మా సమస్యలు పరిష్కరించండి!

Telangana government should solve the problems of ex-servicemen!

Update: 2024-03-21 01:00 GMT

నీళ్లు - నిధులు - నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమంలో ప్రభుత్వాలు ఎందుకు చులకనగా చూస్తున్నాయి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడేళ్ల తర్వాత 2017 జనవరి 17న అసెంబ్లీ సాక్షిగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, యుద్ధభూమిలో వీరమరణం చెంది అవార్డులు పొందిన వారికి కొంత ఆర్థిక సహాయం పెంచడమైతే జరిగింది. అయితే గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో అలా ప్రతిఫలం పొందింది గల్వాన్ లోయలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ కుటుంబం మాత్రమే. మిగతా సైనికులను పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర సైనికుల సంక్షేమ నిధిని తీసుకెళ్ళి జాతీయ రాజకీయాల కోసం పంజాబ్ రాష్ట్ర సైనికులకు పంచిన ఘనత కేసిఆర్‌ది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ సి & డి పోస్టులలో మాజీ సైనికులకు ఉన్న 2% రిజర్వేషన్ ఇప్పటికీ కొనసాగుతోంది. అదే పక్క రాష్ట్రం కర్ణాటకలో గ్రూప్ 1,2,3,4 లో 10% రిజర్వేషన్, పంజాబ్ లో 12% అత్యధికంగా 15% రిజర్వేషన్ ఇచ్చి హిమాచల్ ప్రదేశ్ సైనికులను గౌరవిస్తున్నాయి. ఆ 2% రిజర్వేషన్ ఉద్యోగాలు కూడా SC,SC & PHC లతో సమానంగా ఉన్న 30% క్వాలిఫై మార్కులను G.O No.552022 ద్వారా జనరల్ కేటగిరిలో 40% నికి పెంచి మాజీ సైనికులకు ఉద్యోగాలు దక్కకుండా కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసింది. గత ప్రభుత్వం తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఛైర్మన్‌గా మాజీ సైనికుల సంక్షేమం కోసం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్ డీజీపీ మహేందర్ రెడ్డికి మాత్రం పదవీ విరమణ పొందగానే ప్రస్తుత ప్రభుత్వం TSPSC ఛైర్మన్‌గా నియమించింది కానీ సుమారు 17 నుండి 20 సంవత్సరాలపాటు భరతమాతకు సేవ చేసి పదవీ విరమణ పొందిన తెలంగాణ మాజీ సైనికులకు మాత్రం టీపీపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలలోనూ ఉద్యోగాలు రావడం లేదు.

అసైన్డ్ భూముల్లోనూ అన్యాయమే!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ సైనికులకు 5 లేదా 2.5 ఎకరాలను ప్రభుత్వం కేటాయించేది. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణంలో ఇల్లు లేదా 175 గజాల ప్లాట్ కేటాయించేది. గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్క కల్నల్ సంతోష్ గారి కుటుంబానికి మాత్రం జూబ్లీ హిల్స్‌లో 175 గజాల ఇంటి స్థలం కేటాయించారు తప్ప మిగతా సైనికులను పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జిల్లాలలో అసైన్డ్ భూముల పరిమాణం తక్కువగా ఉన్నదని కుంటి సాకులు చెబుతూ ప్రభుత్వ భూములలో కబ్జాలను ప్రోత్సహిస్తూ కొత్తగా అసైన్డ్ భూములు ఇవ్వకపోగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఇచ్చిన భూములపై ధరణి పోర్టల్ ద్వారా ఎన్‌వోసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది.

క్యాంటిన్ మద్యంపైనా పన్ను..

సీఎస్‌డీ క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్‌లో మాజీ సైనికులకు తక్కువ ధరకు దొరికే మద్యం మీద కూడా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ పన్ను విధించి, Tonique లాంటి మద్యం దుకాణాలకు పన్ను లేకుండా దొంగదారిన జీఓ లు ఇచ్చి పచ్చని తెలంగాణలో మద్యాన్ని ఏరులుగా పారించి, దేశ వ్యాప్తంగా మద్యం కుంభకోణాలకు తెరలేపి ఆర్థికంగా మాజీ సైనికుల పొట్ట కొట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.

ఈ శాఖపై రివ్యూ చేయరా?

ఇలా గత పదేళ్ల కేసీఆర్ పాలనలో సంక్షేమానికి దూరమై అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మాజీ సైనికులు కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా గత మూడు నెలలుగా అదే విధంగా వివక్షకు గురవుతున్నరు. గత ప్రభుత్వంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడిన సిక్స్ మెన్ కమిటీ మాజీ సైనికుల సంక్షేమం కోసం తెలంగాణలో ఒక మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం మొన్ననే సుమారు 16 కార్పొరేషన్లు వివిధ సామాజిక వర్గాల కోసం ఏర్పాటు చేసింది కానీ అందులో మాజీ సైనికుల అడ్రస్ లేదు. మాజీ సైనికుల సంక్షేమం హోంశాఖ పరిధిలో వస్తుంది. ప్రస్తుతం ఈ శాఖ ముఖ్యమంత్రి గారి వద్దే ఉన్నది కానీ గత మూడు నెలలలో ఒక్కసారి కూడా మాజీ సైనికుల సంక్షేమంపై రివ్యూ చేసింది లేదు. మా సమస్యలు విన్నది లేదు.

ఎన్ని వినతులిచ్చినా పట్టించుకోరా?

ప్రజాభవన్‌లో ఎన్ని వినతులు ఇచ్చినా ముఖ్యమంత్రి గారి అప్పాయింట్ మెంట్ కోసం సెక్రటేరియట్ చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఆఖరికి ముఖ్యమంత్రి గారి ఇంటి గేటు ముందు నిలబడినా ఎవరూ మా సమస్యను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పదవీ విరమణ పొందిన సైనికులు ప్రభుత్వ ఉద్యోగాలలో అర్హత సాధించలేక ప్రైవేట్ కంపెనీలలో సెక్యూరిటీ గార్డులుగా జీవిస్తున్నారు. కనీసం ప్రస్తుత ప్రభుత్వం అయినా మాజీ సైనికులపై దయతలచి ఈ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నాం.

బందెల సురేందర్ రెడ్డి,

మాజీ సైనికుడు,

83749 72210

Tags:    

Similar News