వ్యవస్థలపై సునీత న్యాయపోరాటం!

Sunitha implead, over Truth and Justice in the YS Viveka Murder Case

Update: 2023-06-22 00:30 GMT

వివేకానంద కుమార్తె, సునీత చేస్తోంది ఒంటరి పోరాటం. అది వ్యక్తులపై మాత్రమే కాదు.. వ్యవస్థలపై చేస్తున్న ధర్మపోరాటం. వివేకానందరెడ్డిని హత్యచేసిన దోషులను బోనులో నిలబెట్టేందుకు కూతురు సునీత చేస్తుంది న్యాయ పోరాటం. కానీ చదివింది వైద్యశాస్త్రం. చేస్తోంది వైద్యవృత్తి. కానీ ఆమె సుప్రీంకోర్టులో లాయరుగా మారి తన తండ్రి హత్య కేసును తానే వాదించుకుని సంచలనం సృష్టించింది. ఇదో అరుదైన సంఘటన. పగ, ప్రతీకారం, అహంకారానికి ప్రతిరూపమైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఎదుర్కోవడం అంత చిన్న విషయమేమీ కాదు. అధికారం, డబ్బు, లాబీయిస్టులు వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆమె మనోధైర్యంతో ముందుకు సాగుతోంది. సునీత లేకపోతే గొడ్డలి పోటు కాస్తా గుండెపోటుగా మారేది. లేదా దాన్ని నారాసుర రక్తచరిత్రగా ప్రజల్లో ప్రచారం చేసి ఉండేవారు. ఈ వాస్తవాలు ప్రపంచానికి తెలియడానికి, ఇన్ని నిజాలు వెలుగులోకి రావడం వెనుక ఆమె పోరాట స్ఫూర్తి దాగి ఉంది. లేకపోతే జగనాసుర రక్తచరిత్ర చీకట్లో కలిసిపోయేది.

వివేకా హంతకుల ముసుగు తొలిగేనా?

సీబీఐపై వస్తున్న ఒత్తిడి వల్ల విచారణ సజావుగా జరగడం లేదనే అనుమానం ప్రజల్లో ఉంది. దీంతో సీబీఐ, లాయర్, కూతురు మూడు పాత్రలను సునీతే పోషించింది. ఆమె అలుపెరుగని పోరాటం మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది. తన తండ్రి హంతకుల ముసుగు తొలగించేందుకు రాక్షసులతో పోరాడుతోంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తన లక్ష్యం వైపు కొనసాగుతున్నారు. అధికార పార్టీ, దాని ప్రచార మాధ్యమాలు రోజుకొక అభూత కల్పనలు, అబద్ధాలను వండివారిస్తూ ఆమెను, ఆమె భర్త నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె అనేక అవమానాలు, అవరోధాలు, అభాండాలు ఎదుర్కొంటూ తాను అబల కాదు సబల అని నిరూపించుకుంటున్నారు. న్యాయస్థానంలో తనకు అనుకూలంగా కానీ, ప్రతికూలంగా కాని తీర్పులు వచ్చినా ఎక్కడా అధైర్యపడకుండా, స్థితప్రజ్ఞతతో మొండిగా ముందుకు వెళ్తున్నారు. సీబీఐ కోర్టులో సునీత తరపు లాయర్ కూడా కలిసి వాదించే వెసులుబాటు కల్పించారు. జులై 19న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సునీత పిటీషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆమె పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని అవినాష్ రెడ్డికి, సీబీఐకి నోటీసులు జారీ చేయాలని సుప్రీం ఆదేశించింది. ఈ రెండు ఘటనలు ఆమె పోరాటానికి కొంత సత్ఫలితాలను ఇచ్చాయనే చెప్పాలి.

న్యాయవాదిలా వాదనలు వినిపిస్తూ..

వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా సునీత స్వయంగా సీనియర్ న్యాయవాదిలా వాదనలు వినిపిస్తూ పలు అంశాలను ధైర్యంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు ముందు తన ఆవేదనను, బాధను వ్యక్తపరచి ప్రపంచానికి తెలిసేలా చేశారు. సుప్రీంకోర్టులో తనకు వచ్చిన అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకున్నారు. అవినాష్ రెడ్డి నిర్దోషి అని అసెంబ్లీ సాక్షిగా జగన్ రెడ్డి చెప్పిన మాటలను, అలానే హత్య గురించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ముందే తెలుసనే కీలకమైన అంశాలను సునీత ధైర్యంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవినాష్ రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలు చెరిపివేయడమే కాకుండా గుండెపోటుతో చనిపోయారనే తప్పుడు కథనాలు ప్రచారం చేసినట్లుగా ఆమె తెలిపారు. సీబీఐ అధికారులపై కేసులు పెట్టడం, సాక్షులను అదేపనిగా బెదిరిస్తూ నిందితులతో కలిసి అవినాష్ రెడ్డి ప్రభావితం చేసినట్లుగా ఆమె స్పష్టం చేశారు. తన తండ్రి చావుకు బాధ్యులు ఎవరు, ఈ కేసులో నిజమైన దోషులు ఎవరు అనే అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశాలను కోర్టు ముందు ఉంచడంలో సఫలీకృతులయ్యారు. మొత్తం పరిణామాల నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని, జగన్ రెడ్డి పాత్రపై కూడా విచారణ జరపాలని సునీత కోరారు.

రాష్ట్ర పోలీసులు నిగ్గుతేల్చలేని కేసుల్ని, అత్యంత సంచలనాత్మకమైన కేసులను సీబీఐ చేపడుతుంది. వివేకానందరెడ్డి హత్య కేసును హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చేపట్టడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం కూడా ఉంది. ఇంతటి సంచలనాత్మకమైన కేసులో జరుగుతున్న జాప్యం, సీబీఐ విచారణ జరుపుతున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. వివేకా హత్య విషయం జగన్ రెడ్డి దంపతులకు ముందే తెలుసని సునీత, సీబీఐ భావిస్తున్నారు. దీనిపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. సీబీఐ తొలుత కొంత దూకుడుగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపే ప్రయత్నం చేసింది. అంతలోనే జగన్ రెడ్డి ప్రత్యేక హోదా, పోలవరం ముసుగులో పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత సీబీఐ విచారణ జరుపుతున్న తీరుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

నేర విచారణలో ఈ జాప్యమెందుకు?

హత్యలో అవినాష్ రెడ్డి ప్రత్యక్ష పాత్ర ఉందని ఆధారాలతో సహా బయటపెట్టి అతనిని ఎనిమిదో నిందితుడిగా సీబీఐ తన ఛార్జిషీట్ లో పేర్కొంది. ఇప్పటికే పాత్రధారులు ఎనిమిది మంది తేలారు. అసలు తేలాల్సిన కుట్రదారులు వెలుగులోకి రాలేదు. ఈ నెలాఖరుతో ఈ కేసు విచారణ ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ జులై 3న ఈ కేసు విచారణ జరగబోతున్న నేపథ్యంలో గడువు పొడిగించే అవకాశం ఉంది. కుట్రదారులు ఎవరో నిగ్గుతేలే సమయానికి కేసు నీరుగారుస్తారనే భయం వెంటాడుతోంది. నేర తీవ్రత కళ్లకు కనపడుతున్నప్పటికీ విచారణ ఎందుకు సక్రమంగా జరగడంలేదో రాష్ట్ర ప్రజలకు అంతుబట్టడం లేదు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల్లో సీబీఐ నవ్వులపాలైంది. తన చేతగానితనాన్ని చాటుకుంటూ విశ్వభారతి ఆసుపత్రి వద్ద అరెస్ట్ చేయకుండా వెనుదిరిగారు. చివరకు అరెస్ట్ చేస్తున్నట్లు హడావుడి చేసి దానిని కాగితాలకే పరిమితం చేశారు. దీనిని కూడా అత్యంత గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటి?

అవినాష్ రెడ్డి వ్యవహారంలోనే ఇన్ని దాగుడుమూతలు ఆడిన సీబీఐ.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఏ మేరకు విచారిస్తారో అనే సందేహం కలుగుతోంది. సామాన్యులకు ఒకలా, అర్థ, అంగ బలం ఉన్నవారికి మరోలా వ్యవస్థలు పనిచేస్తున్నాయి. సీబీఐ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది? జాప్యానికి గల కారణాలేమిటి చట్టం ముందు అందరూ సమానమనే రాజ్యాంగ స్ఫూర్తి కొందరికే వర్తించకూడదు కదా! జగన్ రెడ్డి ఆర్థిక నేరాల విచారణలో కూడా ఇంతకంటే ఎక్కువ జాప్యం జరుగుతోంది. సీబీఐ సాచివేత ధోరణి వెనుక కేంద్ర పెద్దల జోక్యం ఉందనే అనుమానం కలుగుతోంది. వివేకా హత్య జరిగి నాలుగేళ్లు దాటింది. చివరకు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. వ్యవస్థలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని సాగదీస్తున్నారు. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖ వేదికగా జగన్ రెడ్డి పాలనపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కానీ అందుకు తగ్గట్లు చర్యలు లేకపోగా.. వారే జగన్ రెడ్డిని రక్షిస్తున్నారనే అపోహలు ప్రజల్లో ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఉన్న శ్రద్ధ ఆంధ్రా స్కామ్ లపై లేదు. అక్కడ అంత వేగంగా స్పందిస్తున్న సీబీఐ, ఈడీ.. ఏపీలో మౌనం వెనుక కారణాలు అంతుబట్టడం లేదు.

వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లితే...

తన తండ్రి చావుకు బాధ్యులెవరో తెలుసుకోవడానికి సునీత పడుతున్న ఆరాటం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఈ అన్వేషణలో ఆమె ఎంత దూరం పోవడానికైనా సిద్ధపడినట్లుగా ఉంది. సునీతను పక్కన పెట్టుకుని తాత, నాన్న, చిన్నాన్నను చంద్రబాబే చంపారని ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి మొసలి కన్నీరు కార్చారు. తన తండ్రి హత్యను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చి.. ఆ అధికారంతోటే తనపై ముప్పేట దాడిచేస్తున్నారని సునీత భావిస్తోంది. వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సింది అసలు సీబీఐనే. కానీ అలా చేయలేదు. కనీసం సునీత వేసిన పిటీషన్‌లోనైనా ఇంప్లీడ్ కావాలి. అలా కూడా జరగలేదు. పలు సందర్భాల్లో సీబీఐ న్యాయవాదులు కోర్టుకు హాజరుకాకపోవడం ఏమిటి? సీబీఐ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది. దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థలపై ప్రజల్లో విశ్వాసం కోల్పోకూడదు. వ్యవస్థల పట్ల నమ్మకం సన్నగిల్లితే సమాజంలో అరాచకం రాజ్యమేలుతుంది. వ్యవస్థలు అవస్థలు పాలైతే రాజ్యాంగానికి విలువేముంటుంది? కేంద్రంలో అధికారంలో ఉన్నవారి చేతిలో సీబీఐ అస్త్రంగా మారకూడదు. సీబీఐ చేపట్టిన కేసులు నిష్పక్షపాతంగా, వేగంగా విచారణ జరపాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. దోషులు ఏ స్థాయిలో ఉన్నా వారిని కఠినంగా శిక్షించడం ద్వారా వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం కుదురుతుంది.

ఇవి కూడా చదవండి : Vangalapudi anitha: మహిళలపై గౌరవం అంటే ఇదేనా..?

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్

99497 77727

Tags:    

Similar News