తెలంగాణ యాస భాషకు కిరీటం

తెలంగాణ యాస భాషకు కిరీటం... Telangana dialect is using in telugu cinema

Update: 2023-03-13 18:45 GMT

లగం అంటే ఒక కుటుంబం, ఒక సమిష్టి సంస్కృతి పాటించేవారు, బంధుత్వంగా చెప్పుకునే పదం. అటువంటి బలగం నేడు ఆధునికత పేరుతో అభివృద్ధి, హోదా కోసం బలగం ముక్కలుగా విడిపోయి మేమంతా ఒక్కటే అని చెప్పుకునే రోజులు కరువయ్యాయి. ఒకప్పుడు ఎంత బలగం ఉంటే అంత గొప్పోడు అనే భావన ఉండేది. కానీ నేడు భవంతులు, ధనమే బలగంగా భావిస్తూ విలువైన బంధాలను దూరం చేసుకుంటున్నారు. నిజానికి బలగం గొప్ప భరోసా కలిగిన పదం. అటువంటి బలగం కేవలం ధనం వల్లనో, బంధుత్వం వల్లనో ఏర్పడింది కాదు. సమాజంలో నివసించే వ్యక్తులు ఆదరించే సంస్కృతి, సంప్రదాయాలు, భాషతో ముడిపడిన బంధం. మనుషులను పరస్పరం గౌరవించుకునే సంప్రదాయం. ఆత్మీయతకు తెలంగాణ పెట్టింది పేరు. మానవత్వం కలిగిన నేల. ఈ నేలలో ఒకసారి తమవారిగా భావిస్తే తన పొత్తిళ్లలో దాచుకుని ప్రేమను పంచే గుణం గల నేల. అటువంటి తెలంగాణ నేల అనేకమైన సంప్రదాయాలకు, సంస్కృతి అద్దం పట్టే విధంగా ఉంటుంది. అటువంటి తెగువగల నేల తెలంగాణ యాసభాషలతో గొప్ప బలగాన్ని సంపాదిస్తుంది.

హేళన చేసిన యాసే..నేడు

ప్రపంచంలో విభిన్నమైన ఆధునికతతో దూసుకెళ్ళే దేశాలు తమ మాతృభాషను గౌరవిస్తాయి. అందుకే మన దేశంలోనూ అభివృద్ధికి భాషను జోడించాలి. కానీ ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లం లేకపోతే బతకడం కష్టమనే భావన ఏర్పరుస్తున్నారు. విదేశీ భాష అవసరమే కానీ అది ఉపాధి కోసమే అని గుర్తించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి యాస భాషకు భలే డిమాండ్ మునుపెన్నడూ లేని విధంగా వచ్చింది. మన యాస భాషను అందరూ హేళన చేసేవారు. సినిమాల్లో సైతం మన యాసను వాడాలంటే సంశయించేవారు అటువంటి పరిస్థితి నేడు లేదు. ఇక్కడి యాస మాట్లాడిన సినిమాలు ఆదరణకు నోచుకుంటున్నాయి. అందుకే ప్రముఖ హీరోలు సైతం ఈ మాండలికం సినిమాల్లో వాడటం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. మన పండగలపై, సంస్కృతిపై ప్రభుత్వం సైతం గుర్తింపు తేవడంతో మరింత ఆదరణకు నోచుకుంటుంది మన యాస. ఇటీవల తెలంగాణ యాసభాషతో తీస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. యాసభాషతో పాటు స్వచ్ఛమైన తెలంగాణ పల్లెల్లో చిత్రీకరణ జరగడంతో.. తమ పల్లె అందాలను తెరమీద చూసుకొని తెగ మురిసిపోతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇక్కడి కవుల ద్వారా ఒక్కో అక్షరం నేటి వరకు మన యాసభాషకు మరింత అండగా నిలిచింది. అనేక సభల్లో మన భాష, యాస గొప్ప పోరాట శక్తిని నింపాయి. ప్రస్తుతం చిత్రపరిశ్రమలోనూ తెలంగాణ యాసభాషకు డిమాండ్ పెరిగింది. జాతిరత్నాలు, ఫిదా వంటి చిత్రాలు ఇక్కడి యాసను, సంస్కృతిని అద్భుతంగా చూపించి విజయం సాధించాయి. అలాగే ఆ సినిమాల ద్వారా ఈ ప్రాంతం వారు ఎంతోమంది కళాకారులు బయటపడుతున్నారు.

అందరిని కదిలించింది సాహిత్యమే..

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడక ముందు ఈ ప్రాంతం పేర్లను తెరమీద చూసుకునే అవకాశాలు తక్కువ. కానీ నేడు ఇక్కడి లోకేషన్లు, ఇక్కడి భాషకు, కీరిటం దక్కినట్లుంది. అలాగే ఈ మధ్యలోనే రిలీజై విజయం సాధించిన బలగం సినిమాలో కూడా ఇక్కడి సంప్రదాయాన్ని, సంస్కృతిని కళ్లకు కట్టినట్టు చూపాడు దర్శకుడు వేణు. ఆయన ఓ సామాన్య హాస్యనటుడిగా సినిమాల్లో ప్రవేశించి తన అద్భుతమైన ప్రతిభతో బలగం సినిమాని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తన సొంతూరులో చిత్రీకరించడం గొప్ప సాహసం. కన్న తల్లి గౌరవాన్ని పెంచినట్లు తన మారుమూల గ్రామాన్ని ప్రపంచానికి చూపి తన యాసభాషతో పుట్టిన నేల గౌరవాన్ని మరింత పెంచడం నిజంగా గొప్ప విషయం. ప్రపంచంలో ఏ మూలన వెళ్లిన సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశాన్ని గొప్పగా ఆదరిస్తారు. అంతటి విశిష్టమైన పేరు కలిగిన దేశంలో ..మన తెలంగాణ రాష్ట్రంలో మన భాషకు మరింత డిమాండ్ వచ్చేలా, ఆదరణ ఎప్పటికీ తగ్గకుండా ఉండకుండా ఉండేందుకు ఇటువంటి ప్రయోగాత్మకమైన చిత్రాలు రావాల్సిన అవసరం ఉంది.

తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేసే కవులు, రచయితలు, సాహిత్యాభిమానులకు ఆసరాగా ప్రభుత్వం నిలిస్తే మన మన యాసభాషకు మరింత డిమాండ్ పెరిగి.. తెలంగాణ సంస్కృతి తరిగిపోకుండా కృషి చేయాలి. మాతృభాషను డిమాండ్‌ పెరిగేలా చేస్తున్నామంటే.. మన సంస్కృతి, సాంప్రదాయాలకు మరింత ఆదరణ పెరిగేలా చేయడమే అని భావించాలి. తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా కదిలించింది మన సాహిత్యమే. అటువంటి మన సాహిత్యానికి పేరొస్తే మన తల్లిని మనం గౌరవించుకున్నట్టే. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు మన వారసత్వ సంపద.. ఆ సంపదను రాబోయే తరాలకు పంచుతూ.. మరింత డిమాండ్ పెంచేలా కృషి చేయాలి.

సంపత్ గడ్డం

7893303516

Tags:    

Similar News