శ్వేత పత్రాలు... స్వేద గాత్రాలు

Telangana government Releases White Papers on BRS Debts

Update: 2023-12-24 01:00 GMT

పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన విభాగాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనికి విరుగుడుగా బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో సృష్టించిన సంపద గణాంకాలను తెరమీదికి తీసుకొచ్చింది. అయితే అధికార పార్టీ ప్రజల ముందు పెట్టిన శ్వేత పత్రాల ముందు ప్రతిపక్ష పార్టీ పెట్టిన స్వేద పత్రాలు నిలబడలేక పోతున్నాయి.

చర్చిల్ ప్రభుత్వం చరిత్రలో మొదటిసారి 1922లో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. సమస్య పైన ప్రభుత్వ వాదనలు తెలియజేస్తూనే, మరోపక్క వాటిపైన ప్రజల అభిప్రాయాలను ఆహ్వానించడం. ఏదేని విషయం సమస్య పైన నిర్ణయాలు తీసుకోవడం పరిష్కరించుకోవడం గురించి పాఠకులలో లేక చదువరులలో పూర్తి అవగాహన కలిగించేందుకు విడుదల చేసే సాధికారిక నివేదిక లేక గైడ్‌నే శ్వేతపత్రం(white paper) అంటారు. ఇవి రెండు రకాలు. ప్రభుత్వాలకు సంబంధించినవి, వ్యాపారులకు సంబంధించినవి.

జవాబుదారీగా వ్యవహారించారా?

ఎన్నికల తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో అధికారం చేపట్టిన తర్వాత ఆరు రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగాయి. ప్రధాన రంగాలైన ఆర్థిక, విద్యుత్ విభాగాల గురించిన శ్వేత పత్రాలను అధికార పార్టీ విడుదల చేసింది. బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడికి దిగినప్పటికీ, నిర్వేద శ్వేత గాత్రాలు వినిపించడం వినా, వివరణాత్మకంగా, సమంజసంగా చర్చించలేకపోయింది. ప్రభుత్వం శాసనసభలో ప్రకటించిన శ్వేతపత్రాలకు జవాబుగా, బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో తాము సృష్టించిన సంపదలో వివిధ పద్దుల కింద తెలంగాణ ఆస్తుల వివరాలను పాఠకులు లేక ప్రజల ముందుకు నివేదిక రూపంలో తీసుకు వచ్చింది. అయితే అధికార పార్టీ ప్రజల ముందు పెట్టిన శ్వేత పత్రాల ముందు ప్రతిపక్ష పార్టీ పెట్టిన స్వేద పత్రాలు నిలబడలేకపోతున్నాయి. పది సంవత్సరాల తమ పరిపాలన తీరుతెన్నులకు జవాబుదారీగా వ్యవహరించిన దాఖలాలు కనిపించకుండా పోయాయి.

ఇకపోతే రాష్ట్ర శాసనసభలో, ఒక దశలో స్పీకర్ సభా నాయకుని సమాధానం తర్వాత మాట్లాడమని టీఆర్ఎస్ పార్టీ ముందు వరుస నాయకునిగా ఉన్న కేటీఆర్‌ని పదేపదే కోరినప్పటికీ, హరీష్ రావు లేచి నిలబడి జవాబు చెప్పడానికి ఉద్యుక్తుడైన తీరుకు ఆ పార్టీలోని మిగతా నాయకులు ప్రేక్షక పాత్ర వహించి చూశారు తప్ప పల్లెత్తు మాట్లాడలేకపోయారు. ఈ దృశ్యం సభాసదులందరినే కాక టెలివిజన్ల ముందు కూర్చున్న ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి లోనుచేసింది. నిరనస పేరున మీడియా పాయింట్ వద్ద మాట్లాడడం ద్వారా ప్రతిపక్ష పార్టీ కోడిగుడ్డుపై వెంట్రుకలు పీకే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుంది. తద్వారా తెలంగాణ ప్రజలకు ఆలోచనా పరులకు ఎటువంటి సంకేతాలు పంపారో వాళ్ళే ఆత్మ విమర్శ పరిశీలన చేసుకోవాలి.

పొరపాట్లు తెలుసుకోవాల్సింది పోయి..

పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన విభాగాలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనికి విరుగుడుగా తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో సృష్టించిన సంపద గణాంకాలను తెరమీదికి తీసుకొచ్చింది. అధికార పార్టీ ఓటమి తర్వాత దాన్ని ముఖ్య నాయకులు మాట్లాడుతున్న లేక వెలుబుచ్చుతున్న అభిప్రాయాలు అసమంజసంగా ఉన్నాయి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే విజ్ఞులైన ఒక నాయకుడు లెక్కలు వేసి ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం కూలి తాము అధికారంలోకి తిరిగి వస్తామని పలకడాన్ని చూస్తే వీరి బుద్ధి మోకాళ్లలోకి వచ్చిందని సభ్య సమాజానికి ఎరుకలోకి వచ్చింది. పైగా ఆ పార్టీ అధినాయకులు పలికే బీర అసహన వాక్యాలు చూస్తే వారిపట్ల జాలి కలుగకపోగా మరింతగా సమాజాన్ని అసహనానికి లోను చేస్తుంది. తాము పరిపాలించిన తీరుతెన్నులపై, దాని ముఖ్య నాయకులు వారి ప్రవర్తన సరళిపై చూపిన ప్రతికూల పరిస్థితులు తమ ఓటమిపై కారణమయ్యాయని విషయాన్ని గ్రహించకుండా తమ సహజ అహంభావ ధోరణితో ప్రవర్తించడం, ప్రజాస్వామ్యానికి ఏమంత మంచిది కాదు.

మొన్నటి వరకు తిరుగులేని అధికారాన్ని అనుభవించి ఉన్న అధికార పార్టీ తమను తాము సమీక్షించుకొని చేసిన పొరపాట్లు పునరావృత్తం కాకుండా మసులుకోవాల్సింది పోయి, మళ్లీ కుక్కతోక వంకరలా ప్రవర్తించడం మాత్రం తెలంగాణ సమాజానికి తీవ్ర ఆక్షేపణీయం. ఇది టీఆర్ఎస్ నాయకుల పట్ల సానుభూతి వ్యక్త పరచకపోవడమే గాక వారి పతనాన్ని దిగజారుడుతనాన్ని మరింత తెలియజేస్తూ ప్రజలలో భవిష్యత్తులో పూడ్చుకోలేని లోటును కలగజేస్తున్నది . ఏతావాతా తేలిందేమంటే జూమ్లా కారు ఇప్పట్లో రిపేర్ విజయవంతంగా పూర్తిచేసుకుని రోడ్ వర్తీగా ముందుకు రావడానికి చాలా కాలం పట్టేటట్టు ఉంది.

- జూకంటి జగన్నాథం,

కవి రచయిత

94410 78095

Tags:    

Similar News