సుప్తావస్థలో తెలంగాణ కమలం....!
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెబుతూ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని ఉవ్వెత్తున ఎగిసిన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత దిక్కుతోచని నావలా సుప్తావస్థ స్థితిలోకి చేరిందని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. బీజేపీ సొంత కార్యకర్తలే తమ 17 మంది ప్రజా ప్రతినిధులు ఎవరు, వారు ఏమి చేస్తున్నారో కూడా గుర్తించలేని గుర్తు పట్టలేని స్థితిలోకి వెళ్లారనేది వాస్తవం.
రాష్ట్రంలో నమ్మిన సిద్ధాంతంతో దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలు కూడా ప్రస్తుత నాయకత్వం తీరు పట్ల తీవ్ర అసహనానికి గురవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడి తామే ప్రత్యామ్నాయమని ప్రగల్భాలు పలికి కొన్ని సీట్లు సాధించి తీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు అందరూ నిశ్శబ్దాన్ని ఎందుకు పాటిస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. కేంద్రమంత్రి పదవుల కోసం, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం పైరవీలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజల్లోకి దూసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమించాలనే కనీస విజ్ఞత రాష్ట్ర నాయకత్వానికి లేకుండా పోయింది.
విభిన్నమైన పార్టీ అని చెబుతూ...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీ తరపున విజయం సాధించారు. వీటితో పాటు ఒక ఎమ్మెల్సీ స్థానం కూడా బీజేపీకి ఉంది. ఇంతమంది ఉన్నా వారికి ఎల్లప్పుడు సమిష్టిగా పోరాడడం సాధ్యం కావడం లేదు. బయటకి అన్ని పార్టీల కంటే మేము విభిన్నమైన పార్టీ అని చెబుతూ సిద్ధాంతాల పేరుతో ఉపన్యాసాలు ఇస్తూ అంతర్గతంగా మాత్రం గ్రూప్ తగాదాలతో పార్టీని బలహీనం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కావడం, నూతన అధ్యక్షుని ప్రకటన ఇంతవరకు రాకపోవడం పార్టీ కార్యకర్తలను అసహనంతో పాటు అయోమయానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ పరిపాలనలో తలెత్తుతున్న సమస్యలను అందిపుచ్చుకొని బలంగా ప్రజల్లోకి దూసుకెళ్లాల్సిన సమయంలో ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
9 నెలల్లోనే ఇంత నిర్లిప్తతా?
కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు హామీలను నెరవేరుస్తామని ఇచ్చిన హామీ రాష్ట్ర బీజేపీ నాయకులకు కనీసం గుర్తు ఉందా? ప్రజల సమస్య పట్ల పార్టీ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని అందరూ అదే నిర్ణయంపై కట్టుబడి ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి ఒక్కో అంశం పట్ల ఒక్కో నాయకుడు ఒక్కోరకంగా ప్రకటనలు గుప్పించడం, ఆ తర్వాత మరొక నాయకుడు దానిని పరోక్షంగా ఖండిస్తూ ప్రకటనలు గుప్పించడం బీజేపీ దుస్థితికి నిదర్శనం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటనల కంటే మరో నాలుగేళ్ల తర్వాత రానున్న ఎన్నికల్లో మరోసారి నరేంద్ర మోడీ పేరు చెప్పి గెలవవచ్చు అనే నిర్లిప్త వైఖరిని అనుసరించడం ఇక్కడి నాయకుల మనస్తత్వానికి అద్దం పడుతుంది.
బీఆర్ఎస్‌కి ఉన్న సోయి లేదేం?
విద్యార్థి, నిరుద్యోగ రైతాంగ సమస్యల పట్ల ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పకడ్బందీ సమాచారంతో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రభుత్వం నుండి సమాధానం రప్పిస్తూ ప్రజలకు మేము మాత్రమే అండ అనే విధంగా ప్రజల్లోకి దూసుకెళ్తుంటే బీజేపీ మాత్రం ఇదంతా తమకు ఎందుకొచ్చిన గోల అన్నట్టు వ్యవహారం నడిపిస్తోంది. కొంతమంది సీనియర్ కార్యకర్తలు ప్రస్తుత నాయకుల పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నాయకులు ప్రజల్లోకి మాత్రమే కాదు కనీసం పార్టీ కార్యాలయానికి కూడా రాలేకపోతున్నారు అని ఇతరులతో చర్చిస్తుండడం బీజేపీకి ప్రమాద ఘంటిక. పలు సమస్యలతో బీజేపీ కేంద్ర నాయకత్వం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నా, స్థానిక రాష్ట్ర నాయకత్వం ఇంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందని ఎవరూ ఊహించలేదు.
పదవుల కోసం వెంపర్లాటా?
తెలంగాణ బీజేపీ నాయకుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కాంక్ష అసలు కనబడటం లేదు. నరేంద్ర మోడీ పేరు చెప్పి పార్లమెంట్ సభ్యులుగా గెలిచి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదిస్తే తమ జీవిత ఆశయం నెరవేరినట్లు మాత్రమే వారు భావిస్తున్నారు. ఇంకొంతమంది నాయ కులు, ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని పొందలేని వారు పార్టీ పదవులను పొంది అజమాయిషి చెలాయిస్తే సరిపోతుంది అనే స్థితిలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా పోరా టాలు చేయాల్సిన సమయంలో ఇందిరాపార్క్ ధర్నాల పేరుతో పాత చింతకాయ పచ్చడి మాదిరిగా కార్యక్రమాలను నిర్వహిస్తుండడం వల్ల సొంత పార్టీ కార్యకర్తల మధ్యనే ఈ నాయకులు నవ్వుల పాలవుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాడకపోవడమే కాకుండా కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి బాధ్యత స్వీకరించిన తర్వాత తొలి వంద రోజులలో తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేసిందో కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఉంది.
కార్యకర్తల్లో లోపించిన విశ్వాసం!
హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ విషయంపై ఒక్కో బీజేపీ నాయకుడు ఒక్కో రకంగా ప్రకటన ఇస్తున్నారు. వారు ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి వీరు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారనే భావన ప్రజల్లో కలిగేలా వ్యవహరిస్తుండడం శోచనీయం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం అసాధ్యం అనే భావన తెలంగాణ ప్రజలకే కాదు, సొంత పార్టీ కార్యకర్తలకు కూడా బలంగా కలుగుతోంది. ఈ స్థితి నుండి కార్యకర్తలను బయటకు తీసుకువచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అవకాశంగా భావించి, కార్యకర్తల్లో నూతన చైతన్యం కలిగించాల్సిన నాయకత్వం కేవలం సోషల్ మీడియా పోస్టుల వరకు మాత్రమే పరిమితమైంది. కేంద్ర నాయకత్వం తెలంగాణలో పార్టీ స్థితిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి సరైన మార్గదర్శనం చేయకుంటే ఇక తెలంగాణలో బీజేపీ ముగిసిన అధ్యాయమే అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
మాచనపల్లి శ్రీధర్
90527 89666