ఆంధ్రోదయాన చంద్రహాస పవనాలు

TDP-Janasena- Bjp Alliance win Great victory in andhra pradesh

Update: 2024-06-05 01:00 GMT

సుదీర్ఘ రాజకీయ అనుభవం.. అనేక అంశాలపై పట్టు.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, పాలనలో అందెవేసిన చేయి.. అంతకంటే మించి గ్రేట్ పొలిటికల్ మేనేజ్‌మెంట్.. ఇవన్నీ సంక్షిప్తంగా చెబితే టీడీపీ అధినేత ‘చంద్రబాబు నాయుడు’. అధికార పార్టీ తప్పిదాలను తూర్పారపడుతూ లోకేష్ యువగళం ద్వారా చేసిన గర్జన. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశ్యంతో రాజకీయ లాభాపేక్ష లేకుండా త్యాగానికి సిద్ధపడి అవమానాలు భరించి ఎక్కడ తగ్గాలో తెలిసిన పవన్ పదునైన వ్యూహం ద్వారా సాధించిన విజయమిది.

వై నాట్ 175 అంటూ గడప గడపకు ప్రచారం చేసి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి అన్న ధోరణితో ముందస్తుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అధికార పక్షం సర్వేల ఆధారంగా వ్యూహాత్మకంగా అభ్యర్థులను మార్చి చేరికల పర్వానికి భారీగా తెరలేపి కొత్తగా వచ్చిన వారిని సైతం అభ్యర్దులుగా ప్రకటించి దూకుడుగా వున్న అధికార పక్షానికి చంద్రబాబు అరెస్ట్ పెద్ద దెబ్బ. తెలుగుదేశంతో జనసేన పొత్తు పవన్ కళ్యాణ్ చొరవతో బీజేపీ కూడా పొత్తుకు సై ఆనటం రాష్ట్ర రాజకీయాలను అనూహ్యంగా మలుపు తిప్పిన సంఘటన. ప్రారంభ దశలో కూటమి కుదుపులకు లోనైనా మోదీ అమిత్ షా సభలతో అనూహ్యంగా పుంజుకుంది. రాజధానిపై స్పష్టమైన ధ్యేయం, యువతకు ఉపాధి, అభివృద్ధికి ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో సఫలమైంది. దీనికి తోడు సంక్షేమ పథకాలు, భూ యాజమాన్య చట్టం పర్యవసానాలు ప్రభుత్వ వ్యతిరేకత ఉద్యోగుల ఆసంతృప్తి వెరసి కూటమిని గెలిపించాయి. ఎన్నికల ప్రకటన తేది నుండి అన్నీ తానై చంద్రబాబు ప్రజాగళం పేరుతో 46 రోజుల్లో 89 శాసనసభ నియోజకవర్గాల్లోని సభల్లో ప్రసంగించారు.. ఈ సభల్లో 2014-19 కాలంలో నాటి రాష్ట్ర పరిస్థితి, గత ఐదేళ్ల జగన్‌ రెడ్డి పాలనలో నేటి రాష్ట్ర పరిస్థితిని సవివరంగా వివరించి.. రాష్ట్ర విధ్వంసానికి కారణాలు, పునర్నిర్మాణ మార్గాలు, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వివేకంతో తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. సభికులకు పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టుతూ, పదునైన వ్యాఖ్యలు, ఛలోక్తులతో ప్రజలను ఆకట్టుకున్నారు.

లోకేష్ పాదయాత్ర

జనవరి 27న కుప్పంలో యువగళం పేరుతో ప్రారంభమైన 3000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసి అపురూపమైన మైలురాయిని సాధించారు..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తీరుస్తామని హామినిస్తూ.. ఎన్నికల్లో కూటమి గెలుపు ఆవశ్యకతను వివరించి ఆ దిశగా ప్రజలను ప్రభావితం చేయగలిగారు. ప్రజాగళం సభలు విజయవంతమైన తీరు రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమనే భావనను ప్రజల్లో కల్పించింది. రా.. కదలిరా… అని ప్రజలకు పిలుపు, జనవరి 5 నుంచి రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో జరిగిన రోడ్‌ షోలు, భారీ సభల్లో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి విధ్వంసక కబంధ హస్తాల నుంచి రాష్ట్ర విముక్తి కోసం ప్రజలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి కారణాలను వివరిస్తూ ప్రజలు తమ భవిష్యత్తును తమ చేతుల్లోకే తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.

ప్రాజెక్టుల విధ్వంసంపై ప్రజల్లోకి…

రాష్ట్ర సమగ్ర వికాసానికి బలమైన వ్యవసాయ రంగం ఆవశ్యకతను తొలినాళ్ళ నుంచి గుర్తించిన చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసమైన తీరుపై తీవ్ర కలత చెందారు. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం కలిగించటానికి 2023 ఆగస్టులో ఏకధాటిగా పది రోజులపాటు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో తన హయాంలో సాగునీటి ప్రాజెక్టుల అమలు తీరు, జగన్‌ పాలనలో జరిగిన నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించి సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంతో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజలకు తెలియజెప్పారు. చంద్రబాబును గత సెప్టెంబర్‌ 9న అరెస్టు చేసి 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో అక్రమంగా నిర్బంధించింది. దీంతో అధికార పార్టీ పతనం ప్రారంభమైందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

ఇదేం ఖర్మ రాష్ట్రానికి

రాష్ట్రంలో ప్రజాస్వామ్యంతో పాటు పలు రంగాలు, వ్యవస్థలు పతనమైన తీరును వివరించి.. బాధల్లో ఉన్న ప్రజలతో తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెల్లడించారు. 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' అన్న పేరు ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. జగన్‌ రెడ్డి పాలనలో అడ్డూ, అదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలు, పన్నులతో సగటు మనిషి జీవితం భారమై పోవటాన్ని చూసి కలత చెందిన చంద్రబాబు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ‘బాదుడే బాదుడు’ పేరుతో పర్యటించి ప్రజలతో మమేకమై వారితో గడిపారు. అడుగడుగునా అడ్డంకులను అధిగమించిన చంద్రబాబు వందలాది సభల్లో పాల్గొని నిత్యం ప్రజలతో మమేకమై ఇంతటి చారిత్రాత్మక విజయానికి కారణమయ్యారు.

ప్రజల్లోకి బలంగా వెళ్లిన 'సూపర్‌ సిక్స్‌'

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా మేనిఫెస్టో రూపొందించారు. సూపర్‌ సిక్స్‌ పేరిట పింఛన్‌ రూ. 4 వేలకు పెంపు, తల్లికి వందనం పేరిట పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఏటా రూ. 15వేలు చొప్పున, ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు నెలకు రూ.1500 పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. యాభై ఏళ్లకే బీసీలకు పెన్షన్‌, డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వరకు వడ్డీ లేని రుణం, నిరుద్యోగ భృతి, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం, పూర్‌ టూ రిచ్‌.. ఇలా ఎన్నో కార్యక్రమాలకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో కలసి షణ్ముఖవ్యూహంగా కొత్త పథకాలు అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో మహిళా ఓటర్లు, యువత, వృద్ధులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్గాల వారీగా విడిపోయినా.. అర్బన్‌ ప్రజలు టీడీపీకే మొగ్గుచూపారని తెలుస్తోంది.

ఆరోపణలతోనే కాలం గడిపేస్తే ఎలా?

ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు. విభజన జరిగి పది సంవత్సరాలు గడిచినా విద్యా, వైద్య సంస్థలు, పెద్ద పరిశ్రమలు రాలేదు. ప్రతిపక్షాలపై దాడులు, ఆరోపణలతో కాలం వెళ్లదీశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో ప్రజల్లో భయాందోళన ఉండడం.. తప్పుల తడకగా భూ రీసర్వే జరగడం.. పట్టాదారు పాసుపుస్తకాల్లో జగన్‌ ఫొటోను ముద్రించడం.. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని మోసం చేయడం.. ధరలు పెంచేసి నాసిరకం మద్యాన్ని అందుబాటులో ఉంచడం.. ఇసుక ధరలు బాగా పెంచేసి, అందుబాటులో లేకుండా చేయడం.. 9 సార్లు విద్యుత్తు, 4 సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచడం, పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోల్‌ డీజల్‌ ధరలు అధికంగా ఉండడం.. బటన్లు నొక్కి పథకాల డబ్బులు విడుదల చేసినా, దానికి పది రెట్లు వివిధ రూపాల్లో లాగేయడం.. తదితరాలపై ఆయా వర్గాల ప్రజల్లో అసహనం ఉంది. ఇవన్నీ పోలింగ్‌ శాతం పెరగడానికి ఓ కారణమని విశ్లేషిస్తున్నారు.

ఈ తీర్పు జగన్‌కి చెంపపెట్టు 

కోటరీ కోటలో వందిమాగధులు పొగడ్తల్లో, సంక్షేమమే సగం బలం అనుకుంటూ అభివృద్ధిని విస్మరించి మూడు రాజధానుల ముచ్చట్లతో కాలం గడిపిన అధికార పార్టీకి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. మంత్రులు వారి శాఖల పనితీరుని విస్మరించి ప్రతిపక్షాన్ని శృతిమించి విమర్శించటం, పరుష పదజాలం వినియోగిస్తూ చేయడం. అనుభవ రాహిత్యంతో శల్య సారధ్యం చేసిన పార్టీ పెద్దలు ఇలా అన్నీ కలిపి పార్టీ పుట్టిని ముంచేసాయి. ఇసుక పంపిణీలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను పరిశీలిస్తే ఇసుకాసుర అరాచకాలకు అద్దం పట్టింది. నిర్దిష్టమైన ఆబ్కారీ వ్యవస్థ లేకపోవడం. కీర్తి కండూతి, ప్రజలతో మమేకం కాకపోవడం. ఓటమికి కారణాలు

వాడవల్లి శ్రీధర్

99898 55445

Tags:    

Similar News