ప్రత్యేకం మణిపూర్ మహిళ

మణిపూర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక భాగస్వాములు. ఆ రాష్ట్రంలోని ఇంఫాల్‌లో గల ఇమా మార్కెట్‌ను చూస్తే మనకు ఈ వాస్తవం తెలిసిపోతుంది.

Update: 2022-06-14 19:00 GMT

ప్రస్తుతం ఇందులో కూడా మెల్లమెల్లగా మార్పు వస్తోంది. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలో ఐదుగురు మహిళలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇది ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం. 2017 లో కాంగ్రెస్ పార్టీ మూడు శాతం మహిళలకు టికెట్లు ఇవ్వగా, 2022లో 7.5 శాతం మహిళలు టికెట్లను కేటాయించింది. బీజేపీ కూడా మహిళలకు కేటాయించే టికెట్ల సంఖ్యను పెంచింది. మణిపూర్ మహిళల పరిస్థితిని అర్థం చేసుకోవడం సంక్లిష్టమే అవుతుంది. ఓ వైపు మహిళలు ఆర్థికంగా, స్వతంత్రంగా బతుకుతూ కనిపిస్తుండగా, మరోవైపు రాజకీయంగా అణకదొక్కబడుతూ కనిపిస్తుంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా బతుకుతూ కనిపించినా, ఆందోళనలో భాగస్వాములైనా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నారని భావించలేం.

ణిపూర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక భాగస్వాములు. ఆ రాష్ట్రంలోని ఇంఫాల్‌లో గల ఇమా మార్కెట్‌ను చూస్తే మనకు ఈ వాస్తవం తెలిసిపోతుంది. ఎందుకంటే ఆసియాలోనే ప్రసిద్ధిగాంచిన ఈ మార్కెట్‌ను నిర్వహించేది అందరూ మహిళలే. డేటా ప్రకారం బ్యూరోక్రసీ, మేనేజ్‌మెంట్, న్యాయ విభాగాలలో పురుషుల కంటే మహిళల భాగస్వామ్యమే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఉపాధి పొందిన మహిళల సంఖ్య కూడా అఖిల భారత సగటు కంటే ఎక్కువగా ఉంది. అంతేకాదు, ఆర్థిక వ్యవస్థతోపాటు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించడంలో అక్కడి మహిళలు ఎప్పుడూ ముందుంటారు. చరిత్రను గమనిస్తే ఇది మనకు అవగతమవుతుంది.

ఏఎఫ్ఎస్‌పీఏ (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్- సాయుధ దళాలకు అధికారాల ప్రత్యేక చట్టం)ను వెనక్కి తీసుకోవాలని ఇరోమ్ షర్మిల పదహారేళ్లు నిరాహార దీక్ష చేసింది. ఇండియన్ ఆర్మీ మణిపూర్ మహిళపై లైంగిక దాడి చేశారని ఆరోపిస్తూ 'ఇండియన్ ఆర్మీ రేప్ అస్' అంటూ నగ్నంగా, ధైర్యంగా నిరసన తెలిపిన ఘటనలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూసుకుంటే అక్కడ మహిళా రాజకీయ నాయకుల శాతం చాలా తక్కువ. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలో 60 సీట్లలో గెలిచిన మహిళలు ఐదుగురు మాత్రమే. ఓ వైపు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు మరోవైపు రాజకీయంగా వెనకబడడానికి అనేక కారణాలు ఉన్నాయి.

చారిత్రక కారణాలు

ఆర్థిక వ్యవస్థ, ఇతర విభాగాలలో మణిపూర్ మహిళలు పోషించే ప్రధాన పాత్ర అక్కడి సంస్కృతి, గిరిజన సమాజం వలన రాలేదు. దీని వెనక చారిత్ర కారణాలు ఉన్నాయి. తీవ్ర నిర్బంధంలో తమను తాము రక్షించుకునేందుకు మహిళలు అవలంబించిన విధానాలతో శతాబ్దాల తర్వాత మహిళలు పలు రంగాలలో రాణించగలుగుతున్నారు. 15వ శతాబ్దంలో ఖగెంబా అనే రాజు మణిపూర్ రాజ్యాన్ని పాలించే వారు. ఈ రాజ్యానికి నాలుగు వైపులా అహోమ్, మొగలులు, బర్మీస్, షింగ్ శత్రు సామ్రాజ్యాలు ఉండేవి. ఈ రాజ్యాలు మణిపూర్‌పై తరచూ దాడులు చేసేవి. ఈ దాడులను ఎదుర్కోవడానికి అప్పటి రాజు ఖగేంబా కొత్త నిబంధనలను తీసుకువచ్చాడు. 17 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మగవాళ్లు తప్పనిసరిగా సైన్యంలో చేరాలని ఆదేశాలు జారీ చేశాడు.

ఈ నిర్ణయం మణిపూర్ రాజ్యంలో ఉన్న కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపింది. కుటుంబాలను పోషించడానికి మగవాళ్లు అందుబాటులో లేకపోయారు. సైన్యంలో పని చేస్తున్న మగవాళ్లకు కూడా సరిగా జీతాలు ఇచ్చేవారు కాదు. దీంతో తమను తాము బతికించుకోవడానికి, ఆర్థిక పరిస్థితులను మెరుగు పర్చుకోవడానికి తప్పనిసరిగా మహిళలు మార్కెట్‌కు రావాల్సి వచ్చింది. వివిధ రకాల పనులు చేయడంతో పాటు చిన్నచిన్న వ్యాపారాలను నడపాల్సి వచ్చింది. ఇలా ఇంఫాల్ పట్టణంలో క్రమక్రమంగా ఒక పెద్ద మార్కెటే ఏర్పడింది. ఇందులో కేవలం మహిళలే పని చేస్తారు. దీని వలన మహిళలు స్వతంత్రంగా వ్యవహరించడం నేర్చుకోవడంతోపాటు సమాజ బాధ్యతలను కూడా అర్థం చేసుకోగలిగారు. ఈ మార్కెట్ ఇప్పటికీ ఉంది. ఇక్కడ సుమారు నాలుగు వేల మంది మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేస్తుంటారు.

ఆందోళనలో సైతం

ఆర్థికంగానే కాదు. సామాజిక సమస్యలపై, హక్కుల కోసం పోరాడడంలోనూ మణిపూర్ మహిళలు శతాబ్దాలుగా ముందు ఉంటూనే ఉన్నారు. 1904లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మణిపూర్ మహిళలు ముందుండి పోరాడారు. దీన్ని ఫస్ట్ వుమెన్ వార్ అని కూడా అంటారు. 1939లో కూడా వరి ఎగుమతులకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఉద్యమాన్నే నడిపారు. అప్పటి రాజు ఎదురుగా, బ్రిటిష్ కార్యాలయాల ఎదుట వేలాది మంది మహిళలు నిరసన తెలిపారు. వరి ఎగుమతులపై నిషేధం విధించడంలో విజయం సాధించగలిగారు.

రాజకీయంగా వెనక్కి ఎందుకు?

రాజకీయాల విషయానికి వస్తే మహిళల భాగస్వామ్యంలో అత్యంత అధ్వానంగా ఉన్న రాష్ట్రాలలో మణిపూర్ ఒకటి. 'మింట్' విశ్లేషణ ప్రకారం భారతదేశ సగటు కంటే మణిపూర్ రాష్ట్ర రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువ. వ్యాపారాలలో, ఇతర విభాగాలలో రాణించగలుగుతున్న మహిళలు రాజకీయాలలో రాణించలేకపోవడానికి కూడా చారిత్రక కారణాలే ఉన్నాయి. మొదటిది రాష్ట్ర చరిత్రలో మహిళా ఆధిపత్య రాజకీయ వ్యవస్థ లేకపోవడం. అక్కడ మహిళలు పరిపాలించిన దాఖలాలు లేవు. అంతేకాకుండా, రాజులుగా, రాజకీయ నాయకులుగా, సైన్యంలోనూ మగవాళ్ల ఆధిపత్యమే కొనసాగింది. రెండో కారణం భారతదేశ రాజకీయ వ్యవస్థ. ఓడిపోతారనే భయంతో ఇక్కడ పార్టీలు మహిళలకు టికెట్లు కేటాయించేందుకు వెనుకంజ వేస్తాయి. అంతేకాకుండా, పోటీ చేయాలంటే కావాల్సినంత డబ్బులు వారి వద్ద లేకపోవడం. అయితే, ప్రస్తుతం ఇందులో కూడా మెల్లమెల్లగా మార్పు వస్తోంది.

ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలో ఐదుగురు మహిళలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇది ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం. 2017 లో కాంగ్రెస్ పార్టీ మూడు శాతం మహిళలకు టికెట్లు ఇవ్వగా, 2022లో 7.5 శాతం మహిళలు టికెట్లను కేటాయించింది. బీజేపీ కూడా మహిళలకు కేటాయించే టికెట్ల సంఖ్యను పెంచింది. మణిపూర్ మహిళల పరిస్థితిని అర్థం చేసుకోవడం సంక్లిష్టమే అవుతుంది. ఓ వైపు మహిళలు ఆర్థికంగా, స్వతంత్రంగా బతుకుతూ కనిపిస్తుండగా, మరోవైపు రాజకీయంగా అణకదొక్కబడుతూ కనిపిస్తుంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా బతుకుతూ కనిపించినా, ఆందోళనలో భాగస్వాములైనా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నారని భావించలేం.

 ఫిరోజ్‌ఖాన్

జర్నలిస్ట్, కాలమిస్ట్

96404 66464

Tags:    

Similar News