తెలంగాణ కళలకు పెద్దపీట..

Telangana arts will get recognition

Update: 2023-09-26 23:30 GMT

స్త కళలకు ప్రసిద్ధి అయిన పెంబర్తి జాతీయ స్థాయిలో మెరిసింది. 2023 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. తెలంగాణ నుంచి రెండు గ్రామాలు ఎంపిక అయ్యాయి. వరంగల్ జిల్లాలోని పెంబర్తి గ్రామం, సిద్దిపేట జిల్లాకు చెందిన చంద్లాపూర్ గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించింది. ప్రాకృతిక సౌందర్యంతో, సంస్కృతి, కళలకు పెట్టింది పేరైన తెలంగాణ గ్రామాలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నాయి.

ఇక్కడి అభిరుచికి అనుగుణంగా..

కాకతీయుల కాలం నుంచి పెంబర్తి గ్రామం కళలకు కాణాచి, నైపుణ్యాన్ని చేర్చి, శ్రమను కూర్చి ఆందమైన కళాకృతిగా తీర్చి ఆ కళాకారుల ఖ్యాతిని దేశవ్యాప్తం చేసింది. ఈ గ్రామం పేరు చెబితే చాలు అద్భుతమైన హస్త కళాకృతులు, ఎన్నో కళాఖండాలు మన మదిలో మెదులుతాయి. కాకతీయుల కాలంలోనే ఇనుము వినియోగం తెలియక ముందు నుంచే రాగి, ఇతర మిశ్రమ లోహాల సహాయంతో పనిముట్లను, రోజూవారీ వినియోగ వస్తువుల తయారీకి పెంబర్తి కేంద్రంగా ఉండేది. కాకతీయ రాజుల కాలంలో కళలు పరిఢవిల్లాయి. రామప్ప, వేయి స్తంభాల గుడి, ఏకశిలా తోరణాలు నేటికి సజీవంగా ఉన్నాయి. ఈనాటికీ తెలంగాణ మారుమూల పల్లెల్లో నాటి శిల్పకళ అబ్బురపరుస్తుంది. వారి కళకు ముగ్ధులైన నాటి ఏలికలు వారంతా ఒకే చోట నివాసాల ఏర్పాటుకు సంకల్పించుకొని ఏర్పరచుకున్న గ్రామమే ‘పెంబర్తి’.

మానవ శ్రమ ఆవిష్కరించిన పెంబర్తి కళలు అనేక కళా ఖండాలుగా దేశ విదేశాల్లో వర్థిల్లుతున్నాయి. అనేక మానవ అవసరమైన హస్త కళారూపాలను ఇక్కడ తయారు చేస్తారు. వీరి లోహ హస్తకళలు ఎక్కువగా ఇత్తడి, కంచు లోహాల మీద ఉంటాయి. ఈ ప్రాంతం లోహపు రేకుల కళకు ప్రసిద్ధి గాంచినది. దీనినే పురాతన కాలం నుంచి కూడా దేవాలయాలకు, రథాలకు అలంకరించడానికి ఉపయోగించేవారు. మధ్యలో కొంతకాలం ఈ కళకు ఆదరణలేక అంతరించి పోయింది. తర్వాత నిజాం నవాబు కాలంలో ఈ కళను ప్రభువులు బాగా ఆదరించడం ఈ కళకు జీవం పోసింది. వీరు తయారుచేస్తున్న షీల్డస్, మెమెంటోలు, గృహోపకరణాల వస్తువులకు ప్రపంచ మార్కెట్‍లో మంచి డిమాండ్‍ ఉంది. ఇక్కడ తయారైన కళాత్మక వస్తువులను అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్‍ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. తెలంగాణకు ఖ్యాతి అభిరుచులకు అనుగుణంగా పెంబర్తి కళాకారులు ఆకృతులు తయారు చేస్తారు. సంప్రదాయంగా వీరిది పూర్తిగా చేతిపని. తొలి తెలుగు ప్రపంచ మహాసభలకు (1975) లోగోలు, షీల్డులను తయారు చేసిన ఘనత వీరిదే. తాపడ కళలో పెంబర్తి వాసులను మించిన వారు కానరారు. వివిధ దేవాలయాలపై ఉన్న ఇత్తడి, రాగి, వెండి, బంగారు తాపడాలను తయారు చేశారు.

గొల్లభామ చీరలు..ఇక్కడి ప్రతిబింబాలు

అలాగే చంద్లాపూర్ గ్రామంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభామ చీరలు.. తెలంగాణ నేతన్నల కళానైపుణ్యానికి నిలువుటద్దంగా నిలిచాయి. కళాత్మకత, చేనేతల కలబోతకు ఈ చీరలు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. ఇక్కడి రంగనాయక స్వామి దేవాలయం, పరిసర ప్రాంతాలు గ్రామీణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందాయి. ఈ నేపథ్యంతో పాటు ఇక్కడి గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కారణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులను నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అందజేయనున్నారు.

(నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం)

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Tags:    

Similar News