సంక్షోభం నుండి సంక్షేమం వైపు..
Telangana is moving towards welfare from crisis
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే తెలంగాణ ప్రజలు ఎక్కువగా సంతోషపడ్డారు. ప్రజలు కారు చీకట్లను తమ హస్తాలతో తొలగించారు. గడీల దొరల కోటలకు బీటలు పడగానే నిర్బంధం నుండి స్వేచ్ఛ వైపు, నేల నుండి నింగికెగిరిన పక్షి వలె ప్రజాస్వామ్యం విరాజిల్లింది.
అడ్డగోలుగా దోచుకున్న ప్రజాధనంతో, మితిమీరిన అహంకారంతో మళ్ళీ అధికారం మాదేనని విర్రవీగిన వారిని ఓడించిన ప్రజలను చూస్తే భారత దేశంలో ప్రజాస్వామ్యం ఎప్పటికీ పదిలంగా ఉంటుందని నమ్మకం కలుగుతుంది... రాజకీయాలు చెలాయించాలంటే ఏ పార్టీకైనా, నాయకుడికైనా ధనమే ఇంధనం. కానీ ప్రజా వ్యతిరేకత ముందు ఎంతటివారైనా తలవంచాల్సిందే అని మరొకసారి ఋజువైంది.
అవినీతిమయంగా గత పాలన
తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో దొరికిన కాడికి దోచుకున్నారు. ఇసుక, మట్టి, మొరం, గ్రానైట్ లాంటి ఇతర సహజ వనరులను అనుమతులు లేకుండా పరిమితికి మించి మైనింగ్ చేశారు. దాదాపు ప్రతి రంగంలో, ప్రతి ప్రాజెక్టులో అందినంత మేర కమిషన్ పుచ్చుకున్నారు. బ్రహ్మాండంగా కట్టాం అని చెప్పిన కాలేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ భారీ వరదలు వస్తే కొట్టుకుపోయే ప్రమాదంలో ఉన్నాయి. ధరణి పేరిట ప్రభుత్వ భూమిని తమ అనునీయులకు అప్పనంగా కట్టబెట్టారు. గ్రామాల్లో భూ తగాదాలకు తెరలేపారు. ఇక పేపర్ లీకేజీలు, లిక్కర్ స్కాములు అంటూ గులాబీ ప్రభుత్వం అవినితీ ప్రభుత్వమయింది. పసిగుడ్డు లాంటి తెలంగాణ అంటూ... బుడ్డ గోచి కూడా లేకుండా చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు మునిగిపోయింది. అడ్డగోలు అవినీతితో ప్రస్తుతం కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఈ ఆర్థిక సంక్షోభానికి టిఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన ప్రజాధన దుర్వినియోగమే కారణం.
అప్పుడే అభివృద్ధి ఆగమైందా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. సెక్రటేరియట్, ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయి. ప్రజలకు, పాలకులకు మధ్య దూరం తగ్గింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు గడవకముందే, ఆరు గ్యారెంటీల అమలు ప్రక్రియ మొదలెట్టింది. అలాగే నాడు విడతల వారీగా లేదా నెల మధ్యలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన పరిస్థితి నుండి నేడు మొదటి వారంలో జీతం పొందేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రజా విజయంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, నిరుద్యోగుల పాత్ర చాలా కీలకం. నిరుద్యోగులైతే కాలుకు బలపం కట్టుకొని మరి ఇంటింటికి తిరిగారు. తమ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చి తాము కోరుకున్న విధంగా టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయించగలిగారు. త్వరలో కొత్త బోర్డుతో ఉద్యోగ నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతుండగా, ఆర్టీసీ కార్మికుల కారుణ్య నియామకాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇక తొమ్మిదిన్నర ఏండ్లు సంక్షేమ పథకాలను అటకెక్కించిన బీఆర్ఎస్, సంక్షేమ పథకాలు ఈ క్షణమే అమలు చేయాలని ఉద్ఘాటించడం హాస్యాస్పదం. ప్రభుత్వం స్థిరత్వం చెందడానికి సమయం పడుతుందని సామాన్యుడికి కూడా జ్ఞానం ఉంటుంది. కానీ కొద్ది రోజులకే ఆకాశం నేలపై పడ్డట్టుగా, అభివృద్ధి ఆగమైనట్లుగా ఆరోపించడం విపక్ష నేతల రాజకీయ అపరిణతికి నిదర్శనం. ఎంతోమంది అధికారం కోల్పోయినప్పుడు హుందాగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు అలాంటి వారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
అద్దాల మేడలు కాదు పౌరుడి నైతిక అభివృద్ధి నిజమైన అభివృద్ధి అని పేర్కొన్న అంబేద్కర్ గారి మాటలను ఆదర్శంగా తీసుకుని కొత్త ప్రభుత్వం, ప్రజలకు మౌలిక వసతులను కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలను అందించడమే కర్తవ్యంగా పెట్టుకోవాలి. దీనికి వివిధ కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడంతో పాటు... అవినీతి సొమ్మును బయటకు లాగి తిరిగి ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్నది.
-బుర్ర రవితేజ గౌడ్
టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్.
9493109462