ఉపాధితోనే ఉగ్రవాదానికి చెక్
మాదక ద్రవ్యాలు ప్రపంచాన్ని మత్తులో ముంచుతుంటే, ఉగ్రవాదం అరాచకాన్ని, అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నది. ప్రపంచంలో సగానికి పైగా దేశాలు ఉగ్రవాద దాడులతో సతమతం అవుతున్నాయి.
బంధుప్రీతి, విపరీత ఉచిత హామీలు కూడా ప్రమాదమేనని శ్రీలంక పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. శాస్త్రీయ దృక్ఫథం ఉండేలా చూడాలి. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులకు రక్షణ కల్పించాలి. కుల, మత, ప్రాంతీయ, భాషా, లింగ భేదాలు లేకుండా 'భిన్నత్వంలో ఏకత్వం' అనే భావనను పెంపొందించాలి. ఏడు కోట్ల జనాభా ఉన్న ఫ్రాన్స్ మనకు 'రాఫెల్' యుద్ధ విమానాలు అమ్ముతున్నది. మనం ఇంకా మత మూఢాచారాలు పట్టుకుని వేలాడుతున్నాం. ఆలోచన చేయండి. వియత్నాం, ఇజ్రాయెల్ దేశాల వలే అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగితేనే మంచిది. ఉగ్రవాదానికి చెక్ పెట్టగలం.
మాదక ద్రవ్యాలు ప్రపంచాన్ని మత్తులో ముంచుతుంటే, ఉగ్రవాదం అరాచకాన్ని, అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నది. ప్రపంచంలో సగానికి పైగా దేశాలు ఉగ్రవాద దాడులతో సతమతం అవుతున్నాయి. రాజ్యాధినేతల నుంచి సామాన్యుల దాకా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అన్ని దేశాలు ఐక్యతగా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. మొదట మతాల మధ్య ప్రారంభమైన ఉగ్రవాద స్వభావం తదుపరి అనేక రూపాలను సంతరించుకుంది. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో ప్రారంభమైన ఉగ్రవాద దాడులు 1970 దశకం నుంచి ప్రపంచమంతా మత, రాజకీయ, ప్రాంతీయ భావజాలంతో విస్తరించాయి.
ఉగ్రవాదులు సామాన్య ప్రజలు, ఆస్తులు, ప్రభుత్వాలపై విరుచుకుపడి, ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణం అవుతున్నారు. ఇదే క్రమంలో భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళాలు 31 సంవత్సరాల క్రితం 1991 మే 21న బలి తీసుకున్నాయి. ఆయన మరణించిన రోజునే ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నాం. ఉగ్రవాదం ప్రపంచ అంతా ఒకరకంగా ఉంటే, మన భారతదేశంలో ఇస్లామిక్, వేర్పాటువాదంలా విస్తరించి ఉంది. సౌత్ ఏషియాలో, సహారా ఆఫ్రికాలో 48 శాతం ఉగ్రవాద దాడులు జరిగాయి. గ్లోబల్ టెర్రరిస్టు ఇండెక్స్-2021 ప్రకారం అప్ఘానిస్తాన్, ఇరాక్, సిరియా, మయన్మార్, సాహెల్ ప్రాంతాలు, బుర్కినా ఫాసో, డీఆర్‌సీ (కాంగో), మాలీ, నైజర్ ఉగ్రవాదంలో ముందంజలో ఉన్నాయి. భారతదేశం 12వ స్థానంలో ఉంది. 2021లో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడులతో 7,142 మంది మరణించారు. జేఎన్‌ఐఎం అనే ఉగ్రవాద సంస్థ 351 మంది మరణాలకు కారణం అయింది. ఈ సంస్థ కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిపిన దాడిలో 170 మంది మరణించగా, 200 మంది గాయపడ్డారు. ఇరాక్‌లో 524 మంది ఉగ్రవాద దాడులలో మరణించారు. ఐసిస్ ఉగ్రవాదులు 2021లో యూరప్ ఖండంలో మొత్తం 113 దాడులు చేశారు.
మన దేశంలో ఇలా
భారతదేశంలో ఉగ్రవాద దాడులు 1975లో మొదలయ్యాయి. అప్పుడు త్రిపురలో నలుగురు మృతిచెందారు. 1980లో 500 మంది మరణించారు. 1992లో 1,115 మంది ఉగ్రవాదానికి బలయ్యారు. 1999లో ఇస్లామిక్ తీవ్రవాదులు ఎయిర్ ఇండియా విమానాన్ని అప్ఘానిస్తాన్‌లోని ఖాందహార్‌కు మళ్లించారు. 1998 కోయింబత్తూర్ అల్లర్లు, 26/11 బొంబాయి పేలుళ్లు, 2001లో భారత పార్లమెంటుపై దాడి, 2007లో గోకుల్‌ఛాట్, దిల్‌సుఖ్‌నగర్ బాంబు దాడులు, 2019 పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు మీద దాడులో 46 మంది మృతి, 2021 ఏప్రిల్ మొదటి వారంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో 22 మంది పోలీసుల మరణం మన కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అనేకమంది గాయపడ్డారు. అనేక కుటుంబాలకు దిక్కు లేకుండా పోయింది. ఆయా దాడులకు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, మావోయిస్టు, తాలిబాన్ వంటి 42 సంస్థలను ప్రధాన సూత్రధారులుగా గ్రహించి నిషేధం విధించింది భారతదేశం. జమ్ము-కాశ్మీర్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎక్కువగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. మన ప్రభుత్వం 'సర్జికల్ స్ట్రైక్' చేసి ఉగ్రవాదులకు బుద్ధి చెప్పింది. ఉగ్రవాద దాడులతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరంగా 2019లో 26.4 అమెరికన్ బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లగా, 2019లో భారత దేశం 16 శాతం ఆర్థిక క్షీణత చవిచూసింది.
ఎంతకాలమీ మూఢాచారాలు
కొవిడ్-19 నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో సవాల్ విసురుతోంది. ఈ సమయంలో ప్రతీ దేశం శాంతి వైపు ప్రయాణం చేయాలి. విద్య, ఉపాధి కల్పన ద్వారా ఉగ్రవాద కట్టడికి కృషి చేయాలి. ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకుని మత ఛాంధసవాదాన్నిపెంచి పోషించే సంస్థలు, దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అమెరికాలో చెలరేగుతున్న జాతి వివక్ష (బ్రీత్ మి) సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలి. ఇతర దేశాల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకూడదు.
పాలనలో మితిమీరిన బంధుప్రీతి, విపరీత ఉచిత హామీలు కూడా ప్రమాదమేనని శ్రీలంక పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. శాస్త్రీయ దృక్ఫథం ఉండేలా చూడాలి. రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులకు రక్షణ కల్పించాలి. కుల, మత, ప్రాంతీయ, భాషా, లింగ భేదాలు లేకుండా 'భిన్నత్వంలో ఏకత్వం' అనే భావనను పెంపొందించాలి. ఏడు కోట్ల జనాభా ఉన్న ఫ్రాన్స్ మనకు 'రాఫెల్' యుద్ధ విమానాలు అమ్ముతున్నది. మనం ఇంకా మత మూఢాచారాలు పట్టుకుని వేలాడుతున్నాం. ఆలోచన చేయండి. వియత్నాం, ఇజ్రాయెల్ దేశాల వలే అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగితేనే మంచిది. ఉగ్రవాదానికి చెక్ పెట్టగలం.
(నేడు ఉగ్రవాద వ్యతిరేక దినం)
ఐ. ప్రసాదరావు
63056 82733