ఉగ్రవాదం అగ్రరాజ్యాల చలువే!

Terrorism is increasing because of america

Update: 2023-10-11 23:30 GMT

ఇజ్రాయెల్‌పై హమస్ తీవ్రవాద సంస్థ దాడి ఫలితంగా వందలాది పౌరులు ప్రాణాలు కోల్పోవడం, కొనసాగుతున్న ఇజ్రాయెల్ ప్రతిదాడిలో అంతే స్థాయిలో గాజా పౌరుల ప్రాణాలు పోవడం అత్యంత బాధాకరం. ఈ భీకర పోరు కేవలం ఆయా దేశాల మధ్యనున్న జాతి వైరానికి దర్పణం కాదు. అగ్రరాజ్యాల స్వార్థానికి, వారి స్వంత లాభాల కోసం ఉన్న మంటల్లో పోస్తున్న ఆజ్యానికి కొండ గుర్తు. ఏడు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ పుట్టుక మొదలు పాలస్తీనాతో సమరం మొదలైంది. పాలస్తీనాను దశల వారీగా ఆక్రమిస్తూ, దాడి చేస్తూ ఇజ్రాయెల్ తన బలం నిలుపుకుంటుంది. అందుకు అమెరికా మద్దతు పుష్కలంగా ఉంది. దానికి వ్యతిరేకంగా పాలస్తీనాలో హమస్ తీవ్రవాద సంస్థ పుట్టుకొచ్చింది. దాని ప్రయత్నాలు అది చేస్తోంది. రక్షణ, ఆయుధ సంపత్తి, అగ్ర రాజ్య స్నేహాలు, అంతర్గత నిఘా వ్యవస్థ బలంగా ఉన్న ఇజ్రాయెల్‌పై ఈ స్థాయి దాడి చెయ్యడం హమస్‌కి దుస్సాహసం. అయితే అక్కడ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి, అధ్యక్షుడి‌పై దేశంలో కొనసాగుతున్న వ్యతిరేక వాతావరణం కారణంగా ఇదే సరైన సమయమని భావించి అమానుష దాడికి ఒడిగట్టింది. గత కొన్నేళ్లుగా తమ దేశంపై జరుగుతున్న ఆక్రమణలకు, దాడులకు ప్రతీకారంగా తలచింది. పైగా సౌదీ అరేబియాతో బలపడుతున్న స్నేహాన్ని తమకు ముప్పుగా భావిస్తూ వచ్చింది. మరోవైపు ఇదే అదనుగా ఇరాన్, లెబనాన్‌లు హమస్ కు మద్దతుగా నిలిచాయి. అమెరికా ఇజ్రాయెల్‌కు బాసటగా నిలబడగా, చైనా, రష్యాలు మౌనం వహించాయి. కొండొకచో పాలస్తీనా తరపున ఉన్నట్టు సంకేతాలు ఇస్తాయి. ఇలా అగ్ర రాజ్యాలు తమ స్వంత లాభాలకు అనుకూలంగా మంటల్ని ఎగదోస్తుంటాయి. సమస్యల్ని చావనివ్వవు. మంటల్ని ఆరనివ్వవు. ఫలితంగా ప్రపంచ శాంతి ఒక భ్రాంతిగా మిగిలి పోతుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య మూలాల్లోకి పోకుండా పైపైన పరిష్కారాలు సాధ్యం కావు. అణిచివేత, అతివాదం ఒక నాణేనికి రెండు వైపులు. దీర్ఘకాలిక పరిష్కారాలు వెదకాల్సిన సమస్యలు. ప్రపంచ దేశాలు ఏదో ఒక వైపు నుండి కాకుండా పై నుండి చూస్తేనే అసలు సమస్య అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ మూల అశాంతి ఉన్నా అది అంతటికీ ప్రమాదమే. ఇప్పుడు చూస్తున్నది అదే.

డా. డి.వి.జి.శంకర రావు 

మాజీ ఎంపీ, పార్వతీపురం

94408 36931

Tags:    

Similar News