తెలంగాణ పౌర సమాజం మేల్కొండి.. మేల్కొల్పండి!

Telangana Civil Society Will Educate Pepole

Update: 2023-07-14 00:15 GMT

మ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయలేకపోవడంతో పాటు.. కనీస న్యాయాన్ని నిరాకరించడం, మిగతా ప్రాంతాల సంస్కృతి, భాషలను చిన్నచూపు చూడటం జరిగింది. అందుకే రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య అసమానతలు కొనసాగాయి. ఈ ఆర్థిక, సామాజిక, అక్రమ, అసంబద్ధ చట్రాన్ని విపులంగా విశదీకరించి చెప్పిన వారు ఆ దిశగా ప్రజలను సమాయత్త పరిచినవారు పౌర సమాజంలోని లోతైన ఆలోచనపరులు.. వారు కలిగించిన తెలివిడి పరిజ్ఞానమే తెలంగాణ రాష్ట్ర కాంక్షను ప్రజలలో వేళ్ళూనుకొనేలా చేసింది. తెలంగాణ ఉద్యమంలోనే గాక సాకారంలో కూడా వీరి పాత్ర నిర్లియకమైనది. గణనీయమైనది.

రాష్ట్ర కాంక్షలను పట్టించుకోకున్నా...

పౌర సమాజం అంటే, మెరుగైన సమాజం కోసం ప్రజా సమూహాలను అత్యంత ప్రభావితం చేసే మేధావులు, కవులు, రచయితలు, గాయకులు, పత్రిక రంగంలో పనిచేసే సంపాదకులు, ఆలోచనపరులందరూ. వీరందరూ ఉద్యమ సమయంలో అనేక దక్కా ముక్కలు తిని 1956 నవంబర్ 1 నుంచి తెంపులు తెంపులుగా ఉప్పొంగిన కాంక్షను మలిదశ ఉద్యమంలో ప్రజాస్వామ్యం ముసుగులో ఈ ప్రాంతాన్ని నియంతృత్వ వర్గంగా పిలువబడే నాయకత్వం సారధ్యం వహించిన సందర్భంలో.. పౌర సమాజం ఆచితూచి అడుగులు వేయలేకపోయింది. కానీ తెలంగాణ రాష్ట్ర బలీయమైన వాంఛ ఎంతో అనుభవమున్న వీరికి సమాజ దృక్కోణంలో గతాన్ని మరిచిపోయేలా చూపు మందగింపజేసింది. తత్ పరిణామాల ఫలితమే నేటి తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ప్రజాకోణం నుంచి ఆలోచించి.. చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయత్నం మరోసారి చేయాల్సిన అవసరం ఏర్పడింది.

తెలంగాణ ప్రాంత ప్రజల మౌలిక విముక్తి జరుగుతుందని నమ్మబలికిన నాయకుడు అధికారంలోకి వచ్చాక, ఈషణ్మాత్రం కూడా అటువైపు అడుగులు వేయలేకపోవడమే గాక, ప్రజల కాంక్షలను పెద్దగా పట్టించుకోక ఏకపక్షంగా గాలికి వదిలేసాడు. తన మార్గంలో ఇష్టా రాజ్యంగా పాలన కొనసాగించాడు. అలవిమాలిన వాగ్దానాలు చేసి ఆచరణలో అమలు చేయలేకపోయాడు. కనీసం అస్తిత్వ, భౌతిక తెలంగాణను కాపాడలేక ఆయా సందర్భాలలో పల్లెత్తు మాట కూడా ఉచ్చరించలేకపోయాడు. దీనికి రెండు ఉదాహరణలు చెప్పవచ్చు, అవి భద్రాచలం పక్కనున్న 14 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పుడు నిలవరించే ప్రయత్నం చేయలేకపోవడం, రెండు ప్రాచీన తెలుగు కేంద్రాన్ని నెల్లూరుకి తరలించుకుపోయిన సందర్భం. వీటిని ప్రభుత్వ పెద్దలు నిలదీయకపోవడమే కాక దీనిపై ఇప్పటికి మౌనం పాటించడం దేనికి సంకేతం. ఈ విషయంలో పౌర సమాజం చెప్పుకోదగ్గ స్థాయిలో వ్యతిరేకించ లేకపోవడం అటు ఉంచితే.. కనీసం నిరసనను వ్యక్తపరచలేదు. అందువలన తెలంగాణ సమాజానికి, ఆలోచనా పరులకు మధ్య పైకి కనిపించని ఒక అగాధం ఏర్పడినట్లయింది.

వారిని బందీని చేసి..

ఉద్యమ కాలంలో ఆదర్శాలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక ఆచరణలో ఆశించిన విధంగా విధానాల రూపకల్పన చేసుకోలేకపోయింది. దీనికి రెండు బలమైన కారణాలున్నాయి, అవి ఒకటి తెలంగాణ గ్రామ సీమల్లో నియంతపోకడలను, అణచివేతలను ప్రదర్శించిన వర్గం కొత్త పెట్టుబడిదారి వర్గంగా రూపాంతరం చెందడం, మరొకటి ఏ సామాజిక ఉద్యమాలైతే తమను గ్రామాల నుంచి పట్టణాలకు, నగరాలకు వలస వచ్చేలా చేశాయో అట్టి ఉద్యమ శక్తులను ఒక విధమైన మోసపూరితంగా దూరం పెట్టి మెల్లమెల్లగా పథకం ప్రకారం జరుగుతూ వచ్చింది. దీని ద్వారా పాలు, పెరుగన్నం సమయానికి పెట్టిన పిల్లికి ఎలుకలను పట్టడం మానేసిన సామెత.. మననంలోకి వస్తుంది. మాటలతో, వాగ్దానాలతో నమ్మబలికి భారీ ప్రాజెక్టులకు డిజైన్ చేయించి, ప్రజా సమూహాలకు ప్రజాస్వామ్య లిబరల్ ఉదారవాదానికి తెర లేపారు. మెతుకులు విదిలించే కార్యక్రమాన్ని అనేక పథకాల ద్వారా అందించే ప్రణాళిక రచనలకు పూనుకున్నారు. ఇక్కడే బాలగోపాల్ చెప్పిన ‘రూపం- సారం’ చర్చ లేవనెత్తాల్సిన ఆలోచనాపరులు ఏదో మేరకు నిస్సహాయతలోకి వెళ్ళిపోయారు.

ఈ అసందిగ్ధ అన్చిత సమయంలోనే ప్రభుత్వం తన పల్లకీని మోసే తైనతీయులను అక్కున చేర్చుకొన్నారు. తద్వారా వారిలో తాత్కాలికంగానైనా ప్రజల సాధకబాధకాలపై కలమెత్తే, గళమెత్తే సృజనాత్మకత క్రియలను నిద్ర పుచ్చారు. గత ఉద్యమ కాలంలో వివిధ ప్రజా సంఘాలలో కోవర్టులుగా పనిచేసిన వారికి పదవులను పంచిపెట్టి భద్రలోకులుగా పరిమార్చారు. పాట శక్తిని, బలాన్ని అధినేత గ్రహించి 550 మంది కవులను, కళాకారులను తెలంగాణ సాంస్కృతిక సారధి పేరున బందీని చేసి.. ఒక విధంగా వారి స్వేచ్ఛ భావనలకు ఒక లక్ష్మణరేఖ గీసినట్టు చేశారు. చివరికి వారు కేవలం ప్రభుత్వ పథకాల ప్రచారకులుగా మిగిలిపోయారు. మరోవైపు వినిమయ వినియోగం సంస్కృతి నగరాలను ముంచెత్తుతుంది. క్రియాశీలకంగా ఉండాల్సిన వారు వస్తు సముశ్చయం వేటలో పడిపోయారు. మార్కెట్ అన్ని శ్రేణుల ప్రజలను అవసరం ఉన్నా లేకున్నా, వస్తు ప్రపంచం తీరని దాహానికి దాసోహం చేసింది. నగరాలలో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు పరిస్థితుల మధ్య అపరిచితులను చేశాయి. మానవ సంబంధాలు నైతికత నియమ నిబద్ధతలు కుంచించుకుపోయాయి. ఒక కృత్తిమ రోబోటిక్ ఫ్యాబ్రికేటెడ్ సమాజం కృత్రిమ నిర్మితంగా కనబడే వినిర్మిత శీతోష్ణస్థితి ఏర్పడింది.

నిద్ర నటించకుండా.. మేల్కొల్పండి!

ఇదివరకు ఎప్పుడూ లేనంతగా పాలకవర్గాలు.. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు ప్రజలపై వేసే ప్రభావాన్ని గుర్తించి నయానో, భయానో తమ ప్రభావానికి లోనయ్యేలా, చెప్పు చేతుల్లోకి తీసుకునేలా.. తమ అనుయాయులతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో హస్తగతం చేసుకునే పనికి ఎడాపెడా శ్రీకారం చుట్టాయి. అందుకని ఆయా యజమాన్యాలు ప్రభుత్వ మూస వార్తలలోకి పాలసీ పేరున పాదాక్రాంతం చేసుకుంది. ఆయా సంస్థల్లో పని చేస్తున్న పాత్రికేయులను పరిమిత స్వేచ్ఛకు అనుమతించింది. అయితే వీరు సభలలో, సమావేశాలలో, అపరిమిత స్వేచ్ఛ వాయువులు మీడియాలో అనుభవిస్తున్నామనే ఆలోచనలను ఇతరులతో అరమరికలు లేకుండా పంచుకున్నట్టు అపసవ్య గాంభీర్యాన్ని లౌక్యంగా ప్రదర్శిస్తుంటారు. విభిన్న రంగాలలో పనిచేస్తున్న వేతన జీవులు ఆయా యాజమాన్యాల పరిధిలోనే పనిచేయాలి. ఆ కట్టును చిన్నమెత్తు అధిగమించినట్టు సూచాయగా తెలిసినా ఉద్వాసనకు సిద్ధపడాల్సి ఉంటుంది. ఎవరు ఎవరికి గ్యారెంటీ కాదు అంతా కాంట్రాక్ట్ పద్ధతి పైనే ప్రభుత్వ యాజమాన్యాల కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇది ఒక విధంగా పాలకవర్గాలకు యాజమాన్యాలకు మధ్య పరస్పర మేళ్ళు కలిగే ఒకానొక తాత్కాలిక ఒప్పందాల మార్పిడి గా చూడాలి.

ఇలాంటి సమయంలో ముఖ్యంగా రాష్ట్ర సాధన తర్వాత, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వం దాని అగ్ర నాయకులు ప్రజలకు అందుబాటులో లేకపోవడమే కాకుండా, జన సామాన్య దర్శనానికి శాశ్వతంగా తలుపులు మూసివేశారు. ఆలోచనపరుల యోచనలను అనుమతించలేకపోవడమే కాకుండా, శత్రుపూరిత వైఖరిని అవలంబించారు. 9 ఏళ్ల తర్వాత అహంతో ప్రభుత్వం అనుసరించిన ఈ విధి విధానాల మూలంగా ఏకపక్షంగా వ్యవహరించిన పాలనపట్ల వ్యతిరేకత అనే కాకుండా, పాలకుల పట్ల ప్రజలలో విముఖతను కలిగించాయి. ఒక విధంగా పాలకులకు ప్రజలకు మధ్య ఒక అసహన శూన్య వాతావరణం ఏర్పడింది. ఈ శూన్య ప్రదేశంలోకి ప్రతిపక్షాలు ప్రవేశించే పనిని ముమ్మరం చేశాయి. ఇదిగో ఇక్కడే పౌర సమాజం క్రియాశీలకంగా చురుకుగా వ్యవహరించాల్సిన తప్పనిసరి అవసరం కలిగించింది. ఈ కార్యక్రమం రూపకల్పనలో ఆలోచనాపరులు.. తెలంగాణ జన సామాన్యానికి తమ చేతిలో ఉన్న ఓటు హక్కును సరైన దిశగా ఉపయోగించుకునేలా, నాలుగు చేతులా చేయాల్సిన ఆవశ్యకత వారి భుజస్కంధాల పైన ఉంది. రానున్న నాలుగైదు నెలల కాలంలో చైతన్యానికి మారుపేరైన తెలంగాణ పౌర సమాజం నిద్ర నటించకుండా మేల్కొని ఏం మాత్రం తాత్సారం చేయకుండా సమాజాన్ని మేల్కొల్పాల్సిన అవిభాజ్య గురుతర బాధ్యత నిర్వహించాలి.

జూకంటి జగన్నాథం,

కవి, రచయిత

94410 78095

Tags:    

Similar News