తొమ్మిదేండ్ల ప్రగతి తెలంగాణ!

Telangana made remarkable progress in 9 years

Update: 2023-06-02 00:30 GMT

ప్రగతి తెలంగాణ నేడు పదో పుట్టిన రోజు జరుపుకుంటున్నది. ఒకప్పుడు గుక్కెడు నీళ్లకు, తవ్వెడు తిండిగింజలకు తండ్లాడిన తెలంగాణ.. నేడు అనేక అంశాల్లో ఆదర్శంగా నిలుస్తూ దేశానికే బువ్వ పెడుతున్నది. దశాబ్ది ఉత్సవాల వేళ తెలంగాణ స్వరాష్ట్ర తొమ్మిదేండ్ల పాలనను మరొక్కసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం అంశాలను స్థూలంగా పరిశీలిస్తే.. స్వరాష్ట్ర పాలన ఎలా ఉన్నదనేదానిపై ఒక స్పష్టత వస్తుంది.

అభివృద్ధి..

ఆర్థికంగా, సామాజికంగా, భౌతికంగా పురోగతి సాధించడమే అభివృద్ధి. తెలంగాణ ఏర్పడినప్పటితో పోలిస్తే.. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ బడ్జెట్​ కంటే నేటి తెలంగాణ బడ్జెటే ఎక్కువ. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన సంస్కరణలతో అనూహ్యమైన రికార్డులు నెలకొల్పుతున్నది. సొంత పన్నుల రాబడిలో ఏటికేడు గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు నాటికి తెలంగాణ పన్ను రాబడి రూ.37,391 కోట్లు. కానీ, గత తొమ్మిదేండ్లలో ఇది మూడు రెట్లు పెరిగి ప్రస్తుతం రూ.1,26,617 కోట్ల రాబడి వచ్చింది. అలాగే, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, గత 9 ఏళ్లలో అనేక ఆస్తులను ప్రభుత్వ ఖాతాలో చేర్చింది. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ భవనాల విస్తీర్ణం కేవలం 60 లక్షల చదరపు అడుగులుగా ఉండగా.. ఇప్పుడు అది 2.30 కోట్ల చదరపు అడుగులకు పెరిగింది. దీనిని బట్టే తెలంగాణ అభివృద్ధిని అంచనా వేయవచ్చు. సీఎం కేసీఆర్ 10 జిల్లాలను 33కు పెంచి ఆయా జిల్లాల అవసరాల కోసం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మించారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్​ వినియోగంలో తెలంగాణ ఈరోజు దేశంలోనే నెంబర్‌ వన్​.

సంక్షేమం.. ఆదర్శం

సంక్షేమం విషయంలో తెలంగాణ మిగతా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. కుల, మత, ప్రాంత, వర్గ భేదాలు లేకుండా సబ్బండ వర్గాలకు ఈ రోజు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. కేసీఆర్​ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు, దళితబంధు, కంటి వెలుగు, డబుల్​‌ బెడ్‌‌రూం ​ఇండ్లు, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, ఉచిత చేపపిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు చేయూతనిస్తున్న కేసీఆర్​సర్కారు.. గృహలక్ష్మి పథకంతోపాటు కులవృత్తులు చేసుకునే వారికి రూ.లక్ష చొప్పున సాయం చేయబోతున్నది. ఇలా పదుల సంఖ్యలో సంక్షేమపథకాలు.. కోట్లలో లబ్ధిదారులు ఈ దేశంలో మరే రాష్ట్రంలోనూ ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు.

విద్యలో గుణాత్మక మార్పు

ఇంగ్లిష్‌ మీడియం చదువులు, వేలాది గురుకులాల స్థాపన, అత్యాధునిక గ్రంథాలయాలు, బోధన, బోధనేతర పోస్టులకు కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, మహిళా వర్సిటీ, సంస్కృత వర్సిటీ ఇలా విద్యా వ్యవస్థలో కేసీఆర్​ సర్కారు గుణాత్మక మార్పులు తీసుకొచ్చారు. సర్కారు స్కూళ్లల్లోని 1-10 తరగతుల 26 లక్షల పైచిలుకు విద్యార్థులకు ఏటా రూ.52 కోట్లతో ఉచితంగా బుక్స్, 2 జతల యూనిఫాంలు ఉచితంగా ఇస్తున్నది. ఉన్నత విద్యలోనూ, జాతీయంగా లక్ష విద్యార్థులకు 28 కాలేజీలే ఉండగా, తెలంగాణలో లక్ష మందికి 50 కాలేజీలున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో 7.4 శాతానికి తగ్గకుండా విద్యకు నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర సర్కారు సగటున ఒక్కో విద్యార్థిపై రూ.50 వేలకు పైగా ఖర్చుచేస్తున్నది. ఇక సర్కారు బడుల స్వరూపాన్ని సమగ్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడత పూర్తిచేసుకుంది. పెద్దఎత్తున ప్రారంభించిన గురుకులాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వాటిల్లో చదివిన విద్యార్థులకు ఐఐటీ, నీట్​ర్యాంకులు వస్తున్నాయి.

వైద్యంలో భేష్​

తెలంగాణ ఏర్పడక ముందు వైద్యం అంటే.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్​ఇలా మూడు పెద్దాస్పత్రులే కనిపించేవి. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మౌలిక వసతులు పెంచడంతోపాటు జిల్లా ఆస్పత్రులను సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్స్‌గా మార్చింది. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు తెలంగాణలో అన్ని రకాల వైద్య సేవలు ఇప్పుడు పేదవారికి అందుబాటులోకి వచ్చాయి. అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా డయాలసిస్ పేషెంట్లకు ఉచిత బస్సు పాసు, పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 100కు 63 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్‌తో పాటు గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా ప్రభుత్వం ఇస్తున్నది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా రూ.11,440 కోట్ల బడ్జెట్‌ పెట్టింది, తలసరి వైద్యబడ్జెట్‌ కేటాయింపుల్లో మొదటిస్థానం తెలంగాణ ప్రభుత్వానిదే. నీతిఆయోగ్‌ ఆరోగ్య సూచీలోనూ రాష్ట్రానిదే అగ్రస్థానం. 8 మెడికల్‌ కళాశాలలు ప్రారంభించి కొత్త చరిత్ర సృష్టించింది. మానవతా కోణంలో రోగి సహాయకులకు రూ.5 కే భోజనం పెడుతున్నది. హైదరాబాద్​ మూడు పక్కల 3 సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపనతోపాటు, వరంగల్​ హెల్త్​ సిటీ నిర్మాణం చేపడుతోంది. ఈ హాస్పిటల్స్​కూడా అందుబాటులోకి వస్తే తెలంగాణ దేశంలోనే హెల్త్‌లో నెంబర్‌ వన్​కావడం ఖాయం.

వ్యవసాయం పండుగ

వ్యవసాయం అంటే దండగ అనే రోజుల నుంచి వ్యవసాయం అంటే పండుగ అనే స్థితికి తెచ్చారు సీఎం కేసీఆర్. ​రైతుబంధు, రైతు బీమా, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి విప్లవాత్మక కార్యక్రమాలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేస్తూ, రైతుల పంట పెట్టుబడి తిప్పలు తప్పేలా చేసింది. దీనిని ఐక్యరాజ్యసమితి సంస్థ ప్రపంచ ఆహార సంస్థ(FAO) 2018–19లో ప్రపంచంలో రైతులకు ఉపయోగపడే మేటి 20 పథకాల్లో రైతుబంధు, రైతుభీమాను గుర్తించడం గర్వకారణం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్​ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రూ.1.59 లక్షల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి సాగునీరు చింత తీర్చింది. దీంతో ధాన్యం దిగుబడులు పెరిగాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి వానాకాలం, యాసంగి కలిపి 49.63 లక్షల ఎకరాల్లో ఉన్న వరిసాగు.. నేడు ఒక్క యాసంగిలోనే 53.78 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. రెండు సీజన్లలో కలిపితే కోటి ఎకరాల్లో వరి సాగు అవుతోంది. దాదాపు మూడు కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది. ఇప్పటి వరకు లక్ష 21 వేల కోట్లతో 671.22 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ చేపట్టింది. అలాగే రూ.32,700 కోట్లతో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసింది. అలాగే రుణమాఫీ, రైతుభీమా అందజేస్తోంది. వాటితో పాటు రైతువేదికలు నిర్మించింది. మిషన్ కాకతీయ పథకంతో చెరువులు పునరుద్ధరిస్తే.. భూగర్భజలాలు పెరిగి సాగు విస్తీర్ణంపై సానుకూల ప్రభావం చూపింది. దేశంలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్దఎత్తున చేదోడు, వాదోడుగా నిలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను నింపడంతోపాటు పెద్ద ఎత్తున పెట్టుబడులను, పరిశ్రమలను తెలంగాణకు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను పెంచింది. కులవృత్తులకు చేయూత నిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తున్నది. ఇది కదా తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రగతి. అందుకే దశాబ్ది తెలంగాణ పులకరిస్తున్నది.. భాగ్య​విధాత బాపు కేసీఆరేనని!

బచ్చు శ్రీనివాస్

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు

93483 11117

Also Read: అమరుల తెలంగాణనా.. కల్వకుంట్ల తెలంగాణనా?

Tags:    

Similar News