దేశానికి తెలంగాణ మణిదీపం

భారత ప్రజల చైతన్యశక్తిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమ అడుగులు పడుతున్నాయి. 60 లక్షల గులాబీ సైన్యం 'దేశం కోసం' అధినేత అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదులుతున్నరు.

Update: 2022-05-24 18:30 GMT

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కేసీఆర్‌ను మించిన లౌకికవాది లేడు. ఇప్పటికే 'దేశం' రూట్ మ్యాప్ సిద్ధం చేసిండు. ప్రజల జీవన ప్రమాణాలు, ప్రాంతం, సంపద, వనరులు, పైసా, భౌగోళిక స్థితి, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఇలా అనేక అంశాలపై మేధో మథనం జరిగింది. 'విద్వేషం, విధ్వంసం, మతం, కులం, ఇది తినాలి, అది తినాలి' అంటూ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు నాయకులు, దేశ ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత ప్రజలను జాగృతతపరిచే జన జీవన పాటలు రానున్నాయి. నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు డప్పు దరువు సిద్దమైంది.

భారత ప్రజల చైతన్యశక్తిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమ అడుగులు పడుతున్నాయి. 60 లక్షల గులాబీ సైన్యం 'దేశం కోసం' అధినేత అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదులుతున్నరు. మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థి, యువత, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎలా పాలు పంచుకున్నారో నేడు 'దేశం కోసం' కేసీఆర్ వెన్నంటే ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో ఏం జరిగింది? ఏం జరుగుతున్నది? దేశం ఎటు పోతున్నది? గమనించాలి.

మహానుభావులు ఎందరో వారి జీవితాలను ధారపోసి ఈ దేశాన్ని నిలబెట్టారు. వారు నిలబెట్టిన దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి? ఎట్లా ముందుకు తీసుకుపోవాలి? అనే ఆలోచన చేయాలి. ఎందరో ప్రధానులు వచ్చారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఓట్లు, సీట్లు, పదవీ వ్యామోహాలు. అధికారం, అవినీతి, దోచుకోవడం, పంచి పెట్టడం. దొంగలను కాపాడటం. ఇది తప్ప 'దేశంలో ప్రజలు ఉన్నారు. మనకు అధికారం ఇచ్చారు. వాళ్ల కోసం పని చేయాలి. వారి బాగులు చూడాలి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి' అని ఎవరూ ఆలోచన చేయలేదు? దేశంలో ప్రజలకు కావాల్సిన సంపద, జలం, వనరులు, పుష్కలంగా ఉన్నాయి. ప్రజల సామూహిక లక్ష్యం కూడా నెరవేర్చని కంపు రాజకీయాలను ఇంకా చూస్తూ ఊరుకుందామా?

దురాగతాలను రూపుమాపాలి

'మతమనే మహమ్మారి దేశాన్ని పట్టి పీడించడమేనా? ఎన్నేండ్లు ఈ దురాగతాలు.? ఇట్లే ఉందామా? ఎవరో ఒక్కరు ముందుడుగు వేయకపోతే ముప్పు తప్పదు. తెలంగాణ కోసం 20 ఏళ్ల కింద సిద్దిపేట నుంచి బయలుదేరే ముందు ఎన్నో ఆలోచనలు చేసినం. విస్తృత మేధో మథనం తరువాత, ప్రజల ఆకాంక్షల ఎజెండాతో గులాబీ జెండా ఎగిరింది. ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. దీని వెనుకాల ఎంతో కఠోర శ్రమ ఉంది.

ప్రజలకు ఏది కావాలో అదే చేస్తున్నం. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ఈ దేశానికి దశ-దిశను చూపించే స్థాయికి ఎదిగినం. దేశ ప్రజలు కూడా మనలాగే సంతోషంగా, మంచిగా బతకాలంటే మనమే ముందుకు పోవాలి. దేశం కోసం కొట్లాడాలి. ఏకీకరణలు, ఫ్రంట్లు, టెంట్లు, పెంటకుప్పలు కాదు. సరికొత్త ఎజెండాతో జాతీయ రాజకీయాలలో తెలంగాణ శక్తి ప్రధాన పాత్ర పోషించాలి' అని తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకం. కొందరు 'దేశం వెలిగిపోతోంది' అంటున్నారు. దేశం చీకటిలో ఉందని కేసీఆర్ చెప్పింది నిజం. దేశ ప్రజలకు తెలియని ఎన్నో నిజాలు ఉన్నాయి.

సమాధానం చెబుతారా?

అన్ని వనరులు, సంపద కలిగిన దేశంలో మహిళలు తిండి కోసం తిప్పలు పడుతున్నరు. బీజేపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేశంలో అంధకారం నెలకొంది. మన రాష్ట్రంలో కరెంట్ కోత లేదు. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్నప్పటికీ, 2 లక్షల మెగావాట్ల విద్యుత్ వాడుకోలేని, చాతకాని కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలి? ఈ దేశానికి యువశక్తి కీలకం. 13 కోట్ల మంది భారతీయులు విదేశాలలో ఉన్నారంటే మనకు సిగ్గుచేటు కాదా? మతం పేరుతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీ విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మోడీని దించి ఇంకెవరినో గద్దెనెక్కించడం కాదు, ప్రజల సామూహిక లక్ష్యం కోసం సరికొత్త అడుగులు పడాలనేదే కేసీఆర్ ఆలోచన.

మోడీ 'మన్ కీ బాత్' కే పరిమితం. అంతకు మించి చేసిందేమీ లేదు. ఎవరో ఒకరు అడుగు ముందుకు వేయకపోతే ఈ దేశం ఇంకా క్లిష్ట పరిస్థితులలోకి వెళుతుంది. ఆ అడుగు తెలంగాణ నుంచి కేసీఆర్ వేసిండు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కేసీఆర్‌ను మించిన లౌకికవాది లేడు. ఇప్పటికే 'దేశం' రూట్ మ్యాప్ సిద్ధం చేసిండు. ప్రజల జీవన ప్రమాణాలు, ప్రాంతం, సంపద, వనరులు, పైసా, భౌగోళిక స్థితి, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఇలా అనేక అంశాలపై మేధో మథనం జరిగింది. 'విద్వేషం, విధ్వంసం, మతం, కులం, ఇది తినాలి, అది తినాలి' అంటూ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు నాయకులు, దేశ ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత ప్రజలను జాగృతతపరిచే జన జీవన పాటలు రానున్నాయి. నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు డప్పు దరువు సిద్దమైంది.

చిటుకుల మైసారెడ్డి

జర్నలిస్ట్, సిద్దిపేట

94905 24724

Tags:    

Similar News