ఆదివాసీల అస్తిత్వం కాపాడాలి!

దేశ మూలవాసులైన అడవి బిడ్డలు కొండ కోనల్లో అడవుల మధ్య బతుకుతూ ప్రకృతిలో సహజీవనం చేస్తూ జీవవైవిధ్య పరిరక్షణలో కీలకంగా నిలుస్తారు.

Update: 2024-08-09 00:30 GMT

దేశ మూలవాసులైన అడవి బిడ్డలు కొండ కోనల్లో అడవుల మధ్య బతుకుతూ ప్రకృతిలో సహజీవనం చేస్తూ జీవవైవిధ్య పరిరక్షణలో కీలకంగా నిలుస్తారు. అయితే ప్రపంచీకరణ, పర్యావరణ మార్పుల వల్ల ఆదివాసీల జీవితాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మౌలిక వసతులు కరవై తీవ్ర వెనుకబాటుతో వారు కొట్టుమిట్టాడుతున్నారు. కానీ కష్టమైనా, నష్టమైనా అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అయితే 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎందరు పాలకులు మారినా ఆదివాసీలు బతుకులు మారడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో 50 కోట్ల మంది దాకా ఆదివాసీలు ఉన్నారు. ప్రపంచ జనాభాలో వారు 5%లోపే కానీ వారు ఏడు వేల భాషలు మాట్లాడుతారు. 5 వేల విభిన్న సంస్కృతులను ఆచరిస్తున్నారు. వారి జీవన విధానం పర్యావరణ హితంగా ఉంటుంది. ప్రపంచీకరణ ప్రభావం వారి సంస్కృతిని దెబ్బతీస్తోంది. ఈ క్రమంలో ఆదీ వాసీల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ( యునెస్కో) ఏటా అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

వారి ఆవాసాలను దెబ్బతీస్తూ..

భూగోళంపై దాదాపు 20% భూభాగంలో ఆదివాసీలు, మన దేశంలో 10.47 కోట్ల జనాభా నివసిస్తున్నారని అంచనా. వీరు నివసించే చోటే 80% జీవవైవిద్యం, 40% రక్షిత అటవీ ప్రాంతాలు, పర్యావరణం, సహజ వనరుల వంటి కీలక ప్రదేశాలు ఉన్నాయి. భూతాపం ప్రభావా న్ని తొలుత ఎదుర్కొంటున్నది ఆదివాసీలే. పర్యావరణ మార్పుల వల్ల వరదలు, తుఫానులు ఆదివాసీల భూములు, ఆవాసాలను దెబ్బతీస్తున్నాయి. కరువులు, ఎడారీకరణ వల్ల అడవులు క్షీణిస్తున్నాయి. కార్చిచ్చులు, పచ్చదనాన్ని హరిస్తున్నాయి. భారతదేశంలో 705 ఆదివాసీ సమూహలను అధికారికంగా షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించారు. దేశీయంగా గిరిజన గ్రామాలను రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో చేర్చారు. కొన్నిచోట్ల ఆదివాసీలు ఉన్న వందల గ్రామాల ను అయిదో షెడ్యూల్లో చేర్చకపోవడం వల్ల అసలైన గిరిజనులకు రాజ్యాంగ పరమైన హక్కులు దక్కడం లేదు. నిరక్షరాస్యత, పేదరికం, మౌలిక వసతుల కొరతతో సతమతం అవుతున్నారు.

వారి బతుకును మార్చేందుకు..

భారత రాజ్యాంగం ఆదివాసీలకు చట్టపరమైన రక్షణలు కల్పించింది ఆదివాసీల సంరక్షణ, అభివృద్ధి కోసం భారత రాజ్యాంగంలో గవ ర్నర్లకు విచక్షణ అధికారాలను కల్పించారు. వారు వీటిని ఉపయోగించి వారి సంస్కృతికి ఏమైనా ముంపు సంభవిస్తే, ఆపే హక్కు ఉంది. అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగలవారు(పీవీటీజీలు) దేశీయంగా 20 లక్షలకు పైగా ఉన్నారు. వీరు కనీస వసతులకూ నోచుకోక అత్యంత దుర్భరంగా జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదీవాసీల సంక్షేమ, అభివృద్ధి కోసం ప్రభుత్వలు పలు చట్టాలు చేస్తున్నా, పథకాల ప్రారంభిస్తున్నా క్షేత్రస్థాయిలో సరైన ఫలితాలు ఉండటం లేదు. చట్టాలు చేసినంత హడావుడి వాటి అమలులో ఉండదు. ఇప్పుడు వారికున్న చట్టాలు ఏవి కూడా సక్రమంగా అమలు కావడం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వీటిని నిర్వీర్యపరచారు. ఆదివాసీ జీవితాల్లో నిజమైన అభివృద్ధి నెలకొంటేనే దేశం ప్రగతి పథంలో పయనిస్తున్నట్టు. పాలకులు ఈ విషయాన్ని గుర్తించి వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పటిష్ట చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనకు నడుం కట్టాలి. అప్పుడే దేశీ యంగా ఆదివాసీల బతుకు చిత్రం మారడానికి మార్గం సుగమవుతుంది. నిజమైన ఆదివాసీ గిరిజన దినోత్సవం అంటే వారి అవసరాలు ఆకాం క్షలు నెరవేర్చేదిగా, అభివృద్ధి వైపు నడిపించే విధంగా ఉండాల్సిన అవసరం అందరి పైన ఉంది.

(నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం)

ఎన్.సీతారామయ్య

94409 72048

Tags:    

Similar News