ఆత్మప్రబోధమా.. చాకచక్యమా?

ఆత్మప్రబోధమా.. చాకచక్యమా?... TDP gets boost with surprise MLC seat win

Update: 2023-03-27 18:45 GMT

పీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటు టీడీపీ గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. సాంకేతికంగా టీడీపీకి 23 స్థానాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్‌ (విశాఖ దక్షిణం) వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీకి 19 సీట్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని, ఈ ఏడు సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంటామని వైసీపీ నాయకత్వం మొదట భావించింది. కానీ ప్రతిపక్షం అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనూరాధను పోటీలో నిలిపింది. తిరుగుబాటు టీడీపీ ఆశలకు ఊపిరి పోసింది.

వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్‌) తిరుగుబాటు చేయడం టీడీపీ ఆశలకు ఊపిరి పోసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు విప్ జారీ చేశాయి. టీడీపీ నుంచి గెలిచిన వంశీ, కరణం బలరాం, గణేష్‌, మద్దాలి గిరి ఎవరికి ఓటు వేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వైసీపీ నుంచి గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్, ఆనం రాంనారాయణ రెడ్డి అంతరాత్మ ప్రభోధానుసారం ఓటేస్తామని ప్రకటించడంతో వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వల్లే అనురాధ గెలుపు సాధ్యమయ్యిందనేది స్పష్టం అవుతోంది.

ఆ సంతృప్తి పై ఆశలు వద్దు

తన నియోజకవర్గం ఉదయగిరిలో తానంటే ఏమిటో చూపిస్తానని, తనకు టికెట్ ఇచ్చే విషయంలో జగన్ కూడా సానుకూలంగా లేరని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో అసంతృప్తి సెగ ఎగసే వుందని సూచిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి వల్ల క్రాస్ ఓటింగ్ జరగడం టీడీపీ కలిసి వచ్చిన అంశం. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ అసంతృప్తి ఏ మేరకు సీట్ల ఫలితాన్ని ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అని పేర్కొన్న అధికార పక్షానికి అనూహ్య ఫలితాల ద్వారా జాగ్రత్తగా మెలగమని సంకేతాన్ని ఇచ్చాయి

విధానాల్లో మార్పులు రావాలి

టీడీపీ వ్యవస్థాపక విధానాల్లో మార్పులు రావాలి. కోటరీ వ్యవస్థను నియంత్రించాలి. యువతకు మహిళలకు ప్రాధాన్యతనివ్వాలి. రాష్ట్ర భవితపై ప్రజల్లో నమ్మకం కలిగించాలి. ప్రతీకారం తీర్చుకోవడం కోసం అధికారం దక్కించుకోవాలి అన్న భావాన్ని ప్రజల్లో తొలగించాలి. నాయకులు ప్రకటనలు, వాఖ్యలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలి. ఇప్పటినుండి వేసే ప్రతి అడుగు, ఎత్తులు పొత్తులు ఆలోచించి ఆచరణీయమైన రీతిలో నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా చూడాలి. ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ధైర్యం కల్పించాలి. చంద్రబాబు చాకచక్యం తెలుగుదేశం శ్రేణులలో ఉత్సాహాన్ని నింపింది. అయితే ఈ విజయంతో తెలుగు దేశం ఒంటరిగా పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అని టీడీపీ సీనియర్ల మాట. ఇది పొత్తులపై ప్రభావం చూపవచ్చు. టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడాలి. వైసీపీలోని అసమ్మతిపై ఆశలు పెట్టుకుంటే మబ్బుల్ని చూసి నీళ్ళు పారబోసుకున్నట్లే. గతంలో చంద్రబాబు చెప్పినట్లు టీడీపీ త్యాగాలకు సిద్దపడాలి. రాష్ట్ర భవిష్యత్తు స్థిరమైన రాజధాని, అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పొత్తులతో అధికార పార్టీని ఎన్నికల్లో ఎదుర్కోవాలి.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Tags:    

Similar News