూడా. జీవితం దుఃఖమయం అవుతుంది. జనం సమయం, ప్రయత్నం అంతా, తమ మేలు వైపు కేంద్రీకృతం కాకుండా, ఇతరుల పతనం కోసం మారుతుంది. సమయం, ప్రయత్నం మురుగు నీరులా మారుతుంది. అందరికీ నష్టమే. మన అందరం అనుసంధానంలో ఉన్నాము. ఒకరికి ఒకరు తోడూనీడగా మన అందరమూ ఒక్కటే. అందరం మునుగుతాం, లేదా అందరం తేలుతాం. ఇది జీవిత సత్యం. సత్యం అమృతం. సత్యవంతులు ముందు నుంచి కష్టానికి అలవాటు పడ్డవారు కాబట్టి, వారు కష్టమెదురైనా అధైర్యపడరు. అదే అసత్యవంతులు సుఖం మరిగి వ్యసనాలకు బానిసలు అవుతారు. సొంత కుటుంబం గౌరవం ప్రేమ కూడా కోల్పోతారు. వారిలో అభద్రతాభావం తిష్ట వేసి కూర్చుంటుంది. ఎవరిని నమ్మలేరు. ఎవరూ వీరిని నమ్మరు. ధనం మనిషికి అవసరం అయినా, ధనం నిర్జీవి.
నీవు ఏది పంచితే..
పని చేయించుకోవాలంటే మనిషి అవసరం అవుతాడు. ఎన్ని రోబో యంత్రాలు, కృత్రిమ మేధ వచ్చినా, మనిషికి సహవాసం, తోడు అవసరం ఉంటుంది. నీవు తప్పు చేసి, ఎదుటివారిని మడి గట్టుకు కూర్చోమంటే జరగదు. ఆవు చేను మేసి, దూడ గట్టున మేయాలంటే కుదురుతుందా? అదే కర్మఫలం శాస్త్రీయత. నీవు మోసగాడివి అయితే, నిన్ను మించిన మోసగాడు ఇంకొకడు వస్తాడు. వాడి రాకకు నీవే కారణం. కర్త, క్రియ, కర్మ. నీవు తీసిన గోతిలో నీవే పడతావు. అందుకే సత్యమార్గమే నిజమైన సుఖమార్గం. సత్య మార్గమే దైవ మార్గం. సత్యాన్ని మించిన దైవం లేదు. సత్యమే నిత్యమూ, దైవమూ, సుందరమూ.. అసత్య మార్గం పట్టి, ఎన్ని పూజలు, ప్రార్థనలు, ఏ విధమైన ఉపవాసాలు, నియమ నిష్టలతో.. ఆరాధనలు చేసినా ఫలితం ఉండదు. సత్యమార్గాన పయనించిన వారికి కష్టముండదు. అసత్య మార్గాన నడిచినవారికి సుఖముండదు. ఇది ప్రకృతి తిరుగులేని ధర్మం. నీవు ఏది పంచితే అదే నీకు వడ్డీతో సహా అందుతుంది.
-ప్రొ. సీతారామరాజు సనపల
డీఆర్‌డీఓ పూర్వ శాస్త్రవేత్త.
72595 20872