గుండె పగిలిన… నిరుద్యోగి

గుండె పగిలిన… నిరుద్యోగి... telangana unemployee Heartbroken because of tspsc paper leak

Update: 2023-03-20 19:30 GMT

త్మగౌరవం నీళ్లు నిధులు నియామకాల నినాదంతో జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మిగతా అంశాల్ని పక్కనపెడితే నియామకాల విషయంలో మాత్రం తెలంగాణ నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో ఆరోజు తెలంగాణ యావత్తు ఉద్యమంలో బరిగీసి కొట్లాడారు. తెలంగాణ ఉద్యమ నాయకత్వం కూడా ఉద్యమ సమయంలో ఇదే విషయాన్ని ప్రధానంగా వల్లె వేశారు. వేల సంఖ్యలో ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రమొస్తే ఆంధ్రా ఉద్యోగులందర్ని ఇక్కడినుంచి పంపించి వేస్తే, ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేస్తే తెలంగాణా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని అప్పటి ఉద్యమ నాయకత్వం తెలంగాణ ప్రజలను నిరుద్యోగులను ఆశలకు గురిచేసింది.

90 వేల పోస్టులుగా చూపిస్తూ..

పసిపిల్లల నుంచి పండుముసలి వరకు మొత్తం తెలంగాణ సమాజం చేసిన ఎడతెరిపిలేని పోరాట ఫలితంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల్లో అన్యాయం జరిగిందని కొత్తగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో అయినా ఉద్యోగాలు వచ్చి తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని భావించారు. తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడినుంచి వెళ్ళిపోతే ఆ ఖాళీలను భర్తీచేస్తే చాలా ఉద్యోగాలు వస్తాయని భావించారు. కానీ తీరా చూస్తే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడినుంచి ఆంధ్రకు వెళ్లిపోయిన ఉద్యోగుల సంఖ్య చాలా స్వల్పం. అయినా సరే ఖాళీగా ఉన్న ప్రతీ ఉద్యోగాన్ని తొందరగా భర్తీ చేస్తారని తెలంగాణా సమాజం అనుకున్నది కానీ అలా జరగలేదు.

తెలంగాణ రాష్ట్రంలో అసలు మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న డేటా కోసం రాష్ట్ర ప్రభుత్వం బిస్వాల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ కాలయాపన కోసమే అని చాలామంది భావించారు. అయినా మొత్తానికి బిస్వాల్ కమిటీ తెలంగాణాలో మొత్తం ఒక లక్ష తొంభై ఒక్కవేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చింది. ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకత్వం ఊరించిన సంఖ్యతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ఈ ఖాళీలైనా తొందరగా భర్తీ చేస్తారని ఆశించారు. కానీ తర్వాత జరిగిన పరిణామాల వల్ల కేవలం తొంభై ఒక్క వేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని అందులో పదకొండు వేలమంది కాంట్రాక్టుగా పనిచేస్తున్నారని మిగతా ఎనభై వేలకు పైగా ఉద్యోగాల్ని అతి త్వరలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా నిండు సభలో ప్రకటించారు. పీఆర్సీ నివేదిక ప్రకారం లక్షా తొంభైవేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని భావించిన అనేకమందికి కేవలం తొంభైవేల ఉద్యోగాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయన్న ప్రకటన ఆశ్చర్యం, అసంతృప్తి కల్పించినప్పటికీ ప్రకటించిన తొంభైవేల ఉద్యోగాలు అయినా తొందరగా భర్తీ చేస్తారని అనుకున్నారు. కానీ శాఖలవారీ ఖాళీల సంఖ్య పేరుతో, అనుమతుల పేరుతో జోనల్ వ్యవస్థ సాకుతో రాష్ట్రమేర్పడిన కొత్తలో జరగాల్సిన నియామకాల ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తిగా జరగలేదు.

పిడుగులాంటి వార్త తెలిసి..

గత సంవత్సర కాలంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ మొదలుకొని వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ నిరుద్యోగ సమాజంలో ఆశలు చిగురించాయి. వరస నోటిఫికేషన్లు, వరస పరీక్షలతో తెలంగాణా నిరుద్యోగ యువత మొత్తం ప్రిపరేషన్‌లో మునిగిపోయింది. దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఏదో ఒక పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నారు. అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్‌షుక్ నగర్ లాంటి కోచింగ్ సెంటర్‌లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ తీసుకుంటున్నారు. తమ తల్లిదండ్రులు రక్తాన్ని స్వేదంగా మలిచి సంపాదించి పంపించే డబ్బుతో చదువుకుంటున్న చిన్న పేద కుటుంబాల నుంచి వచ్చిన నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం ఎలాగైనా సాధించాలనే కసితో ప్రైవేట్ ఉద్యోగాల్ని సైతం వదిలేసి ప్రిపేర్ అవుతున్నవారు, అప్పటికే చిన్నచిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా కూడా గ్రూప్ 1 లాంటి ఉన్నత ఉద్యోగం సాధించాలన్న కోరికతో సెలవులు పెట్టి చదువుతున్నవారు, సెలవు ఇవ్వకుంటే విధులకు గైర్హాజరు అయ్యి శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు భరించి మరీ సన్నద్ధం అవుతున్న వారు కూడా అనేకమంది ఉన్నారు.

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ ప్రకటించిన ఉద్యోగ నియామకాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పరీక్షలు జరిగాయి. గ్రూప్ 1 పరీక్షలకు 25,050 మంది అర్హత కూడా సాధించారు. ఇలాంటి తరుణంలో మార్చ్ 11న సాయంత్రం నిరుద్యోగులకు పిడుగులాంటి వార్త తెలిసింది. మార్చ్ 12 న జరగాల్సిన టిపిబిఓ పరీక్ష రద్దు అని దీనికి కారణం పేపర్ లీక్ అని. ఇది ఒక పరీక్షకో రెండు పరీక్షలకో పరిమితం అనుకున్నారు. కానీ రెండు రోజులు ముగిసేసరికి అది మొత్తం అన్ని పరీక్షలకు చుట్టుకుంది. జరిగిన పరీక్షలు, జరగాల్సిన పరీక్షలు మొత్తం రద్దయ్యాయి. నిజాయితీగా కష్టపడి చదివి అమ్మానాన్నల కళ్ళలో ఆనందం చూడాలనుకునే ప్రతి నిరుద్యోగి గుండె పగిలింది. ఇప్పుడు అన్ని పరీక్షలు రీషెడ్యూల్. ఇక మళ్ళీ చదవాలి. మళ్ళీ రూమ్ రెంట్. మళ్ళీ హాస్టల్ ఫీజ్. మళ్ళీ కుటుంబానికి దూరం. అయినా సరే భరిద్దాం అనుకుంటే తరువాత జరిగే పరీక్షలు అయినా నిజాయితీగా జరుపుతారు అనే భరోసా మాత్రం తెలంగాణా నిరుద్యోగ సమాజం కోల్పోయింది.

పటిష్ట వ్యవస్థ అవసరం

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంటర్ మీడియట్ పరీక్షల గ్లోబరీనా మూల్యాంకనం లాంటి అకడమిక్ విషయాల నుంచి, ఉద్యోగాల నియామకాల వరకు ప్రతి విషయం వివాదాస్పదమవుతూనే ఉంది. ప్రతీ నోటిఫికేషన్ ఏదో రకంగా కోర్టు మెట్లు ఎక్కడం వాయిదాలు పడడం తరువాత సవరించుకోవడం జరుగుతూనే ఉంది. దీనివల్ల నిరుద్యోగుల విలువైన సమయం వృధా అవుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి సన్నద్ధం అయ్యే అభ్యర్థులు ఆర్ధికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీని నివారణకు పటిష్ట వ్యవస్థ అవసరం. యూపీఎస్సీ లాంటి కమిషన్ సంవత్సరానికి ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది. దాని ప్రకారం నియామకం చేపడుతోంది. ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వదు. కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా ఖచ్చితమైన వ్యవస్థ ఉంది. ఇలాంటి ఆదర్శ నియామక ప్రక్రియను అనుసరించాలి. అవసరమైతే కొత్త సంస్కరణలు తీసుకురావాలి. ముఖ్యంగా నిరుద్యోగ సమాజంలో నెలకొన్న అపోహాలు తొలగించాలి. నిజాయితీగా ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థుల కుటుంబాల్లో వెలుగులు నింపాలి. అప్పుడే ప్రభుత్వంపై కమిషన్‌పై ఉన్న అనుమానపు తెరలు తొలిగిపోతాయి.

- పరమేష్ అనంగళ్ల

76720 30609

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News