పంచాయితీలపై పగబట్టిన ప్రభుత్వం

పంచాయితీలపై పగబట్టిన ప్రభుత్వం... state government has a grudge against gram panchayats says veerabadra chary

Update: 2023-02-08 19:00 GMT

రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు దమ్మిడీ ఆదాయం లేక, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక, కేంద్రం ఇచ్చే నిధులను పలు ఆంక్షలతో నిలువు దోపిడీ చేస్తున్న తీరుకు విసిగి వేసారిన సర్పంచులు రాజకీయాలకు అతీతంగా ఆందోళన బాట పట్టారు. విచిత్రంగా ఇప్పుడున్న గ్రామపంచాయతీ సర్పంచులలో తొంభై శాతం పాలకపక్షం వారే అయినా వారికి కూడా మినహాయింపులు లేకుండా వారి బిల్లులు ఆపి వారిని పాలనాపరంగా వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తోంది. ప్రజలెన్నుకున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్, వార్డు సభ్యులకు సమాంతరంగా వాలంటీర్లు, సచివాలయం సిబ్బందిని నియమించి తన పార్టీ కార్యకర్తలను గ్రామ సారథులుగా, సచివాలయం కన్వీనర్లుగా నియమించి గ్రామ పాలన, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ నిర్వహించేందుకు అనధికారిక, రాజ్యాంగేతర పాలనావ్యవస్థలను నేడు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దురదృష్టకరం.

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎక్కువగా ప్రజల భాగస్వామ్యానికి నమూనాలుగా...పరిపాలనా వికేంద్రీకరణకు ఆనవాలుగా....ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రజా ప్రతినిధి వ్యవస్థకు చిరునామాలుగా... ఉండవలసిన గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రభుత్వాల నిర్వాకంతో గత దశాబ్దాలుగా నిర్వీర్యం కాబడితే, నేడు జగన్మోహన రెడ్డి మూడేళ్ల కాలంలో అవి నిర్జీవం దశకు చేరుకున్నాయనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు దమ్మిడీ ఆదాయం లేక, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక, కేంద్రం ఇచ్చే నిధులను పలు ఆంక్షలతో నిలువు దోపిడీ చేస్తున్న తీరుకు విసిగి వేసారిన సర్పంచులు రాజకీయాలకు అతీతంగా ఆందోళన బాట పట్టారు. విచిత్రంగా ఇప్పుడున్న గ్రామపంచాయతీ సర్పంచులలో తొంభై శాతం పాలకపక్షం వారే అయినా వారికి కూడా మినహాయింపులు లేకుండా వారి బిల్లులు ఆపి వారిని పాలనాపరంగా వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తుంది.

చంద్రబాబే నయమనుకునే విధంగా

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్థానంలో నేడు జగన్ స్వరాజ్యం నడుస్తుంది. ప్రజలెన్నుకున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచ్, వార్డు సభ్యులకు సమాంతరంగా వాలంటీర్లు, సచివాలయం సిబ్బందిని నియమించి తన పార్టీ కార్యకర్తలను గ్రామ సారథులుగా, సచివాలయం కన్వీనర్లుగా నియమించి గ్రామ పాలన, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ నిర్వహించేందుకు అనధికారిక, రాజ్యాంగేతర పాలనావ్యవస్తలను నేడు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దురదృష్టకరం. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో సమాంతర పాలనకు తెరతీస్తే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? గతంలో చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరిట చేసిన విధ్వంసాన్ని మించిపోయే పోకడలు నేడు రాష్ట్రంలో కనపడుతున్నాయి. ప్రజలెన్నుకున్న సర్పంచులు సంఘాలుగా ఏర్పడి ఈ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యమాలకు సిద్దమవుతున్నారు. ఈ విషయంలో ఒక రకంగా జగన్ కన్నా చంద్రబాబు నయమన్న భావన కలుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు ప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలకు స్థానికంగా సర్పంచ్ అధ్యక్షుడుగా ఉండేవాడు. కనీసం ఈ ప్రభుత్వంలో గ్రామాలలో పంచాయతీ ఒకటి ఉన్నదని, ప్రజలు నేరుగా ఎన్నుకున్న సర్పంచ్ ఒకడున్నాడన్న ఊసే లేదు.

తొమ్మిది సంవత్సరాలు పాటు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వెంట అనుచరులుగా, పార్టీ కార్యకర్తలుగా నడచిన అనేకమంది దాదాపు ఇరవై నెలల క్రితం జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికలలో గ్రామాలలో సర్పంచులుగా నిలబడి అనేక వ్యయ ప్రయాసలతో, స్వంత సొమ్ము వెచ్చించి ప్రజామోదంతో సర్పంచులుగా విజయం సాధించారు. ఆ విజయాలను తమ ఖాతాల్లో వేసుకుని విర్రవీగుతున్న పాలక పక్ష పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ అధినేత నేడు వారినే వేధిస్తున్న తీరు విశ్వాస ఘాతుకమే అవుతుంది. సర్పంచులుగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందే కరోనా మొదటి దశలో గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలకు స్వంత నిధులను వెచ్చించి, వేసవిలో మంచినీటి ఎద్దడితో పాటు సచివాలయం, ఆర్‌బికే భవన నిర్మాణాలు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, జగనన్న పచ్చతోరణం, జగనన్న కాలనీలు, సీసీ రోడ్లు, సైడు కాలువల నిర్మాణాలు ఇప్పటి వరకు గ్రామాల్లో చేపట్టిన అనేక పనులకు బిల్లులు చెల్లింపులు నేటి వరకు లేవు. చెల్లింపులకు వీలు లేకుండా సుమారు ఆరు వేల కోట్లు పంచాయితీల ఖాతాల్లోని సాధారణ నిధులతో పాటు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో సహా నేరుగా ప్రభుత్వం తన ఖాతాలోకి మార్చుకొని పంచాయతీ నిధులను నిలువు దోపిడీ చేసి, సైబర్ నేరానికి పాల్పడిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది. దాదాపు రాష్ట్రంలో ఐదు వేల కోట్లకు పైగా సర్పంచులకు బకాయిలు ఉన్న ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది.

వారి ఆశలను మొగ్గలోనే తుంచి..

పంచాయతీ ఆర్థిక వనరులైన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (CFMS) అనే ఆర్థిక లావాదేవీల విధానాన్ని చీఫ్ మినిస్టర్ ఫైనాన్షియల్ సిస్టమ్ (CMFS)గా మార్చి పంచాయతీల ఆర్థిక వనరులను ఇష్టప్రకారం వాడుకుంటున్న తీరు దుర్మార్గం. ఆర్టికల్ జీ-240 ప్రకారం స్థానిక సంస్థలకు 29 అధికారాలను కట్టబెట్టారు కానీ గ్రామాల్లో వారి పార్టీ కార్యకర్తలే వాటిని అమలుపరుస్తున్నారు. స్థానిక ప్రభుత్వాలకు తన బడ్జెట్‌లో నిధులు ఇవ్వడంలేదు. పాము ఆకలితో అయోమయంలో తన పిల్లల్ని తానే తిన్నట్టుగా జగన్ ప్రభుత్వం ఆర్థిక ఆకలితో, అధికార అహంకారంతో పంచాయతీల నిధులు మింగేస్తూ పాములా వ్యవహరిస్తుంది. ఇప్పటి సర్పంచ్‌లు కనీసం గ్రామ పంచాయితీ స్థాయిలో అర్హులైన వారికి ఒక పెన్షన్ కూడా మంజూరు చేసుకోలేని స్థితిలో ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వారిని ఉత్సవ విగ్రహంగా మార్చి, గ్రామంలో అంతా తామై ముఖ్యమంత్రి మానస పుత్రికలైన వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది వ్యవహరిస్తున్నారు. దీంతో సర్పంచులు అధికారులు చేసిన అనేక అవకతవకలకు సాక్షి సంతకందారులుగా మిగిలిపోతున్నారు. రాష్ట్రంలో అంతో ఇంతో నిలదొక్కుకుంటున్న సర్పంచులు అతికొద్ది మంది మాత్రమే. వారు కూడా కులం, డబ్బు వంటి కారణాలతో నెట్టుకొస్తున్నారే తప్పా మెజారిటీ సర్పంచులకు బిల్లులు రాకా మానసిక ఆందోళనలకు గురవుతున్నారు.

ఎన్నో ఆశలతో, ఆశయాలతో విద్యావంతులైన యువతీ, యువకులు సర్పంచులుగా తమ గ్రామాలకు సేవ చేద్దామని, రాజకీయాలలో ప్రజాసేవలతో నాయకులుగా ఎదుగుదామన్న ఉత్సాహంతో వచ్చిన అనేకమంది ఆశలను మొగ్గలోనే తుంచి వేస్తున్న నాయకత్వాలు, ప్రభుత్వనేతలు ఏదో ఒకరోజు వారి ఆగ్రహానికి గురికాక తప్పదు. రాజు సైన్యాన్ని విస్మరించినా,.. నాయకుడు కార్యకర్తలను మరచినా.. పాలకుడుపాలనా వ్యవస్థలను నిర్వీర్యం చేసినా.... మిగిలేది పరాజయమే, పరాభవమే అన్నది గుర్తించాలి. ప్రజలిచ్చిన పాలనా అవకాశాన్ని నిర్మాణాత్మక, సంస్కరణలతో కూడిన నిర్ణయాలతో, ప్రజాహితంగా ప్రజలకు శాశ్వత ప్రయోజన నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలు కాకుండా తాత్కాలిక తాయిలాలతో మభ్యపెట్టే పథకాలు ప్రజల జీవన ప్రమాణాలు పెంచలేవన్నది గ్రహించి సుపరిపాలన సాగించిన వారే మంచి పాలకులుగా ప్రజల మనస్సుల్లో పది కాలాలపాటు మనగలుగుతారు. అందుకే ప్రభుత్వం పంచాయతీలను పరిపాలనా వికేంద్రీకరణ లో భాగంగా తన పాలనా శాఖలుగా గుర్తించాలి. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా స్ధానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించాలి. ఇదే చేయని ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణకు వక్ర భాష్యం చెబుతుంది. రాజధానుల విభజన నను అసలైన పరిపాలనా వికేంద్రీకరణగా చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది

జి. వీరభద్రాచారి,

అధ్యక్షులు, గ్రామ స్వరాజ్య సాధన సమితి.

6301796606

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News