మత్తు ముంగిట దేశ భవిష్యత్తు

మత్తు ముంగిట దేశ భవిష్యత్తు... The future of the country is intoxicated says prasadarao

Update: 2023-03-04 18:30 GMT

ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా మన భారత్ విరాజిల్లుతోంది. వివిధ రంగాల్లో అభివృద్ధి మన యువత మీదనే ఆధారపడి ఉంటుంది అనేది వాస్తవం. నూతన పరిశోధనలకు, ఆవిష్కరణలకు నేటి యువత కృషి చేయవలసి ఉంటుంది. యువత పురోగతి సాధించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ విద్య వైద్యం అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతీ ఒక్కరూ సమాన అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగాలి.‌ ఇటువంటి మహా సంకల్పం సాధించడానికి ప్రభుత్వాలు తమ ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంతో పాటు, కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర కీలకం అని గ్రహించాలి.‌ మొక్కై వంగనది, మానై ఒంగునా.... అని పెద్దలు చెబుతారు. అంటే చిన్ననాటి నుంచి పిల్లలకు చదువు, సంస్కారం, మంచి అలవాట్లు, ప్రవర్తన నేర్పాలి. అప్పుడు మాత్రమే కుటుంబాలకు, దేశానికి మంచి తరాలను అందించగలం.‌ అయితే, ఇటీవల కాలంలో యువతలో చాలా మంది అనేక చెడు వ్యసనాలకు బానిలుగా మారుతూ అటు కుటుంబానికి, ఇటు దేశానికి పనికిరాకుండా పోతూ వివిధ సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... హత్యలు, మానభంగాలు, ప్రేమ కార్యక్రమాలు, కాదంటే యాసిడ్ దాడులు, మత్తులకు బానిసలు, సామాజిక మాధ్యమాల్లో విహరించడం, అక్రమ సంబంధాలు , సైబర్ నేరాలు ఇలా అనేక విధాలుగా మునిగి తేలుతూ ఉంటున్నారు.

యువతకు డెత్ ట్రయాంగల్

ముఖ్యంగా యువత మద్యం, డ్రగ్స్ మత్తులో ఊగిపోతూ, మునిగిపోతున్నారు. మన దేశంలోకి డ్రగ్స్ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల నుంచి ఎక్కువ మోతాదులో వచ్చి చేరుతున్నాయి. పాక్, మయన్మార్ సరిహద్దు ప్రాంతాలు నుంచి ఈ డ్రగ్స్ కుప్పలు తెప్పలుగా దేశం నలుమూలలకూ వచ్చి చేరుతూ యువతను అన్ని విధాలా నాశనం చేస్తున్నాయి. మయన్మార్ లోని పర్వత ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయి ముఖ్యంగా నల్లమందు ( ఓపియం) అసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం మీదుగా దేశంలో ప్రవేశిస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నాయి.‌ 2018 లో జరిపిన ఒక సర్వేలో దేశంలో 23.2 కోట్ల మంది డ్రగ్స్‌కు బానిస అయ్యారు అని తెలిపింది. వీరిలో 10-17 సంవత్సరాల వయస్సు గల వారు సుమారు 1.5 కోట్ల మంది ఉన్నారు అని తెలిపింది.‌ ఐక్యరాజ్యసమితి యు.ఎన్.ఓ.డి.సి కూడా భారత్ యువత లోని మత్తులకు బానిసలు అవటం పట్ల తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. 2022 ఫిబ్రవరిలో నాటికి ఒక్క అసోం రాష్ట్రంలోనే 2,878 కేసులు నమోదు చేసి, 4,691 మందిని అరెస్టు చేశారు అంటే ఎంత దారుణంగా ఈ దందా కొనసాగుతోందో అర్థం చేసుకోవచ్చు.‌ ఇక 2023, ఫిబ్రవరి 20వ తేదీ నాటికి, 1273.65 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.‌ ఈ విధంగా మత్తు దందాలకు గోల్డెన్ ట్రయాంగల్‌గా పేరు పొందిన ఈ సరిహద్దు ప్రాంతాలు దేశ యువతకు డెత్ ట్రయాంగల్ గా మారుతున్నాయి.

కరోనా కంటే ప్రమాదకరం

ఇక మనదేశంలో హైస్కూల్ స్థాయి నుంచి కళాశాల విద్యార్థుల వరకూ, పల్లెటూరు నుంచి పట్టణం వరకు ఈ డ్రగ్స్ మహమ్మారి కరోనా వైరస్ కంటే వేగంగా, విస్తృతంగా వ్యాప్తి చెందుతూ దేశ యువతను కబళిస్తున్న వేళ.... అందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.‌ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి. డ్రగ్ పెడ్లర్స్‌పై ఉక్కు పాదం మోపాలి. సరిహద్దుల్లో నిఘా పెంచాలి.‌ అనుమానిత విదేశీయులను డేగకన్నుతో పరిశీలించాలి.‌ పబ్స్, బార్, వివిధ పార్టీల ప్రదేశాలపై నిఘా పెంచాలి.‌ ఇటీవల కాలంలో సెల్, రకరకాల వెబ్ సైట్లు, యాప్‌లు అందుబాటులోకి రావడంతో అన్ని ప్రదేశాలకు, అందరికీ ఈ డ్రగ్స్ రకరకాల మార్గాల ద్వారా సులభంగా చేరిపోతున్నాయి. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి. పారదర్శకంగా పని చేయాలి.‌ అప్పుడు మాత్రమే ఈ మత్తు పీడను నివారించగలం.

భవిష్యత్తులో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి పునాది రాళ్ళు యువతే... అటువంటి యువత విద్య ద్వారా అనేక విషయాలు గ్రహించి, దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని కీలకపాత్ర పోషించాలి. ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి.‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఉత్పత్తి సాధనకు, నైపుణ్యాలు అభివృద్ధి పరుచుకోవాలి.‌ భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకోవాలంటే నేటి యువత శారీరక మానసిక సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంది అని మరువరాదు. దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి నీతి నిజాయితీలతో కూడిన యువత కావాలి. శారీరక మానసిక ఆరోగ్యం కలిగిన యువత పైనే మన భారత్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని అందరూ గ్రహించాలి....

- ఐ.ప్రసాదరావు

6305682733

Tags:    

Similar News