చరిత్ర పుటలు:అమరులు మహమ్మదాపూర్ వీరులు

చరిత్ర పుటలు

Update: 2022-03-15 18:45 GMT

ల్లి ఒడిలో పాలు తాగుతున్న శిశువు కుడి నుండి ఎడమకు మారడం వంటిదే మరణం' అంటారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. 'ఒక వ్యక్తి ఎట్లా? జీవించాడు? ఎట్లా మరణించాడు? అనేదే మరణానికి దాఖలా' అన్నారు శ్రీశ్రీ. 'ఇంటి నుండి బయటకు కాలు పెట్టినప్పుడే నిన్ను నీవు చంపుకున్నావనుకో' అన్నారు కాళోజీ. ' మరణశాసనాన్ని రాసుకొనే నేను పుట్టాను' అన్నారు భగత్ సింగ్. విప్లవకారులు, సమాజ హితులు జీవించినంత కాలం, వారి జీవితకాలంలో ఇచ్చిన స్ఫూర్తి, చైతన్యం అమరులైన తరువాత కూడా విప్లవాలకు పెట్టుబడులుగా ఉంటున్నాయి.

అనేక మంది యోధులు

దేశ స్వాతంత్ర్యం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. వేలాది మంది దేశ భక్తులు తమ ప్రాణాలను కోల్పోయారు. 1857 మార్చి 27న బాగ్ అనే ఆంగ్లేయ అధికారిని మంగళ్‌పాండే చంపేశాడు. ప్రతీకారంగా బ్రిటిష్ ప్రభుత్వము 1857 ఏప్రిల్ 8న మంగళ్‌పాండేను ఉరి తీసింది. దీంతో గుండెలు మండిపోయిన సిపాయిలు మీరట్‌లో 1857 మే 10 న తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటును చరిత్రకారులు తొలి స్వాతంత్ర్య సంగ్రామం గా అభివర్ణించారు. భారత్ స్వాతంత్ర్య ఆకాంక్షలు హైదరాబాద్ సంస్థానానికి వ్యాపించాయి.

తుర్రేబాజ్ ఖాన్ (తురుంఖాన్) 500 మంది రోహిల్లాలతో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కోఠీ బ్రిటిష్ రెసిడెన్సీపై (ఇప్పటి కోఠి ఉమెన్స్ కాలేజ్) 1857 జూలై 17 న దాడి చేశాడు. కానీ, దాడి విఫలమైంది. తుర్రేబాజ్‌ఖాన్ తప్పించుకున్నాడు. ఖుర్బాన్ అలీ అనే సైనికుడు ఇచ్చిన సమాచారంతో తుర్రేబాజ్ ఖాన్‌ను నిజాం సైనికులు తూప్రాన్ వద్ద పట్టుకుని చంపేశారు. 1858 జనవరి 19న అతడి కోట గోడకు వేలాడదీసి ప్రతీకారం తీర్చుకున్నారు. నల్లగొండ జిల్లా కడివెండి లో జరిగిన కాల్పులలో దొడ్డి కొమురయ్య చనిపోయాడు. ఇది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమరానికి సంకేతంగా మారింది.

పోలంపల్లి పులి బిడ్డ

ఇదే క్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు తెలంగాణ అంతటా విస్తరించాయి. కరీంనగర్ జిల్లాలో అనభేరి ప్రభాకర్‌రావు నాయకత్వంలో ఉద్యమం ఊపందుకుంది. తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలోని దేశ్‌ముఖ్ కుటుంబంలో వెంకటేశ్వర్‌రావు, రాధాబాయి దంపతులకు 1910 ఆగస్టు 15న అనభేరి ప్రభాకర్‌రావు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కరీంనగర్, మచిలీపట్నంలోనూ, హైస్కూల్ విద్యాభ్యాసము హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లోనూ, ఉన్నత విద్యాభ్యాసం కాశీ పీఠంలోనూ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుండే నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 27 సంవత్సరముల వయస్సులో సరళాదేవితో వివాహమైంది. సులోచన దేవి, శకుంతల దేవి, విప్లవ కుమారి అనే ముగ్గురు కూతుళ్లు జన్మించారు.

అనభేరి ప్రభాకర్ మొదటగా విద్యావ్యాప్తికి, ఉపాధి అవకాశాల కోసం కృషి చేశారు. గ్రామాలలో గ్రెయిన్ బ్యాంకులను స్థాపించి రైతులకు ధాన్యం అందించారు. సహకార సంఘాలను స్థాపించి చేనేత కార్మికులకు నూలును సరఫరా చేశారు. 1942 నుండి 1946 వరకు రాష్ట్ర చేనేత సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగారు. భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి సాయుధ దళానికి నాయకత్వం వహించారు. దాదాపు 40 గ్రామాలలో పటేల్, పట్వారీల దగ్గర ఉన్న రికార్డ్‌లను తగుల బెట్టారు. తెలంగాణ భగత్‌సింగ్‌గా ప్రజల హృదయాలలో స్థానం పొందాడు. దానితో నిజాం సంస్థానం అనభేరి ప్రభాకర్‌రావును పట్టించినవారికి 50 వేల రూపాయల బహుమానం ఇస్తామని ప్రకటించింది.

ద్రోహుల సమాచారంతో

1948 మార్చి 14న ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ దళం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సమాచారమందుకున్న నిజాం పోలీసులు, అస్సాం రైఫిల్స్ పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. ప్రభాకర్‌రావు దళం కాల్పులు జరుపుతూనే మహమ్మదాపూర్ గుట్టల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. నిజాం పోలీసులు కూడా కాల్పులు జరుపుతూ దళాన్ని వెంటాడారు. ఈ భీకర పోరులో అనభేరి ప్రభాకర్‌రావు సహా ఆయన సహచరులు సింగిరెడ్డి భూపతిరెడ్డి, ముస్కు చొక్కా రెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, అయి రెడ్డి భూంరెడ్డి, తూమేజు నారాయణ, బి. దామోదర్‌రెడ్డి, ఇల్లందుల పాపయ్య, పొరెడ్డి రాంరెడ్డి, నల్లగొండ రాజారాం, సిక్కుడు సాయిల్, రొండ్ల మాధవ‌రెడ్డి వీర మరణం పొందారు. ఇద్దరు దళ సభ్యులు తప్పించుకుపోయారు.

వీరు అసువులు బాసిన చోటనే భారతీయ కమ్యూనిస్టు పార్టీ అనభేరి ప్రభాకర్‌రావు స్మారక భవనాన్ని, స్థూపాన్ని నిర్మించింది. స్థూపం దిగువన ఉన్న స్థలంలో భూగర్భ జలం ఉబికి వస్తుంది. ఎండా కాలంలో కూడా భూగర్భ జలం ఉంటుంది. ఈ భూగర్భ జలాన్ని, స్థూపాలను స్థానిక రైతులు పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ ప్రాంతానికి చేరుకునేలా రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజలు, సందర్శకులు కోరుకుంటున్నారు.

మేరుగు రాజయ్య

కేంద్ర కార్యదర్శి

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ / ఏఐటీయూసీ

94414 40791

Tags:    

Similar News