నడుస్తున్న చరిత్ర:ప్రకటనలు…చేదు నిజాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలు ఈ సారి సప్పసప్పగా ముగిసాయి. గతంలో మాదిరి రాజధానిలో వెలుగు జిలుగుల హంగామా, సర్కారీ కవులు కళాకారులు, మేధావులకు నగదు పురస్కారాల ప్రదానాల సందడి కానరాలేదు.

Update: 2022-06-06 18:45 GMT

ప్రైవేటు వ్యాపారులు రాత్రి పది దాకా ధాన్యాన్ని కొంటూ వెంటనే డబ్బులు చెల్లించడంతో రైతులు ధర తక్కువకైనా వారికి అమ్మడానికి సిద్దపడుతున్నారు. ఈ రకంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో వ్యాపారులదే పైచేయి అవుతోంది. వారు క్వింటాకు ఐదారు వందలు తగ్గించడంతో అనివార్యంగా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. పండిన 68 లక్షల టన్నుల ధాన్యంలో కేంద్రాల లక్ష్యం 56 లక్షలు కాగా, మిగితాది ప్రయివేటు వ్యాపారుల చేతులలోకి పోయింది. ఇలా చాలా పథకాలు సరైన ఫలితాలు ఈయకపోగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చావు దెబ్బ తీస్తున్నాయి. భవిష్యత్తును పణంగా పెట్టి రాయితీలు పొందాలని తెలంగాణ ప్రజలు ఆశించడం లేదు. కేసీఆర్ ఆలోచనలను దేశం ఆచరించే మాట ఏమోగానీ పరిస్థితులు మరింత దిగజారితే రాష్ట్ర ప్రజలే ఆలోచించుకొనే అవసరం వచ్చేలా ఉంది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలు ఈ సారి సప్పసప్పగా ముగిసాయి. గతంలో మాదిరి రాజధానిలో వెలుగు జిలుగుల హంగామా, సర్కారీ కవులు కళాకారులు, మేధావులకు నగదు పురస్కారాల ప్రదానాల సందడి కానరాలేదు. అక్కడక్కడా జిల్లాలలో సభలు, సమ్మేళనాలు మొక్కుబడిగానే జరిగాయి. ఈ సారి రాష్ట్రావతరణ ఖర్చంతా ప్రభుత్వం పత్రికా ప్రకటనలకే మళ్లించినట్లుంది. అప్పుడే ఎలక్షన్లు వచ్చినట్లు చాలా పత్రికలలో మూడు పూర్తి పేజీలలో ప్రభుత్వ పథకాలకు, పాలనకు సంబంధించిన వివరాలు, లెక్కలు ఉన్నాయి. ప్రకటనలో 'తెలంగాణ ఆచరిస్తున్నది, దేశం అనుసరిస్తుంది' అనే వాక్యాలు ప్రధానంగా కనిపిస్తాయి.

ఇదే పథకాల సమాచారాన్ని కొన్ని టీవీ చానళ్ల రెండవ తేదీ నుంచి ప్రసారం చేస్తున్నాయి. అవి ప్రకటనలుగా కాకుండా ఛానల్ వారి ప్రోగ్రాంలో భాగం అని వీక్షకులు అనుకొనేలా ఉన్నాయి. పత్రికా ప్రకటనలలో, టీవీ ప్రసారాలలో పేర్కొన్న ప్రభుత్వ పథకాలు, వాటి వివరణలు చూస్తుంటే 'తెలంగాణ గత ఎనిమిదేళ్లుగా గొప్పగా మున్ముందుకు సాగుతోంది' అనే సంతోషం కన్నా ఇలా అడ్డదిడ్డంగా పథకాలు అమలు చేసుకుంటూ పొతే రాబోయే కాలంలో తెలంగాణ ఏమైపోతుంది? ఆర్థికంగా దిగజారి ప్రజలు మరెన్ని చిక్కులు ఎదుర్కోవలసి వస్తుందో! అనే బెంగ, భయం కలుగక మానదు.

దినదిన గండంగానే

సంక్షేమ పథకాలు ఎప్పుడూ రాష్ట్ర ఆర్థిక స్థోమతను దాటిపోరాదు. ఉన్నదాంట్లో బతకాలి కానీ 'బంధు'లు తెచ్చి బందీ కాకూడదు. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఫలితం తక్కువుండే భారీ ప్రాజెక్టులు చేపట్టకూడదు. ప్రధానంగా వీటి కారణంగా సాధారణ పాలనకు ఎలాంటి ఆటంకం రాకూడదు. ఈ ప్రాథమ్యాలతో రాబడి, ఖర్చుని పాలకులు సమన్వయము చేసుకోవాలి. అయితే, నేటి తెలంగాణ సర్కారు చేపట్టిన శక్తికి మించిన పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దినదినగండంలోకి నెట్టేస్తున్న పరిస్థితి కనబడుతోంది. నేడు రాష్ట్ర సొంత ఖజానా ఖాళీ కాగా చివరకు అప్పు పుట్టడమే కనాకష్టం అవుతుందని ప్రజలెన్నడు ఊహించలేదు. ప్రభుత్వం గొప్పగా ప్రకటనలిచ్చుకొన్న కొన్నిటిని పరిశీలిస్తే వాటి వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దెబ్బ తిందో కూడా గమనించవచ్చు. 24 x 7 ఉచిత విద్యుత్తు శీర్షికన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నది అని ఉంది.

మన రాష్ట్రంలో విద్యుత్ తలసరి వినియోగం 2,071 యూనిట్లు. దేశ సగటు వినియోగం 1,208 యూనిట్లు మాత్రమే. 24 గంటల సరఫరా ప్రతిష్ట కోసం ప్రభుత్వం 33 శాతం విద్యుత్తును ప్రయివేటు రంగం నుండి కొనుగోలు చేస్తోంది. కరెంటు వినియోగం పెరగడంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు మే నెలలో రూ. రెండు వేల కోట్ల దాకా చెల్లించవలసి వచ్చింది. ఆ దెబ్బకు విద్యుత్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందలేదు. ఏప్రిల్‌లో కూడా ఇదే పరిస్థితి. ఏప్రిల్ ఒకటి నుంచి కరెంటు చార్జీలు పెంపుదలతో ఆదాయం రూ. 425 కోట్లు పెరిగినా విద్యుత్ సంస్థల ఆర్థిక బాధలు తీరడం లేదు. ఇంకా ఏడు వేల కోట్లు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి విద్యుత్ శాఖకు వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలకు సరఫరా బాపతు సొమ్ము రూ. తొమ్మిది వేల కోట్లు రావాలి. వాటిని చెల్లించలేక ప్రభుత్వం ఎక్కడైనా అప్పు తెచ్చుకోండి. పూచికత్తు ఉంటామని విద్యుత్ శాఖకు ఉచిత సలహా ఇస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఆ శాఖ ఇన్ని ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టబడడానికి కారణం ప్రభుత్వం గొప్పకు పోయి తెచ్చిన పథకమే అనుకోవాలి. నిరంతరాయ సరఫరా పేరిట సంస్థను నట్టేట ముంచే కన్నా వాస్తవాలు చెప్పి ప్రజలకు రెండు గంటలు కోత విధించినా అర్థం చేసుకోగలరు. భారీ ధర చెల్లించి కొన్న కరెంటుతో పెరిగిన సగటు వినియోగం ఘనకీర్తి కానేకాదు.

స్థోమత లేకపోయినా

'రైతుబంధు పథకం కింద 63 లక్షల రైతుల ఖాతాలలో ఇప్పటివరకు రూ. 50 వేల 448 కోట్లు జమ అయింది' అని ప్రభుత్వం ప్రకటించింది. సర్కారు దృష్టిలో నాగలి పట్టి మట్టి నుండి ధాన్యం తీసినవాడు రైతు కాదు, భూయజమానియే రైతు. పై సొమ్ము వీరి ఖాతాల్లోనే పడింది. మరి 30 శాతం వ్యవసాయాన్ని నెత్తినెత్తుకున్న దాదాపు 15 లక్షల కౌలు రైతులకు ప్రభుత్వం పైసా సాయం అందడం లేదు. రైతు బంధు పథకం సొమ్ము పొందినవారిలో 13 వేల మందికి 20 నుండి 40 ఎకరాల భూమి ఉంది. వారికి అప్పనంగా ఏడాదికి రూ. 2 నుండి 4 లక్షలు ఈయడం ప్రజాధనం దుర్వినియోగమే అవుతుంది. లక్షల మంది భూయజమానులు సాగుకు దూరంగా ఉన్నారు. వీరంతా రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు ఋణంతో పాటు కౌలు కింద ఏడాదికి ఎకరానికి 10 నుంచి 20 వేలు పోగేసుకుంటున్నారు.

భూమిని ప్లాట్లు పెట్టి అమ్ముకుంటూ పథకం సొమ్ము తీసుకుంటున్నవారికంటే కౌలు రైతులు రాష్ట్రానికి పనికిరానివారయ్యారు. రైతు పంట రుణ మాఫీ కూడా ఎన్నికల హామీకి తగినట్టుగా జరగలేదు. బ్యాంకు అప్పు రైతులే సొంతంగా కట్టేసుకుంటే, నాలుగేళ్ల కాలంలో ఆ మొత్తం తిరిగి నాలుగు విడతలుగా రైతు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ఆ భారం రైతుపైనే వేసింది. కట్టగలిగినవారు కట్టి బ్యాంకు రుణాన్ని రెన్యువల్ చేసుకున్నారు. కట్టలేనివారు సర్కారు వారి చివరి కిస్తీ కోసం ఎదురుచూస్తూ బ్యాంకు దృష్టిలో డిఫాల్టర్ అయ్యారు. రైతుబంధు ఇస్తూ రూ. లక్ష దాకా బ్యాంకు అప్పు కూడా కట్టేసే స్థోమత లేనప్పుడు కేవలం ఎన్నికలలో గెలుపు కోసం హామీ ఇచ్చి రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి లాగడమే అవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్దయిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై కూడా భవిష్యత్తులో దాని నిర్వహణ భారం గురించి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా సుమారు రూ. 10 వేల కోట్ల విద్యుత్ ఖర్చుయే ఎల్లకాలం ప్రభుత్వాలకు పెద్ద గుదిబండగా మారవచ్చు అని నిపుణులు అంటున్నారు.

రైతులకందని మద్దతు

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతి నెలా రూ. 256 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటనలో ఉంది. ఇటు చేసిన పనికి బిల్లులు రాక సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులు అప్పులపాలైనట్లు వార్తలు వస్తున్నాయి. భిక్షాటనతో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. కొన్ని గ్రామాలలో 'పల్లె ప్రగతి' కార్యక్రమాలను సర్పంచులు, వార్డు మెంబర్లు బహిష్కరిస్తున్న సంఘటనలున్నాయి. హన్మకొండ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ తాను చేపట్టిన పనికి రూ. 8 లక్షల బిల్లు ఏడాదిన్నర పైగా పెండింగు ఉందని కలెక్టర్ కు మొరపెట్టుకుంది. సిద్ధిపేట జిల్లాలో ఓ సర్పంచ్ పల్లె ప్రగతి సమీక్ష వేదికపైనే డబ్బుల కోసం జోలె పట్టారు. సీసీ రోడ్ల కోసం రూ.12 లక్షలు అప్పు చేసి, బిల్లు మంజూరు కాక నెలకు రూ. 60 వేలు వడ్డీ కడుతున్నానని ఆదిలాబాద్ జిల్లాలోని సర్పంచ్ అన్నట్లు జూన్ రెండున పత్రికలో వచ్చింది. అన్ని బిల్లులు చెల్లించామని మంత్రులు చెబుతున్నా బకాయిల వార్తలు మాత్రం ఆగడం లేదు.

దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 'మద్దతు ధర' చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం అని సర్కారు అంటోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలు మద్దతు ధరతో కొనుగోలు చేసినా సదుపాయాల లేమితో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయలేకపోతున్నాయి. ఈ కేంద్రాల వద్ద లారీల కొరత, తూకంలో ఆలస్యంతో చాలా మంది రైతులు పడిగాపులు పడి అకాల వర్షాలకు బలయ్యారు. ప్రైవేటు వ్యాపారులు రాత్రి పది దాకా ధాన్యాన్ని కొంటూ వెంటనే డబ్బులు చెల్లించడంతో రైతులు ధర తక్కువకైనా వారికి అమ్మడానికి సిద్దపడుతున్నారు. ఈ రకంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో వ్యాపారులదే పైచేయి అవుతోంది. వారు క్వింటాకు ఐదారు వందలు తగ్గించడంతో అనివార్యంగా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. పండిన 68 లక్షల టన్నుల ధాన్యంలో కేంద్రాల లక్ష్యం 56 లక్షలు కాగా, మిగితాది ప్రయివేటు వ్యాపారుల చేతులలోకి పోయింది. ఇలా చాలా పథకాలు సరైన ఫలితాలు ఈయకపోగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చావు దెబ్బ తీస్తున్నాయి. భవిష్యత్తును పణంగా పెట్టి రాయితీలు పొందాలని తెలంగాణ ప్రజలు ఆశించడం లేదు. కేసీఆర్ ఆలోచనలను దేశం ఆచరించే మాట ఏమోగానీ పరిస్థితులు మరింత దిగజారితే రాష్ట్ర ప్రజలే ఆలోచించుకునే అవసరం వచ్చేలా ఉంది.

బి.నర్సన్

94401 28169

Tags:    

Similar News