దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిణామాలు!

దేశంలో ఎమర్జెన్సీ కాలం అనంతరం రాజకీయ పరిణామాలు ప్రస్తుతం దేశంలో పునరావృతం అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. ఐదు రాష్ట్రాల్లో

Update: 2023-10-13 01:00 GMT

దేశంలో ఎమర్జెన్సీ కాలం అనంతరం రాజకీయ పరిణామాలు ప్రస్తుతం దేశంలో పునరావృతం అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 3 న తెలంగాణ సహా చత్తిస్‌గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలో ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి. ఐదు రాష్ట్రాల ప్రజల తీర్పు 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఒక మైలు రాయి అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ పార్టీ గురి అంతా ప్రాంతీయ పార్టీల మీద, వాటి నేతల మీద ఉన్నట్లు కనిపిస్తోంది. ఇండియా కూటమిని చీల్చాలని, వారి ఐక్యతను చిందరవందర చేయాలని ఇప్పుడు జరుగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే పలు కేసులలో జైల్లో పెట్టే విధంగా వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోంది.

పార్టీలలో చిచ్చుపెట్టే ప్రయత్నం!

గతంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ లోని మంత్రులు సత్యేంద్ర జైన్, తర్వాత ఉప ముఖ్యమంత్రి సిసోడియాలను, తాజాగా ఎంపీ సంజయ్ సింగ్‌ను జైలుకు పంపారు. ఇప్పుడు ఇదే మద్యం స్కాంలో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం బీజేపీ శ్రేణులు చేస్తున్నారు. అటు బీహార్‌లో ఆర్జేడి నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కుటుంబం వెంట పడ్డారు. బెంగాల్‌లో టీఎంసి నేత సీఎం మమతా బెనర్జీ బంధువు అభిషేక్ బెనర్జీ వెంట, అటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వెంట, మహారాష్ట్రలో ఎన్సీపీ నేత శరద్ పవార్, ఆయన కూతురు సుప్రియ సూలే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే వెంట, అటు తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిది స్టాలిన్, తెలంగాణలో సీఎం కేసీఆర్ కూతురు కవిత ఇలా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీల వెంట ఈడీ, సీబీఐ పడింది. ఆయా ప్రాంతీయ పార్టీలలో చిచ్చు పెట్టే పని మొదలు పెట్టాలని బీజేపీ భావిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. సమాజ్ వాది పార్టీని యూపీలో లేకుండా చేసే కుట్ర సాగుతున్నది.

తాజాగా ఈ పార్టీలను కుటుంబ పార్టీలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. నడ్డా నోట ఒక సభలో వ్యక్తమైన ఈ మాటలు బీజేపీ రాజకీయ వ్యూహకర్తలు పీఎం నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాల ఆలోచన నుంచి వచ్చినవిగానే భావించక తప్పదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు... ఇప్పుడు జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలవాలంటే అందుకు కూటమి నేతలను జైల్లో పెట్టాలి. వీరివి కుటుంబ పార్టీలని ప్రచారం చేయాలి. ఈ ప్రచార శైలి చూస్తే అదే కనిపిస్తుంది. పనిలో పనిగా బీజేపీ వారు, తమ ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకున్న పాత్రికేయుల వెంట పడ్డారు. యూట్యూబ్‌ల ఆఫీస్‌ల మీద రైడ్స్, కేసులు పెట్టడం కూడా, నిజం రాసే, మాట్లాడే పాత్రికేయులను కూడా టార్గెట్ చేయడం ఇందులో భాగంగానే పేర్కొనవచ్చు. ఈ విషయంపై సుప్రీం కోర్ట్ జోక్యాన్ని కోరుతూ, సీజేఐ చంద్రచూడ్‌కు 16 జర్నలిస్ట్ సంఘాలు లేఖ కూడా రాశాయి. వారికి నమ్మకంగా సీజేఐ ఒక్కరే కనిపిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.

అధికారం హస్తగతం చేసుకునేందుకు..

ఆమ్ ఆద్మీ పార్టీ నేత సిసోడియా అరెస్ట్ అయి 8 నెలలు కావస్తోంది, ఇతర నేతల మీద కూడా మద్యం స్కాంలో చేసిన ఆరోపణల మీద ఈడీ అసలు రుజువులు చూపించలేదు. చూపించమని కోర్ట్ అడిగింది. ఇది నెక్స్ట్ వాయిదాలో తేలే పరిస్థితి ఉంది. మొత్తానికి సుప్రీం కోర్ట్ ఇప్పుడు తనకు వ్యతిరేకంగా ఉందనే భావనతో కేంద్రంప్రభుత్వం పార్లమెంట్‌లో తనకున్న (బీజేపీ) బలమే సుప్రీం అన్నట్టుగా చట్టాలు చేస్తున్నది. ఎలక్షన్ కమిషన్ నియామకం విషయంలో అయితే నేమి, ఢిల్లీ ప్రభుత్వంకు సంబంధించి అధికారుల నియామకం, ప్రభుత్వం పవర్స్ విషయంలో సుప్రీం కోర్ట్ ఆదేశాలను కేంద్రం పాటించకుండా పార్లమెంట్‌ను ఆధారం చేసుకుని చట్టం చేసుకున్నది. మొత్తంగా కేంద్రం లో తన తానా షాహీగిరిని ఎలా నిలబెట్టుకుంటున్నదో ఇక్కడ స్పష్టం అవుతున్నది. ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహం, ఇవే పద్ధతులు, అవలంబించడం ద్వారా అధికారం హస్తగతం చేసుకునే ఆలోచన కేంద్రానికి ఉందని స్పష్టం అవుతున్నది. ఎన్నికల్లో గెలువడం కోసం ఏమైనా చేసే పరిస్థితి బీజేపీలో ఇప్పుడు కనిపిస్తున్నది. అయితే బీజేపీకి మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి తెలంగాణలో కనిపించడం లేదు, అందుకే ఇటీవల నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద పీఎం స్థాయిలో ఉండి అనవసరమైన విషయాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ఎప్పుడో కేసీఆర్, మోడీ మధ్య జరిగిన రహస్య చర్చను మోడీ బట్ట బయలు చేస్తూ కేటీఆర్‌ను సీఎం చేసే విషయం గురించి తాజా సభలో బయటపెట్టారు. నిజానికి ఇది కొత్త విషయం కానే కాదు. యావత్తు తెలంగాణ ఎరిగిన విషయం! ఈ విషయం ఎందుకు చెప్పారో తెలియదు.

60 శాతం కేసులున్న వారే!

మధ్యప్రదేశ్ లోనూ బీజేపీకి ఇదే పరిస్థితి ఉంది. అందుకే బీజేపీ వ్యూహల్లో అడుగడుగునా మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. బీజేపీ, దాని మిత్రపక్షంలో ఉన్నంత పరివార్ వాద్( కుటుంబ వాదం ) కన్నా, ఇతర విపక్ష పార్టీల్లో తక్కువే ఉన్నది. నిజానికి రీజినల్ పార్టీలలో ఆయా రాష్ట్రాల ప్రజలు నేతల పిల్లలను ప్రేమిస్తున్నారు. ఆదరిస్తున్నారు, ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. కానీ ఇది ఎంతవరకు, నిజం, అబద్దం అనేది చూడాలి. ఆ కుటుంబ పాలిటిక్స్ పేరిట వచ్చిన వారు అవినీతి, అక్రమాలకు పాల్పడడం, ఇతర సంఘ, సమాజ వ్యతిరేక, అధికార దుర్వినియోగంకు పాల్పడడం అనేది సహించరాని విషయం! అయితే పెద్ద స్కాంలో ఉన్న హేమంత్ బిస్వ శర్మను బీజేపీలో చేర్చుకుని సీఎం చేయడం, మహారాష్ట్ర లో ఈడీ కేసుల్లో ఉన్న ఏక్ నాథ్ షిండేకు, ఆయన అనుచరులకు మద్దతు ఇచ్చి షిండేను సీఎం చేయడం, వేల కోట్లు స్కాంలో ఉన్న అజిత్ పరివార్‌ను ఉప ముఖ్యమంత్రి, నారాయణ్ రాణేను కేంద్ర మంత్రి, జ్యోతిరాదిత్య సింధియాను కేంద్ర మంత్రులు చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీలో 60 శాతం క్రిమినల్ కేసుల్లో, అవినీతి కేసులలో ఉన్నవారే. ఎన్నికల్లో వీరి అఫిడవిట్‌లు చూస్తే స్పష్టం అవుతుంది.

హోమ్ మంత్రి అమిత్ షా కొడుక్కు ఏమి అర్హత ఉందని బీసీసీఐలో ఉన్నత పదవి ఇచ్చారు? నలుగురు రైతులను, ఒక జర్నలిస్టును తమ కారుతో ఢీ కొట్టించి చంపించిన మీ కేబినేట్ మంత్రి మీద చర్యలు ఉండవు, గోలి మారో సాలోంకు అని ఒక సామాజిక వర్గం వారిని దూషించిన కేంద్ర మంత్రిని ఇంకా కొనసాగిస్తారు. అంతర్ జాతీయ కుస్తీ బిడ్డల మీద లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్న బీజేపీ ఎంపీని ఒక్క మాట అనరు. ఎందుకు చెప్పండి మోడీజీ? ఒకరి మీద వేలెత్తి చూపే ముందు తమ గుండె మీద ఒక్కసారి చెయ్యి వేసుకుని చూసుకోవడం మంచిది! విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని విపక్షాలను, ప్రశ్నించే వారిని జైల్లో పెడితే ఎమర్జెన్సీలో ఆ తర్వాత ఏమి జరిగిందో ఒక్కసారి స్మరించుకుంటే మంచిది. అప్పటి ఇప్పటి పాలనకు పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు! అందుకే గతం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి! ఏది ఏమైనా ప్రస్తుతం దేశంలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా స్పష్టంగా రాజకీయ పార్టీల పరిస్థితి ప్రజల్లో ఎలా ఉందో స్పష్టత ఇస్తూ... దూద్ కా దూద్, పానీకా, పానీ లా భవిష్యత్తు చిత్రాన్ని ముందుంచనున్నాయి!

ఎండి.మునీర్

సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు,

99518 65223

Tags:    

Similar News