క్యూబాపై ఆంక్షలు ఎత్తివేయాలి!

The embargo on Cuba should be lifted!

Update: 2023-10-04 00:30 GMT

సామ్రాజ్యవాదానికి పరాకాష్టగా నిలిచి తనకు అనుకూలంగా లేని దేశాలలో కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పరచి 'ప్రపంచ పోలీసు పాత్ర'ని పోషిస్తున్న అమెరికా నాటి నుండి నేటి వరకు ఆయా దేశాలపై ముఖ్యంగా సోషలిస్ట్ దేశాలపై నిరంతరం కఠిన ఆంక్షలు అమలుపరుస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల నేడు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అమెరికా వివిధ దేశాలపై విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచంలో నానాటికీ అసమానతలు విరివిగా పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేవు. ముఖ్యంగా లాటిన్ అమెరికా లోని క్యూబా దేశంపై అమెరికా అరవై ఏళ్లకు పైగా అనేక రకాల ఆంక్షలు విధిస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూనే ఉంది. బాటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా సోషలిస్టు దేశంగా ఆవిర్భవించి ప్రగతిపథంలో పురోగమిస్తున్న క్యూబాను సహించని అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ దేశంపైన క్రూరమైన ఆంక్షలు అమలు పరచడం ఏ రకంగాను సహేతుకం కాదు. ఒక స్వతంత్ర సోషలిస్టు దేశమైన క్యూబాపై ఆరు దశాబ్దాలకు పైగా అమెరికా సామ్రాజ్యవాద దాహంతో కఠిన ఆంక్షలను నేటికీ కూడా అమలుపరుస్తున్న తీరును ఆ దేశ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య వ్యక్తులు చాలా తీవ్రంగా నిరసిస్తున్నారు. అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా శాంతి, న్యాయం కోసం క్యూబా అనునిత్యం పోరాడుతూనే ఉంది.

అమెరికా ఆంక్షలతో...

అమెరికా నిరాటకంగా కొనసాగిస్తున్న ఆంక్షలు క్యూబా ఆర్థిక వృద్ధి వ్యూహాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 'అమెరికా ఆంక్షల వల్ల ఔషధాలు, శాస్త్ర, సాంకేతిక విషయాల్లో అంతర్జాతీయ మార్కెట్లో క్యూబా తీవ్ర విషమ పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంది. క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా చేసిన దిగ్బంధనం వలన ఇంధన కొరత, వైద్య సామాగ్రి కొరత, ఆహార కొరత ఆర్థిక వ్యవస్థకు నష్టాన్ని కలిగించాయి. ఆంక్షల కారణంగా ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థతో లావాదేవీలు జరపడం క్యూబాకు కష్టసాధ్యంగా మారింది. ఇంధనం, ఆహారం, నిర్మాణ సామ్రాగి, పారిశుద్ధ్య ఉత్పత్తులు, మందుల సేకరణ అంతిమంగా అంతర్జాతీయ మార్కెట్ నుంచి పలు రకాల నిత్యావసరాలను సైతం పొందలేని విషమ పరిస్థితులను అమెరికా సృష్టించింది. దీంతో క్యూబా ప్రజలు జీవితాలు మరింతగా దుర్భరమయ్యాయి. ఈ రకంగా దేశ ప్రజలకు నిత్యావసరాలు, మందులు, ఆహారం కూడా అందకుండా ఆంక్షలు అమలు పరచడం సహేతుకం కాదు. ఇలా అనేక విషయాల్లో అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల ప్రభావాలను అధిగమించాల్సి రావడం విచారకరం. ముఖ్యంగా క్యూబా 30 ఏళ్లలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆహారం ఔషధాల కొరతతో కోవిడ్-19 విపత్తు కారణంగా కీలకమైన ఆదాయ వనరు అయిన పర్యాటకానికి భారీ దెబ్బ తగిలింది. మొత్తంగా అమెరికా ఆంక్షలు క్యూబా దేశ అభివృద్ధికి అడ్డుకట్ట వేసే విధంగా ఉండడం విచారకరం. ఏది ఏమైనా క్యూబా ఒకపక్క ఆంక్షలు, నిషేధాలను ఎదుర్కొంటూనే మరోపక్క వాటితో సంబంధం లేకుండా ఇతర దేశాలకు సహాయం చేస్తూనే వైద్యులతో పాటు మందులను కూడా సరఫరా చేస్తూ సహాయకారిగాను ఉండడాన్ని ఆయా దేశాలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆంక్షలపై ప్రజల్లో వ్యతిరేకత..

మార్క్సిస్ట్ విప్లవకారుడు చే గువేరా కుమార్తె, మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ అలీదా గువేరా క్యూబాకు సంఘీభావం తెలియజేయాలని ప్రపంచ ప్రజలను కోరారు. ఆ క్రమంలోనే ఆమె గత సంవత్సరం భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో క్యూబా సంఘీభావ సదస్సులకు ముఖ్య అతిథిగా హాజరై అమెరికా విధించిన దిగ్బంధనం, ఆంక్షల ఉక్కిరిబిక్కిరితో పోరాడుతున్న క్యూబా విప్లవ ప్రజలకు సంఘీభావంగా ఆంక్షల రహిత క్యూబా కోసం పోరాట గళాన్ని వినిపించారు. ప్రజానీకం శాంతియుతంగా జీవిస్తున్న క్యూబాలో ఆంక్షల పేరుతో అమెరికా అశాంతికి కారణభూతంగా వ్యవహరించడం ఏరకంగాను సమంజసం కాదు. అందువలన ఇకనైననూ అమెరికా స్వచ్చందంగా ఆంక్షలను ఉపసంహరించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కానీ అమెరికా ఆ విధంగా కాకుండా మరిన్ని ఆంక్షలు రుద్దే విధంగా వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజానీకాన్ని మరింతగా కలవరపెడుతూనే ఉంది. క్యూబన్ దేశ ప్రజలు కలిసికట్టుగా ఒకపక్క సామ్రాజ్యవాద అమెరికా అప్రజాస్వామిక విధానాలను అడుగడుగునా నిరసిస్తూనే మరోపక్క ఈ అనైతిక, అక్రమ, నేరపూరిత ఆంక్షలన్నింటిని బేషరతుగా ఎత్తివేయాలని అనేక సందర్భాలలో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ‘మా సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాన్ని గౌరవించాలి. మా దేశంపై విధించిన అనైతికమైన ఆమోదయోగ్యం కాని ఆంక్షలను ఎత్తివేయాలి. బేషరతుగా వాటన్నింటిని రద్దు చేయాలి. దేశానికి ఏ విధమైన అన్యాయం జరిగినా క్యూబన్ ప్రజలు ఎట్టి పరిస్థితులలోనూ అంగీకరించబోరు’ అని క్యూబన్ ప్రజానీకం ఎలుగెత్తి నినదించడాన్ని చాలా సృష్టంగా గమనించవచ్చు. అలాగే 'మేము సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం లేదు. ప్రతిఘటనలను, అంతిమంగా ప్రజా పోరాటాలను కొనసాగిస్తాం' అని క్యూబన్ ప్రజలు ముక్తకంఠంతో ప్రతిఘటించడాన్ని సృష్టంగా గమనించవచ్చు.

పోరాటంలో ప్రజాసంఘాలు..

సోషలిస్ట్ క్యూబాలో అరవై ఏళ్లకు పైగా నిరాటకంగా కొనసాగుతున్న అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలని ప్రదర్శనకారులు ఇటీవల న్యూయార్క్లో 'లెట్ క్యూబా లివ్' ('క్యూబాను బతకనివ్వండి') అనే నినాదంతో భారీ ప్రదర్శనని నిర్వహించడాన్ని ఆంక్షల సమాప్తానికి తుదిపోరు గాను భావించవచ్చు. ఈ ప్రదర్శనలో న్యూయార్క్ గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ వద్ద ర్యాలీలో ది పీపుల్స్ ఫోరం, ది ఆన్సర్ కోయిలేషన్, ది పార్టీ ఫర్ సోషలిజం, లిబరేషన్, డిఫెండ్ డెమొక్రసీ ఇన్ బ్రెజిల్, ది డిసెంబర్ ట్వెల్త్ మూవ్మెంట్ తదితర సంఘాలు పాల్గొని క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటించడం గమనార్హం. క్యూబాపై అమెరికా అమానుష నిర్బంధ దమనకాండలకు స్వస్తి పలకాలి అని వారు గొంతెత్తి నినదించడం విశిష్ట ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ఒకవైపు తీవ్ర ఆంక్షలతో సతమతమవుతుంటే, మరోపక్క అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డి.సి లోని క్యూబా దౌత్య కార్యాలయంపై ఈ ఆదివారం రాత్రి ఉగ్రదాడి జరగడం అత్యంత హేయకరం. ఇదే భవనంపై ఉగ్ర దాడి జరగడం ఇది రెండో సారి కావడం గమనార్హం. ఇలాంటి దాడులు ఏమాత్రం శ్రేయస్కరం కావు. ఆరు దశాబ్దాలుగా క్యూబాపై అమెరికా అమలుపరుస్తున్న అనైతిక దమనకాండలను ఇకనైనా నిలువరించాల్సిన అవసరం ఉంది. క్యూబాపై అమెరికా అసహేతుక, అర్థరహిత ఆంక్షలు ఉపసంహరించే దిశగా ఫెడల్ కాస్ట్రో పోరాటపటిమ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు కలిసికట్టుగా ప్రతిఘటిస్తూ పోరాడాల్సిన సమయం నేడు ఆసన్నమైనది.

జె.జె.సి.పి. బాబూరావు

రీసెర్చ్ స్కాలర్

94933 19690

Tags:    

Similar News